మేమున్నామని...

రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై అవగాహన కలిగిస్తూ.. గ్రామీణ స్త్రీల్లో చైతన్యం తీసుకొస్తున్నారు తిరుపతికి చెందిన డాక్టర్‌ అమ్మలూరు పద్మజ. న్యూదిల్లీలోని ఎయిమ్స్‌ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ చేశారామె. సేవామార్గాన్ని   ఎంచుకున్న పద్మజ పీడియాట్రిక్స్‌లో ఎంఎస్సీ నర్సింగ్‌ చేశారు.

Updated : 17 Sep 2021 12:33 IST

అయిన వాళ్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో... కొవిడ్‌ రోగులకు ‘నేనున్నా’ అంటూ భరోసాను కల్పించారొకరు. గ్రామీణ స్త్రీలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు మరొకరు. వీరందించిన అత్యుత్తమ సేవలకుగానూ జాతీయ స్థాయిలో ఇచ్చే ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుని అందుకుని శెభాష్‌ అనిపించుకున్నారు..

క్యాన్సర్‌పై అవగాహనకు

రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై అవగాహన కలిగిస్తూ.. గ్రామీణ స్త్రీల్లో చైతన్యం తీసుకొస్తున్నారు తిరుపతికి చెందిన డాక్టర్‌ అమ్మలూరు పద్మజ. న్యూదిల్లీలోని ఎయిమ్స్‌ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ చేశారామె. సేవామార్గాన్ని   ఎంచుకున్న పద్మజ పీడియాట్రిక్స్‌లో ఎంఎస్సీ నర్సింగ్‌ చేశారు. పిల్లల నర్సింగ్‌పై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ సాధించారు. శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)లో నర్సింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. స్విమ్స్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ బాధితులు పెరగడాన్ని గమనించి ఆ విషయంలో అవగాహన తీసుకురావాలని భావించారు. ఇందుకోసం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ రొమ్ము క్యాన్సర్‌పై 3500 మందికి అవగాహన కల్పించారు. 1993 నుంచి స్విమ్స్‌ నర్సింగ్‌ కళాశాలలో పనిచేస్తూ వైస్‌ ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆలిడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఓఎస్‌డీగా పనిచేస్తున్నారు. మరోపక్క అవయవదానంపైనా దృష్టి పెట్టారు.  బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తుల కుటుంబసభ్యులకు అవగాహన కల్పించి.. 270 మంది అవయవదానం చేసే దిశగా కృషి చేశారు. తాను సేవ చేయడమే కాకుండా... వైద్యంలో నవతరాన్ని ప్రోత్సహించేందుకు ఎంఎస్సీ, బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు ఉపయోగపడేలా నాలుగు పుస్తకాలు రచించారు. ఈమె ఉత్తమ వైద్యసేవలకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అవార్డులు అందించాయి. వైద్యసేవలతోపాటు ఆధ్మాత్మికంగానూ ప్రజల్లో ఛైతన్యం తీసుకురావడానికి నెల్లూరు జిల్లాలో నిత్యాన్నదాన సత్రం, కల్యాణమండపాలను ప్రజల సహకారంతో నిర్మించారు. ఆమె భర్త డాక్టర్‌ మునుస్వామి స్విమ్స్‌ అత్యవసర విభాగం సీఎంఓగా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు కూడా వైద్యవిద్య అభ్యసిస్తున్నారు.

- బొబ్బా రాజేంద్రప్రసాద్‌, తిరుపతి


సేవా‘రూప’ ం

కొవిడ్‌ విస్తృతితో అందరూ భయపడుతున్న సమయంలో శ్రీహరికోట షార్‌లో తన వైద్యసేవలను అందించి ఆదర్శంగా నిలిచారు దిద్ది రూపకళ. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని షార్‌ ఆసుపత్రిలో సీనియర్‌ నర్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు రూపకళ. తెలంగాణలోని కొత్తగూడేనికి చెందిన ఆమె మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి చిరువ్యాపారి, తల్లి గృహిణి. పదో తరగతి తర్వాత జీఎన్‌ఎం కోర్సు చేశారు. అనంతరం సికింద్రాబాద్‌లోని గాంధీ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేశారు. బీఎస్సీ చదివేటప్పుడే కళాశాల టాపర్‌గా నిలిచి అప్పటి హైదరాబాద్‌ మేయర్‌ కార్తికారెడ్డి నుంచి బంగారు పతకాన్ని అందుకున్నారు. ఆ తర్వాత సర్జరీ, ల్యాప్రోస్కోపీ తదితర ప్రత్యేక కోర్సులు చేసి విదేశాలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ సమయంలోనే షార్‌ ఆసుపత్రిలో నర్సు ఉద్యోగాల నియామకానికి 2008లో నోటిఫికేషన్‌ వెలువడింది. దీనికి దరఖాస్తు చేసి ఎంపికయ్యారు. కుటుంబసభ్యులు, స్నేహితులు వద్దంటున్నా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో 2008 ఆగస్టులో విధుల్లో చేరారు. ప్రస్తుతం సీనియర్‌ నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. షార్‌ ఆసుపత్రిలో పనిచేయడం అంత సులువైన విషయం కాదు. బయట ఆసుపత్రులతో పోలిస్తే షార్‌లో విధుల నిర్వహణ భిన్నంగా ఉంటుంది. కొంచెం సాహసంతో కూడిన పనే అనాలి. 24 గంటలూ అందుబాటులో ఉండాలి. బయటకు వెళ్లాలంటే విధిగా అనుమతి తీసుకోవాలి. దీంతోపాటు రాకెట్‌ ప్రయోగ సమయంలో ప్రయోగ వేదికల వద్ద తక్షణమే స్పందించి ప్రథమ చికిత్స (ఫస్ట్‌ ఎయిడ్‌) అందించాలి. ఇలాంటి ఎన్నో వైద్యసేవలు అందించారామె. కొవిడ్‌ వైరస్‌ రెండు విడతల్లోనూ షార్‌లో విలయతాండవం చేసింది. ఎంతోమంది దాని బారిన పడ్డారు. క్షణం తీరికలేకుండా వారందరికీ షార్‌ ఆసుపత్రిలో సేవలందించారు రూపకళ. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఇచ్చే ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ పురస్కారాన్ని నర్సింగ్‌కు సంబంధించి మూడు విభాగాల్లో ఇస్తుంటారు. వాటిల్లో దేశ వ్యాప్తంగా నర్సింగ్‌లో ఉత్తమ సేవలందించిన ముగ్గురిని ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ పురస్కారానికి ఎంపిక చేయగా అందులో డి.రూపకళా ఉన్నారు.

-కల్లిపూడి దేవేంద్రరెడ్డి, శ్రీహరికోట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్