Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!

సాధారణంగా అమ్మాయిలు 10-13 ఏళ్ల వయసులో రజస్వల కావడం చూస్తుంటాం. కానీ కొంతమందిలో ఈ ప్రక్రియ చిన్న వయసులోనే ప్రారంభమవుతుందని, ఏటేటా ఈ గణాంకాలు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. దీన్నే Precocious Puberty గా పేర్కొంటున్నారు. అయితే ఇందుకు కారణాలేవైనా.. దీనిపై ఉన్న అపోహలు....

Published : 16 Aug 2022 20:53 IST

కీర్తన కూతురు కృతికి పట్టుమని పదేళ్లు కూడా నిండలేదు. అయినా అప్పుడే నెలసరి మొదలవడంతో తెగ కంగారు పడుతోందామె.

తన కూతురు లాస్య శరీరంలో ఏడేళ్ల నుంచే మార్పులు రావడం గుర్తించింది రమణి. ఇంత చిన్న వయసులో రజస్వల సంకేతాలేంటని తెలుసుకునే ప్రయత్నంలో ఉందామె.

సాధారణంగా అమ్మాయిలు 10-13 ఏళ్ల వయసులో రజస్వల కావడం చూస్తుంటాం. కానీ కొంతమందిలో ఈ ప్రక్రియ చిన్న వయసులోనే ప్రారంభమవుతుందని, ఏటేటా ఈ గణాంకాలు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. దీన్నే Precocious Puberty గా పేర్కొంటున్నారు. అయితే ఇందుకు కారణాలేవైనా.. దీనిపై ఉన్న అపోహలు, సందేహాలే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయంటున్నారు. వీటిని దూరం చేసుకోవాలంటే వీటి వెనకున్న అసలు వాస్తవాలేంటో తల్లులు గ్రహించడంతో పాటు పిల్లల్లోనూ అవగాహన పెంచడం ముఖ్యమంటున్నారు.

ఇదే కారణమా?

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అయితే రజస్వల విషయంలో మాత్రం ఈ గణాంకాలు క్రమంగా మారుతున్నాయని చెప్పచ్చు. కొంతమంది అమ్మాయిల్లో 8 ఏళ్లు కూడా నిండకుండానే నెలసరి మొదలవడం చూస్తుంటాం. అయితే ఇలా త్వరగా పరిణతి రావడానికి శరీరంలో జరిగే కొన్ని మార్పులే కారణమంటున్నారు నిపుణులు. ముందుగా ఈ ప్రక్రియ మెదడులోనే మొదలవుతుందట! ఈ క్రమంలో మెదడు గొనడోట్రోపిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది పిట్యూటరీ గ్రంథిని చేరడంతో ఈ గ్రంథి ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌.. వంటి స్త్రీ ప్రత్యుత్పత్తి హార్మోన్లను విడుదల చేస్తుంది. తద్వారా ఛాతీ పెరగడం, అవాంఛిత రోమాలు, నెలసరి మొదలవడం, అండాలు విడుదలవడం.. మొదలైన శారీరక మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ఇవన్నీ సహజసిద్ధంగా జరిగేవి. కానీ చాలా తక్కువ కేసుల్లో.. థైరాయిడ్‌ సమస్యలు, మెదడు నిర్మాణంలో లోపాలుండడం, రేడియేషన్‌ థెరపీ తీసుకోవడం, అండాశయాల్లో సిస్టులు, వంశపారంపర్యంగా.. ఇలా ఇవి కూడా చిన్న వయసులోనే రజస్వల కావడానికి దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.

రజస్వలకు, ఎత్తుకు సంబంధముందా?

రజస్వలతో సంబంధం లేకుండా అమ్మాయిల్లో 18 ఏళ్లొచ్చే దాకా ఎత్తులో పెరుగుదల ఉంటుందనుకుంటారు కొందరు తల్లులు. కానీ ఇది కరక్ట్‌ కాదంటున్నారు నిపుణులు. శరీరంలో పరిణతికి సంబంధించిన సంకేతాలు కనిపించిన దాని పైనే వారుండే ఎత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు. ఉదాహరణకు.. 8 ఏళ్లకు ఎదుగుదలకు సంబంధించిన శారీరక మార్పుల్ని గుర్తిస్తే.. 10 ఏళ్లకు నెలసరి మొదలవుతుందట! ఇక అక్కడ్నుంచి రెండుమూడేళ్ల వరకు మాత్రం ఎత్తు పెరిగి ఆగిపోతారని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిలు ఎత్తు తక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అలాగని మీరు నిరాశ చెందకుండా, మీ అమ్మాయిని నిరుత్సాహ పరచకుండా.. డాక్టర్‌ సలహా మేరకు చక్కటి పోషకాహారం, ఎత్తు పెరగడానికి దోహదం చేసే వ్యాయామాలు చేయిస్తే ఫలితం ఉంటుందంటున్నారు.

అందుకే చెకప్‌ తప్పనిసరి!

చాలామంది వయసు మీరినా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెనకాడుతుంటారు. అలాంటిది చిన్న పిల్లలకెందుకు రెగ్యులర్‌ చెకప్స్‌ అనుకుంటారు. కానీ చిన్న వయసులోనే రజస్వల కావడానికి కొన్ని అనారోగ్యాలు కూడా కారణమవుతున్నాయని, వాటిని త్వరగా గుర్తిస్తే దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా అమ్మాయిల్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడే చిన్నారుల్లో త్వరగా రజస్వల మొదలయ్యే అవకాశాలు ఎక్కువంటున్నారు. కాబట్టి ఐదేళ్లు దాటిన పిల్లల్ని రెండేళ్లకోసారి డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లి.. వయసుకు సరిపడా ఎత్తు, బరువు పెరుగుతున్నారా అనే విషయం పరిశీలించుకోవాలి. అలాగే వారిలో వయసుకు ముందే పరిణతికి సంబంధించిన మార్పులేవైనా ఉన్నాయేమో చెక్‌ చేయించుకోవాలి. వీటి విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. దీర్ఘకాలంలో ఇవి మధుమేహం, కాలేయ సంబంధిత సమస్యలు, పీసీఓఎస్‌.. వంటి సమస్యలకు దారితీయచ్చట! అందుకే చిన్నారులకు ఆయా పరీక్షలు చేయిస్తూనే.. నిపుణుల సలహా మేరకు పోషకాహారం, వ్యాయామాలు వాళ్లతో సాధన చేయించాలి.

అది సహజం కాదు!

చిన్న వయసులో రజస్వల అవడం అనేది అన్ని సందర్భాల్లో సహజం కాదని.. అది అరుదుగా బ్రెయిన్‌ ట్యూమర్‌కు కూడా సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అమ్మాయిల్ని హార్మోన్‌ స్పెషలిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేయించడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. అలాకాకుండా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. వారు శారీరకంగా, మానసికంగా, సామాజిక పరంగా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఈ సమయంలో అమ్మాయికి తల్లులే అండగా నిలబడాలి. చిన్న వయసు నుంచే నెలసరి, శారీరక మార్పుల గురించి వారికి వివరించాలి. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా జరిగేవేనని చెబుతూనే.. ఈ సమయంలో పాటించాల్సిన శారీరక పరిశుభ్రత గురించి వారికి తెలియజేయాలి.

ఇలా ప్రతి తల్లీ తమ కూతురు రుతుచక్రం గురించి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. అమ్మాయిలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ తమ కెరీర్‌లోనూ దూసుకుపోగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని