విడాకులు తీసుకున్న కూతురికి ఘన స్వాగతం..!

అత్తింట్లో ఎన్ని వేధింపులైనా ఎదుర్కోవాలి.. కానీ ఆడది విడాకులన్న మాట ఎత్తితే ఈ సమాజం తప్పు పడుతుంది.. చులకనగా చూస్తుంది. పోనీ.. కూతురు పడే కష్టాలు చూడలేక పుట్టింటికి తీసుకొచ్చేద్దామా అంటే.. బంధువులు, ఇరుగుపొరుగు వారు కాకుల్లా పొడుస్తారేమోనన్న భయం! భర్త వేధింపులు, అత్తమామల ఆరళ్లతో నిత్యం నరకం చూస్తోన్న తన కూతురుని ఆ చెర నుంచి విడిపించడం కంటే ఇవేవీ ఎక్కువ కాదనిపించిందా తండ్రికి.

Updated : 18 Oct 2023 18:13 IST

(Photos: Screengrab)

అత్తింట్లో ఎన్ని వేధింపులైనా ఎదుర్కోవాలి.. కానీ ఆడది విడాకులన్న మాట ఎత్తితే ఈ సమాజం తప్పు పడుతుంది.. చులకనగా చూస్తుంది. పోనీ.. కూతురు పడే కష్టాలు చూడలేక పుట్టింటికి తీసుకొచ్చేద్దామా అంటే.. బంధువులు, ఇరుగుపొరుగు వారు కాకుల్లా పొడుస్తారేమోనన్న భయం! భర్త వేధింపులు, అత్తమామల ఆరళ్లతో నిత్యం నరకం చూస్తోన్న తన కూతురుని ఆ చెర నుంచి విడిపించడం కంటే ఇవేవీ ఎక్కువ కాదనిపించిందా తండ్రికి. అందుకే తన కూతురికి ఎంత ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపించాడో.. అంతే ఘనంగా పుట్టింటికి తీసుకొచ్చాడు. ‘ఆడపిల్ల అమూల్యమైనది. తనిలా ఇబ్బందులు పడుతుంటే చూస్తూ కూర్చోకండి.. ఆ సమస్య నుంచి తనను బయటపడేయండి..’ అని చెబుతోన్న ఆ తండ్రి మాటల్లో కూతురిపై ప్రేమే కాదు.. ఈ సమాజం ఆడపిల్లలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం కూడా ప్రస్ఫుటమవుతోంది. అందుకే ఆయనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

సాధారణంగా ఇంట్లో అమ్మాయి పుడితే నాన్నే ఎక్కువగా ఆనందిస్తాడు. తన కూతురిపై ఎనలేని అనురాగాన్ని పెంచుకుంటాడు. అంతేకాదు.. పెళ్లీడొచ్చాక తన కూతురిని మహారాణిలా, కాలు కింద పెట్టకుండా చూసుకునే సంబంధాన్నే ఏరి కోరి మరీ ఎంచుకుంటాడు. జార్ఖండ్‌ రాంచీలోని కైలాశ్‌నగర్‌ కుమ్‌హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్‌ గుప్తా అనే తండ్రి కూడా తన కూతురు సాక్షి గుప్తా విషయంలో అచ్చం ఇలాగే ఆలోచించాడు. వివాహం తర్వాతా తన కూతురు కళ్ల ముందే ఉంటుందన్న ఉద్దేశంతో.. అదే ఊర్లో ఉండే ఓ ప్రభుత్వోద్యోగికిచ్చి పెళ్లి చేశాడు.

ఆ నిజం తెలిశాక..!

అలా గతేడాది ఏప్రిల్‌లో సాక్షి పెళ్లి అక్కడి సచిన్‌ కుమార్‌ అనే వ్యక్తితో ఘనంగా జరిగింది. సచిన్‌ జార్ఖండ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైన కొన్నాళ్లు సాక్షిని ఆమె భర్త, అత్తమామలు బాగానే చూసుకున్నారు. కానీ ఆ తర్వాతే ఆమెకు వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. అయినా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సచిన్‌తోనే వివాహ బంధాన్ని కొనసాగించాలనుకుంది సాక్షి. కానీ వేధింపులు తీవ్రమవడంతో పాటు, అతనికి ఇది వరకే పెళ్లైందని, తాను రెండో భార్యనన్న నిజం తెలుసుకున్న మరుక్షణం ఆమె గుండె బద్దలైనంత పనైంది. ఎంత సర్దుకుపోయినా, తన తప్పు లేకపోయినా ఫలితం లేకపోవడంతో.. సచిన్‌తో తన అనుబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంది సాక్షి. ఇదే విషయాన్ని తన పుట్టింట్లో చెప్పడంతో.. వారు ఆనందంగా ఆమె నిర్ణయాన్ని స్వాగతించడం గమనార్హం!

