ఇల్లే నందనవనం

మునుపటిలా ఇంటి ముందు విశాలమైన ఖాళీ స్థలం ఉండటంలేదు. ఇంట్లోనే కాలక్షేపం చేసే వెసులుబాటూ లేదు. అయితేనేం అంటూ మొక్కల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు నేటి వనితామణులు. వంటావార్పూ పిల్లల పెంపకం లాంటి బాధ్యతల్లో మొక్కల్నీ చేర్చేసి ఇళ్లను నందనవనాలు చేసుకుంటున్నారు.

Published : 21 Feb 2022 01:28 IST

మునుపటిలా ఇంటి ముందు విశాలమైన ఖాళీ స్థలం ఉండటంలేదు. ఇంట్లోనే కాలక్షేపం చేసే వెసులుబాటూ లేదు. అయితేనేం అంటూ మొక్కల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు నేటి వనితామణులు. వంటావార్పూ పిల్లల పెంపకం లాంటి బాధ్యతల్లో మొక్కల్నీ చేర్చేసి ఇళ్లను నందనవనాలు చేసుకుంటున్నారు. తాము పాటిస్తున్న సూత్రాలు మనకూ చెబుతున్నారు...

* పూర్వంలా విశాలమైన స్థలాలు ఈ కాలంలో కష్టమే. అంతమాత్రాన వెనకడుగు వేయనవసరం లేదు. ఉన్న కొద్ది స్థలంలోనే మొక్కలు పెంచేయొచ్చు. ప్రతీ అంగుళాన్నీ తెలివిగా వినియోగించుకోవాలి. చిక్కుడు, కాకర, సొర, పొట్ల తదితర తీగ మొక్కలకు పందిరి వేయడం వల్ల ఆ స్థలమంతా నీడ కమ్ముకుని ఇతర మొక్కలకు చోటుండదు. అందుకు బదులుగా తడికలు లేదా గ్రిల్స్‌కు పాకేలా చేయాలి.
* ఓ పక్కన కొద్దిపాటి స్థలంలో గడ్డి పెంచితే సాయంత్రం కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకోవడానికి బాగుంటుంది. పిల్లలకు లాన్‌లో ఆడుకోవడం అంటే మహా ఇష్టం.
* వరండాలోనూ కుండీలు పెట్టి అనేక మొక్కలు నాటొచ్చు. తీగ మొక్కలను మేడ మీదికి పాకించి అక్కడక్కడా కిందికి వేలాడేలా చేస్తే ఆ అందమే వేరు. ఏ డెకొరేటివ్‌ పీసూ దానికి సాటిరాదు. అక్కడ రెండు సోఫాలు ఏర్పాటు చేస్తే ఆ చల్లగాలి ముందు ఏసీ గాలి దిగదుడుపే.
* పెద్ద పెద్ద కుండీలు జరపడం కష్టం. అందుకు బదులుగా మొక్కలకు చక్రాలున్న సిమెంటు తొట్టెలను వాడితే స్థల మార్పిడి సులువవుతుంది. ఈ మొక్కల మధ్య టీ తాగుతూ సేదతీరొచ్చు. స్నేహితులొస్తే కలిసి కూర్చోవచ్చు. వ్యాయామం చేయొచ్చు.
* పడక గది కిటికీ బయట పారిజాతం, నైట్‌ క్వీన్‌, మల్లెలు, మొల్లలు లాంటి మొక్కలు నాటండి. రాత్రివేళ ఆ పరిమళాలు సేద తీర్చి హాయిగొల్పడమే కాదు, చక్కగా నిద్ర పడుతుంది.
* మొక్కలతోబాటు పక్షులూ ఉంటే అద్వితీయమైన ఆనందం కదూ! అలాగని వాటిని పంజరాల్లో బంధించనవసరం లేదు. ఒక పక్కగా పాత్ర పెట్టి రోజూ కొన్ని ధాన్యం గింజలు వేస్తే గువ్వలు కువకువలాడుతూ వస్తాయి. కొన్ని నీళ్లు కూడా ఏర్పాటు చేస్తే అవి వచ్చిపోతూ మీకు కనువిందు చేస్తాయి. పర్యావరణ పరిరక్షణ చేసినవారవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్