Published : 01/11/2021 21:30 IST

అత్తాకోడళ్లు ఒకటవుతున్నారు...

నేటి అత్త నిన్నటి కోడలైతే.. నేటి కోడలు రేపటికి అత్త అవుతుంది.  తరతరాలుగా ఈ ఇరువురి పాత్రలపై, వారి గొడవలపై ఎన్నో కథలు, కావ్యాలు, పాటలూ... వచ్చాయి. ఇప్పుడు కోడలి అభిరుచులకు పెద్దపీట వేసేలా అత్తగారు మారితే, ఆమె మాటకు గౌరవం ఇస్తూనే.. తన కెరియర్‌లో నిలదొక్కుకునే స్థాయికి కోడలు ఎదుగుతోంది. ఇందుకు ఉదాహరణే ఈ కథనం.

దిల్లీకి చెందిన మంజరీ సింగ్‌, ఆమె అత్త హిరణ్మయీ శివానీ కలిసి ప్రారంభించిన క్లౌడ్‌ కిచెన్‌ ‘ద ఛౌంక్‌’ రాష్ట్రవ్యాప్తంగా రుచులను అందిస్తోంది. హిరణ్మయి సొంతూరు పట్నా. గతేడాది కొవిడ్‌ సమయంలో కనీసం హోటల్స్‌ కూడా తెరవకపోవడంతో ఆహారం అందడం లేదని తెలుసుకుంది. ఆ సమయంలో బిహారీ వంటకాలైన జల్‌మురీ, చౌరా మటర్‌, బాజ్ఖా, చురాబాదం, దాల్‌ పూరీ, ఖీర్‌ కచోరీ, పులావ్‌ వంటి రుచుల్ని పరిచయం చేయాలనుకుంది. మనసులోని మాటను కోడలు మంజరితో పంచుకుంది హిరణ్మయి. ఇద్దరూ కలిసి ప్రారంభిందే ‘ద ఛౌంక్‌’. స్ట్రీట్‌ ఫుడ్‌ స్టైల్‌లో మొదలుపెట్టిన ఈ క్లౌడ్‌ కిచెన్‌లో తయారు చేసే వంటకాల వివరాలు, సంబంధిత ఫోన్‌ నెంబర్లను సోషల్‌మీడియాలో ఉంచారీ అత్తా కోడళ్లు. రూ.110 నుంచి రూ.445లోపు మాత్రమే వంటకాల ఖరీదు ఉండటంతో వీరికి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఒకటీ రెండు ఆర్డర్లతో ప్రారంభమై, ప్రస్తుతం రోజుకి 40 వరకూ అందించే స్థాయికి చేరుకున్నారు. నెలకు రూ.4 లక్షల ఆదాయమూ అందుకుంటున్నారు.

ఈ స్టార్టప్‌ ఎదుగుదలలో ఇద్దరి కృషీ ఉందంటోందా అత్త. ‘మేం వండుతున్న లిట్టీ ఛౌఖాకు ఎక్కువగా ఆర్డర్లు వస్తుంటాయి. సంప్రదాయ పద్ధతిలో చేస్తున్న మా వంటకాలను ప్రత్యేకంగా గార్నిష్‌ చేయకుండానే వినియోగదారులకు పంపుతాం. రుచీ, శుభ్రత, నాణ్యతలకు పెద్దపీట వేయడంతో అందరికీ నచ్చుతున్నాయి. అంతేకాదు... పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్‌ డబ్బాలకు బదులుగా ఎయిర్‌టైట్‌ గాజుపాత్రల్లోనే ఆహారాన్ని సరఫరా చేస్తున్నాం. వాటిని తర్వాత వినియోగదారులు మళ్లీ వాడుకోవచ్చు కూడా. ఏ కొత్త వంట చేయాలన్నా, మరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా భేషజాలు లేకుండా మాట్లాడుకుంటాం. ఇద్దరం కలిసి ఓ మాట మీద నడుస్తాం.. నా కోడలితో కలిసి వ్యాపారం చేయడం  సంతోషంగా అనిపిస్తోంది. మా ఇద్దరి అభిరుచులూ ఒకటే. మంచి స్నేహితులుగా మెలుగుతాం. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ ద్వారా మా వంటకాలను వినియోగదారులకు చేరుస్తున్నాం. త్వరలో దిల్లీతోపాటు ముంబయి, పుణె, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా అవుట్‌లెట్స్‌ను తెరవనున్నాం. ఆకలికి మాత్రమే ఆహారం కాదు. ఆ రుచిని ఆస్వాదిస్తూ దాన్ని మర్చిపోలేని జ్ఞాపకంగా నిలపాలన్నదే మా లక్ష్యం. అందుకే వినియోగదారులకు మా వంటలంటే అంత ప్రేమ’ అని చెబుతున్న ఈ అత్తాకోడళ్లు ఈతరంలో స్ఫూర్తి నింపుతున్నారు కదూ!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని