ఆమె... మోడల్, బాక్సర్, పోలీస్!
ఉన్నది ఒక్కటే జీవితం.. నచ్చింది చేసుకుంటూ వెళితేనే దానికి సార్థకత! ఇదీ ఏక్షా అనుసరించే మంత్రం! అందుకే బాక్సర్, బైకర్, పోలీస్, మోడల్.. ఏది అవ్వాలనుకున్నా సాధిస్తూ వెళ్లింది.
ఉన్నది ఒక్కటే జీవితం.. నచ్చింది చేసుకుంటూ వెళితేనే దానికి సార్థకత! ఇదీ ఏక్షా అనుసరించే మంత్రం! అందుకే బాక్సర్, బైకర్, పోలీస్, మోడల్.. ఏది అవ్వాలనుకున్నా సాధిస్తూ వెళ్లింది. ఇంతకీ ఎవరా ఏక్షా? తెలియాలంటే చదివేయండి.
రంగుల దుస్తులు, చుట్టూ క్లిక్‌మనే కెమెరాలు చిన్నారి ఏక్షాని ఆకర్షించాయి. అందుకే వాళ్ల జిల్లాలో ఏ ఫ్యాషన్ పోటీ అయినా పాల్గొనేది. అమ్మాయైనా, అబ్బాయైనా ఫిట్‌నెస్ ముఖ్యమని ఆ తరగతుల్లో చేరమన్నాడు వాళ్ల నాన్న. ఈసారి ఏక్షాని బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థిని మట్టికరిపిస్తున్న మేరీకోమ్ ఆకర్షించింది. ఇంకేం... బాక్సింగ్ నేర్చుకుంటానంది. నాన్న ప్రోత్సాహంతో దూసుకెళ్లింది. ఎంతలా అంటే.. జాతీయస్థాయిలో పతకాలు సాధించేంతగా! వీళ్లది సిక్కింలోని రంబక్ అనే మారుమూల పల్లె. నాన్న తమ్ముడికి బైక్ నేర్పుతోంటే ఏక్షాకి అదీ నచ్చేసింది. ఈసారీ నాన్న మాట ‘సరే’ననే! అక్కడా నేర్చుకోవడంతో ఆగలేదు. రేసులు, లాంగ్ డ్రైవ్‌లకు ఝుమ్మంటూ దూసుకుపోయేది.
‘ఎంతసేపూ సరదాలూ, ఆటలేనా? ప్రజలకీ ఏదైనా చేయాలి’ అనిపించింది ఏక్షాకి. సిక్కిం పోలీస్ ఫోర్స్‌కి దరఖాస్తు చేసుకొని ఎంపికైంది. 14 నెలల కఠిన శిక్షణయ్యాక 19 ఏళ్ల వయసులో సర్వీసులో చేరింది. మంచి ఉద్యోగం.. హమ్మయ్యా, స్థిరపడ్డా అనుకోలేదు. చిన్ననాటి కల.. మోడలింగ్‌లోనూ రాణించాలనుకుంది. పోలీసు శిక్షణ సమయంలోనే అనుమతి తీసుకొని పోటీల్లో పాల్గొనేది. అలా 2018లో ‘మిస్ సిక్కిం’గా గెలిచింది. మోడల్‌గా దేశమంతా గుర్తింపు పొందాలన్నది తన కోరిక. 2021.. ఎంటీవీ సూపర్ మోడల్ పోటీలో మూడో స్థానం వరకూ చేరుకుంది. అక్కడిదాకా వచ్చి ఆగిపోయినందుకు ఏక్షా బాధపడింది. కానీ.. న్యాయనిర్ణేతలు మలైకా అరోరా, మిలింద్ సోమన్ తన గురించి విని, తన పట్టుదల, దీక్ష చూసి స్ఫూర్తి పొందామని ప్రశంసించారు. అంతేనా.. మోడల్‌గా తను కోరుకున్న గుర్తింపూ, అవకాశాలూ దక్కాయి. తనకన్నీ అమరాయి.. నచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్తోంది అనుకుంటున్నారా? ఆ కుటుంబానికి జీవనాధారం తన జీతమే! తమ్ముడిని చదివిస్తోంది. అందుకే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ‘వండర్ ఉమన్.. ఎంతో మందికి ఆదర్శం’ అంటూ ట్విటర్ వేదికగా ప్రశంసించారు. ఇప్పుడు తన లక్ష్యం ‘ఆసియా నెక్స్ట్ టాప్ మోడల్’ పోటీల్లో నెగ్గడం! ఆ సన్నద్ధతలోనే ఉంది. ఓవైపు ఉద్యోగం, మరోవైపు కలల సమన్వయమెలా అంటే ‘మనల్ని మనం నమ్మి, మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధ్యమే’ అంటుందీ 22 ఏళ్లమ్మాయి. ఏక్షా హంగ్ సబ్బా ఉరఫ్ ఏక్షా కెరంగ్.. పేరు దేశ సరిహద్దు దాటి ఖండాలకూ పాకనుంది. ఆల్ ద బెస్ట్ చెబుదామా మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.