ఫల్గుణి చెబుతున్న పాఠాలివి!

ఆమె పుట్టిందేమో మామూలు గుజరాతీ వ్యాపార కుటుంబంలో. నాన్నని చూసి వ్యాపారంపై ఆసక్తి కలిగింది. కామర్స్‌లో డిగ్రీ, ఐఐఎం నుంచి మేనేజ్‌మెంట్‌లో పట్టా పొందింది. తర్వాత కొటక్‌ మహీంద్రాలో ఉద్యోగం. పెళ్లి, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.

Updated : 29 Feb 2024 17:05 IST

ఆమె పుట్టిందేమో మామూలు గుజరాతీ వ్యాపార కుటుంబంలో. నాన్నని చూసి వ్యాపారంపై ఆసక్తి కలిగింది. కామర్స్‌లో డిగ్రీ, ఐఐఎం నుంచి మేనేజ్‌మెంట్‌లో పట్టా పొందింది. తర్వాత కొటక్‌ మహీంద్రాలో ఉద్యోగం. పెళ్లి, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. ఉద్యోగంలో పదోన్నతులు. హాయిగా సాగే జీవితం. ఫల్గుణి నాయర్‌ దాంతో సంతృప్తి చెందాలనుకోలేదు. తన చిన్ననాటి కల.. వ్యాపారవేత్త కావడం. దాన్ని నెరవేర్చుకునేందుకు 50 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని ప్రారంభించి, తొమ్మిదేళ్లలోనే స్వయంకృషితో ఎదిగింది. తన సంస్థ నైకా లిస్టెడ్‌ కంపెనీగా అవతరించిన మొదటిరోజే రూ.1,00,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. దాంతో ఫల్గుణి దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో రెండోస్థానంలో నిలిచింది. తను మనకూ ఎన్నో పాఠాలు నేర్పుతోంది. నేర్చుకుందామా మరి!

* వయసు: దేన్నైనా సాధించడానికి వయసు అడ్డంకి కాదు. అందుకు నేనే ఉదాహరణ. ఇప్పుడు ఎంతోమంది మహిళలు ఇల్లు, పిల్లల బాధ్యతలుండీ కెరియర్‌లో రాణిస్తున్నారు. కాబట్టి.. సాధించడానికి ఫలానా వయసు, సమయం ముఖ్యం కాదు. నా వ్యాపార ప్రయాణంతో అందరికీ స్ఫూర్తిగా నిలవాలనుకున్నా. అందుకే ఎవరి జీవితాలకు వాళ్లే హీరో అనే అర్థమొచ్చేలా మా సంస్థకు నైకా (హీరోయిన్‌) అని పేరు పెట్టా. ఓడినా ఫర్లేదు కానీ.. ప్రయత్నించాలి. అప్పుడు.. అయ్యో ప్రయత్నించలేక పోయామన్న నిరాశ అయినా ఉండదు.
* ఆసక్తే ప్రధానం: నాకూ మేకప్‌, అందంగా కనిపించడమంటే ఇష్టం. అందుకే దీన్నే వ్యాపారంగా ఎంచుకున్నా. ఆసక్తి ఉన్నదానిలో ప్రయత్నిస్తే విజయం సాధించొచ్చు. ఈ రంగంలోకి అడుగుపెట్టే నాటికి దీనిపై అవగాహనేమీ లేదు. పైగా అప్పటికి ఈకామర్స్‌ పెద్దగా అభివృద్ధీ చెందలేదు. ఆసక్తితో నేర్చుకుంటూ ముందుకు సాగా. విజయానికి ఇష్టం, నేర్చుకోవాలన్న తపన నిరంతరంగా సాగాలని నమ్ముతా!

* విజయానికి..: ఆంత్రప్రెన్యూర్‌గా నిలవడానికి దానిపై ప్రేమ, కష్టపడేతత్వంతోపాటు సమయాన్నీ ఇవ్వాలి. నేను ప్రారంభించినపుడు మూడు, నాలుగేళ్లలో ఇక్కడికి వెళ్లాలి, సాధించాలి అంటూ లెక్కలేసుకుని దిగలేదు. అంతా మనం అనుకున్నట్లు జరగదని తెలుసు. అందుకే ఇదో దీర్ఘకాల ప్రయాణమని ముందు నాకు నేనే చెప్పుకున్నా. కనీసం పదేళ్లు పడుతుందనుకున్నా. కాబట్టి, ఏ దశలోనూ నిరాశ లేదు. చేసే ఏ పనిలోనైనా ఓపిక కావాలి. ఈ సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి.

* అంకితభావం: కెరియర్‌పై ప్రేమ, అంకితభావం ఉంటేనే రాణించగలం. ప్రారంభించిన ఇన్నేళ్లలో మొదటిరోజు ఎంత ప్యాషన్‌తో ఉన్నానో నేటికీ అలాగే కొనసాగిస్తున్నా. స్కూలు పిల్లల నుంచి ఉద్యోగినుల వరకు ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియా సాధారణమైపోయింది. వ్యాపారవేత్తలకీ తమ సమాచారం పంచడానికీ, మార్కెటింగ్‌కీ, నెట్‌వర్కింగ్‌కీ ఇదే వేదికైంది. కానీ.. సోషల్‌ మీడియాలో ఆక్టివ్‌గా ఉండటానికి ఎంతో సమయం, శ్రమ వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని స్ప్రెడ్‌షీట్లపై కేటాయించడానికి ఇష్టపడతా. నంబర్లు నన్ను ఎక్కువ ఆకర్షిస్తాయి. అందుకే నైకా ప్రారంభించిన తొమ్మిదేళ్లలో ఒక ట్వీట్‌ మాత్రమే చేశా.

* ఆపలేరెవరూ: నేను ఎంబీయే చదివినప్పుడు మా తరగతిలో 150లో తొమ్మిదిమందే అమ్మాయిలు. తర్వాత అందులో సగం మంది మానేశారు. కానీ ఇప్పుడు మా ఆఫీసులో 47శాతం మహిళా ఉద్యోగులు. గ్లాస్‌ సీలింగ్‌ మహిళల్ని అడ్డుకుంటుందంటే నేను నమ్మను. మగవాళ్లు ఆడవాళ్ల ఎదుగుదలని ఆపడం కోసమే ఉంటారని అనుకోను. ఎదగాలని అనుకుంటే ఆడవాళ్లు కచ్చితంగా ఎదిగితీరుతారు. ఆపడం ఎవరి తరమూ కాదు. వ్యక్తిగత జీవితానికీ, కోరుకున్న కెరియర్‌లో కొనసాగడానికీ మధ్య బ్యాలెన్సింగ్‌ కష్టమే కాదనను. కానీ చిన్నపాటి బ్రేక్‌ తీసుకుని మళ్లీ కలలని సాకారం చేసుకోవడానికి ముందుకు నడవండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్