Updated : 18/02/2022 13:32 IST

‘పుష్ప’ లుక్‌ వెనుక ఆమె!

ఉంగరాల జుట్టు, కోరమీసాలు, ఒత్తైన గడ్డం, చామన ఛాయ, మెడలో గొలుసులు, అతిసాధారణ దుస్తులు.. ఇలా పక్కా మాస్‌ లుక్‌లో ‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’తో హిట్టు కొట్టాడు మన అల్లు అర్జున్‌. మరి, ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపించే ఈ మెగా హీరోను ఈసారి పూర్తి మాస్‌ లుక్‌లో చూసి ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. మరి, ఇంత మార్పు ఎలా సాధ్యమైంది..? తన పక్కా మాస్‌ లుక్‌ వెనుక ఉన్నదెవరు? తనే.. ప్రముఖ మేకప్‌ ఆర్టిస్ట్‌, ప్రోస్థటిక్‌ మేకప్‌లో ప్రావీణ్యురాలు ప్రీతిషీల్‌ సింగ్‌ డిసౌజా. పంజాబ్‌కు చెందిన ఆమె.. మేకప్‌పై మక్కువతో వివిధ రకాల మేకప్‌ మెలకువల్ని అవపోసన పట్టారు. తన నైపుణ్యాల్ని సినీ పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టి ఇంతింతై అన్నట్లుగా ఎదిగారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషా చిత్రాల్లో ఎంతోమంది నటీనటులకు మేకప్‌ వేసి ఆయా పాత్రలకు ప్రాణం పోశారామె. మరి, సినిమాలో ఎలాంటి లుక్కైనా తగ్గేదేలే అంటోన్న ఈ మేకప్‌ క్వీన్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ నటన ఎంతగా ఆకట్టుకుందో.. ఆయన మాస్‌ లుక్‌ కూడా అంతే రేంజ్‌లో వైరలైంది. అయితే ఈ లుక్‌ వెనుక పంజాబ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ ప్రీతిషీల్‌ సింగ్‌ డిసౌజా కృషి దాగుంది. ఈ క్రమంలోనే స్టైలిష్‌ స్టార్‌ను మాస్‌ స్టార్‌గా మార్చిన మేకోవర్‌కు సంబంధించిన వీడియోను ఆమె ఇటీవలే సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

మేకప్‌పై మక్కువతో..!

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో పుట్టిపెరిగిన ప్రీతిషీల్‌కు చిన్నతనం నుంచే మేకప్‌ అంటే ఇష్టం. అయితే ఈ విషయాన్ని కొన్నేళ్ల పాటు పక్కన పెట్టి చదువుపైనే పూర్తి దృష్టి పెట్టారామె. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఐదేళ్ల పాటు ఓ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాతే తన మనసును మేకప్‌ పైకి మళ్లించారు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. తన తపనపై దృష్టి సారించారు. మేకప్‌ మెలకువల్ని నేర్చుకునే క్రమంలో లాస్‌ ఏంజెల్స్‌లోని సినిమా మేకప్‌ స్కూల్‌లో చేరారు. ప్రోస్థటిక్‌ మేకప్‌లో ప్రావీణ్యం సంపాదించారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన ప్రీతిషీల్‌.. తన భర్త మార్క్‌ డిసౌజాతో కలిసి ముంబయిలో ‘Da MakeUp Lab’ పేరుతో ఓ మేకప్‌ స్టూడియోను స్థాపించారు. జుట్టు, మేకప్‌, ప్రోస్థటిక్‌ మేకప్‌లో ఆరితేరిన ఆమెకు ఆ తర్వాత్తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలైంది.

మొదటి సినిమాకే జాతీయ అవార్డు!

2015లో ‘నానక్‌ షా ఫకీర్‌’ సినిమాతో తొలిసారిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ప్రీతిషీల్‌. ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు అందుకున్న ఆమె.. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆపై ‘రంగూన్‌’ సినిమాకు ‘బాలీవుడ్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అవార్డ్స్‌’లో భాగంగా ‘ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌’గా పురస్కారం దక్కించుకున్నారు. మొన్నటి ‘పద్మావత్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘చిచ్చోరే’, ‘హౌస్‌ఫుల్‌ 4’.. వంటి చిత్రాల దగ్గర్నుంచి నేటి ‘పుష్ప’, ‘శ్యామ్‌ సింగ రాయ్‌’, ‘గంగూబాయ్‌ కతియావాడీ’ దాకా.. ఆయా సినిమాల్లోని నటీనటులందరినీ వాళ్ల పాత్రలకు తగ్గట్లుగా మార్చి తన మేకప్‌ మెలకువలతో మార్చి తన మేకప్‌కు తిరుగులేదనిపించారీ మేకప్‌ క్వీన్‌. ఇలా కేవలం సినిమాలే కాదు.. పలు ప్రకటనలకూ హెయిర్‌, మేకప్‌, ప్రోస్థటిక్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌గా సేవలందించారు ప్రీతిషీల్‌.

ప్రత్యేకతలివే!

క్లాస్‌గా ఉన్న వారిని మాస్‌గా, యుక్త వయసులో ఉన్న వారిని ముసలివాళ్లుగా, సన్నగా ఉన్న వారిని లావుగా.. ఇలా తన మేకప్‌తో పాత్రను రియాలిటీకి దగ్గరగా తీర్చిదిద్దడంలో ఆమెకు ఆమే సాటి. అంతేకాదు.. ఇల్యూజన్ ఫేస్‌ డిజైన్స్‌ వేయడం కూడా తనకు వెన్నతో పెట్టిన విద్య అంటోందీ గ్రేట్‌ ఆర్టిస్ట్‌. ఇందుకు ఆమె ఇన్‌స్టాలో పెట్టే పలు మేకింగ్‌ వీడియోలే తార్కాణం. శ్యామ్‌ సింగ రాయ్‌ క్లైమాక్స్‌లో సాయి పల్లవిని వృద్ధురాలిగా, రష్మికను పక్కా గ్రామీణ నేపథ్యం ఉన్న అమ్మాయిలా.. ఇలా వారిని ఆయా పాత్రలకు తగినట్లుగా తీర్చిదిద్దిన వీడియోలు ఆమె పనితనాన్ని చాటుతున్నాయి.

ఇలా తన ప్రతిభతో బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలకు మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసిన ప్రీతిషీల్‌.. త్వరలోనే క్యారక్టర్‌ డిజైన్‌ స్కూల్‌ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నానంటోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని