వయసు 85.. పతకాలు 128

మీరు చదివింది నిజమే.. అవన్నీ ఆటల్లో సాధించినవే. పైగా అవేవీ కూర్చుని ఆడేవి కాదు... జావలిన్‌, డిస్క్‌, షాట్‌పుట్‌ వంటి వాటిల్లో. రన్నింగ్‌ పోటీల్లోనూ బోలెడు పతకాలు సాధించారీ బామ్మగారు. వయసును జయించిన ఆవిడ పేరు ముత్యం లక్ష్మి. తన క్రీడా ప్రస్థానాన్ని వసుంధరతో పంచుకున్నారు...

Updated : 01 Dec 2021 06:12 IST

మీరు చదివింది నిజమే.. అవన్నీ ఆటల్లో సాధించినవే. పైగా అవేవీ కూర్చుని ఆడేవి కాదు... జావలిన్‌, డిస్క్‌, షాట్‌పుట్‌ వంటి వాటిల్లో. రన్నింగ్‌ పోటీల్లోనూ బోలెడు పతకాలు సాధించారీ బామ్మగారు. వయసును జయించిన ఆవిడ పేరు ముత్యంలక్ష్మి. తన క్రీడా ప్రస్థానాన్ని వసుంధరతో పంచుకున్నారు...

మాది విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం మామిడిపల్లి. మా వారు  లక్ష్మణరావు చనిపోయాక చోడవరానికి మకాం మార్చా. ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. 30 ఏళ్ల కిందట... మా ఆడపడుచు, ఇంకొందరు ఆడవాళ్లు రోజూ సాయంత్రం మైదానంలో నడవడం చూశా. నేనూ అనుసరించా. నడకలో నా వేగాన్ని చూసి వెటరన్‌ క్రీడాకారుడు డాక్టర్‌ వేణు వెటరన్‌ పోటీల్లో పాల్గొనమని ఆహ్వానించారు. కొంత సాధన చేసి పాల్గొన్నా. తృతీయ స్థానం వచ్చింది. ఇప్పటి దాకా 125 వరకు పతకాలు సాధించా. వీటిల్లో ఎక్కువ బంగారే! ఏడు రాష్ట్రాలలో జాతీయ వెటరన్‌ పోటీలలో పాల్గొన్నా. 2010లో కౌలాలంపూర్‌ (మలేషియా) ఆసియన్‌ మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీలో నడకలో బంగారు, 2011లో తైవాన్‌లో ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్‌లో రన్నింగ్‌లో వెండి పతకాలు గెలిచా. పరుగుతోపాటు, నడకలోనూ పోటీ చేసే దాన్ని. కాలి మడమ బెణకడంతో ఆపేయమని వైద్యులు సలహా ఇచ్చారు. అప్పట్నుంచి డిస్క్‌త్రో, జావెలిన్‌, షాట్‌పుట్‌లపై దృష్టిపెట్టా.
నవ్వేవారు.. మొదట్లో చీరతోనే పోటీల్లో పాల్గొనే దాన్ని. తర్వాత  ట్రాక్‌సూట్‌తో గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తోంటే... హేళన చేసేవారు. చనిపోయేవరకూ ఆటల్లోనే ఉండాలన్నది నా కోరిక. అందుకే అవేమీ పట్టించుకోను. తాజాగా వారణాసిలో జాతీయ పోటీల్లో 3 పతకాలు వచ్చాయి. తర్వాత జపాన్‌ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని అనుకుంటున్నా. ఆర్థిక ఇబ్బందులన్నా అప్పు చేసి, మా అబ్బాయి, దాతల సాయంతో వెళుతున్నా. మహిళలకు కుట్టు, అల్లికలు నేర్పేదాన్ని. దేనికీ ఎవరిపైనా ఆధారపడకుండా బతకడం నాకలవాటు. ఆరోగ్యంగా ఉంటేనే అది సాధ్యం. అందుకే ఆటలు ఆడమని అందరికీ సలహానిస్తుంటా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్