విడాకులూ.. ఊరేగింపుగానే!

పెళ్లి తర్వాత నూతన వధూవరులు ఊరేగింపుగా వెళ్లడం సహజమే! ఈ క్రమంలో డీజే పాటలు, నృత్యాలు, టపాసులు కాల్చడం.. ఇలా అంగరంగ వైభవంగా వధువును అత్తారింటికి సాగనంపుతారు. పెళ్లిలోనూ తన కూతురిని ఇంతే ఘనంగా అత్తారింటికి పంపిన ప్రేమ్‌ గుప్తా.. విడాకులు తీసుకుంటానన్నప్పుడూ ఆమెను అంతే ఘనంగా పుట్టింటికి తీసుకురావాలనుకున్నారు. అందుకు తగినట్లుగానే మేళతాళాలు, టపాసుల సందళ్ల మధ్య సాక్షిని ఆనందంగా తమ ఇంటికి తీసుకొచ్చామని చెబుతున్నారాయన.

‘నా కూతురిని ఇన్నాళ్లూ అత్తారింట్లో ఎన్ని బాధలు పెట్టినా మాకోసం సర్దుకుపోయింది. అయినా వారి నుంచి వేధింపులు ఆగలేదు. దీనికి తోడు సచిన్‌కు ఇది వరకే పెళ్లైందన్న విషయం సాక్షికి ఈమధ్యే తెలియడంతో వెంటనే మాకు చెప్పింది. అన్ని ప్రయత్నాలు చేసినా.. ఇక అతనితో కలిసుండలేనని నిర్ణయించుకుంది. అందుకే మేము, మా కుటుంబ సభ్యులు కూడా నా బిడ్డను ఆ నరకం నుంచి వీలైనంత త్వరగా బయటపడేయాలనుకున్నాం. తనను సాదరంగా స్వాగతించేందుకు ముందే ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశాం. టపాసులు కాల్చుతూ, మేళతాళాల మధ్య నా కూతురు తిరిగి మా ఇంట్లో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ సమాజంలో చాలామంది నాలా ఆలోచించట్లేదు. కట్టుబాట్ల పేరుతో కూతురు పడే బాధల్ని మౌనంగా భరిస్తున్నారు. కానీ ఇది కరక్ట్‌ కాదు. ఆడపిల్లలు ఎంతో అమూల్యమైన వారు. కాబట్టి భర్త, అత్తింటి వారితో వారు పడే ఇబ్బందుల్ని మౌనంగా చూస్తూ కూర్చోకుండా.. వారిని గౌరవమర్యాదలతో తిరిగి పుట్టింటికి తీసుకురండి.. ఇతరులు అనే మాటల్ని పక్కన పెట్టండి.. ఈ సమాజంలో వారి గౌరవం పెంచండి..’ అంటూ చెప్పుకొచ్చారీ తండ్రి.

అలాంటి వారికి చెంపపెట్టు!

ఇలా అత్తింటి నుంచి తిరిగి పుట్టింటికి తీసుకొచ్చే క్రమంలో తన కూతురిని భారంగా కాకుండా.. బాధ్యతగా భావించారు ప్రేమ్‌. అంతేకాదు.. తన కుమార్తె వేధింపుల నుంచి విముక్తి పొందడం సంతోషంగా ఉందని.. ఆ ఆనందంతోనే ఆమెకు ఇలాంటి ఘనస్వాగతం ఏర్పాటుచేసినట్లు చెబుతున్నారాయన. ఇలా ఈ నాన్న మనసులో తన కూతురిపై ప్రేమే కాదు.. ఈ సమాజం ఆడపిల్లలకివ్వాల్సిన ప్రాధాన్యం కూడా కనిపిస్తోంది. మహిళా సాధికారతకు గొప్ప ఉదాహరణగా మారిన ఈ గ్రేట్‌ డ్యాడ్‌.. తన కూతురి విడాకుల ఊరేగింపు వీడియోను ఫేస్‌బుక్‌లో పంచుకోగా.. విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది.

‘ఆడపిల్లల్ని గుండెలపై కుంపటిగా భావించే ఎంతోమంది తండ్రులకు ఈ నాన్న చేసిన పని చెంపపెట్టు లాంటిద’ని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ తండ్రీకూతుళ్ల కథ దేశవ్యాప్తంగా పాపులరవుతోంది. ప్రస్తుతం సచిన్‌తో విడాకులకు అప్లై చేసిన సాక్షి.. వాటి కోసం ఎదురుచూస్తోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ‘ఇదేం విడ్డూరం..’ అంటూ నొసలు చిట్లించుకునే వాళ్లు తమ ఆలోచనా విధానం మార్చుకుని.. ఆడపిల్లల వైపు నుంచి కూడా కాస్త ఆలోచించే ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్