చూపులేకపోయినా... లక్షలు సంపాదిస్తోంది!

యుక్తవయసులో వచ్చిన అనారోగ్యం ఆమెను అంధురాలిని చేసింది. తన కాళ్లపై తాను నిలవాలని చిరువ్యాపారిగా మారితే, కొవిడ్‌ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. అయినా

Updated : 02 Jan 2022 05:02 IST

యుక్తవయసులో వచ్చిన అనారోగ్యం ఆమెను అంధురాలిని చేసింది. తన కాళ్లపై తాను నిలవాలని చిరువ్యాపారిగా మారితే, కొవిడ్‌ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. అయినా నిరాశపడలేదు. పట్టువీడలేదు... ఇప్పుడు తను తయారుచేస్తున్న ఆహార ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కింది. ఏదైనా సాధించదలచుకుంటే అంధత్వం అడ్డుకాదంటోన్న గీతా సాలీష్‌ స్ఫూర్తి కథనమిది.

గీతకు 13వ ఏడొచ్చే వరకు దృష్టిలోపం లేదు. ఎనిమిదో తరగతిలో కళ్లకు ఏదో సమస్య రావడంతో వైద్యులను సంప్రదించారు. రెటీనాకు సంబంధించిన నరాలు దెబ్బతిని, రెటినిస్‌ పిగ్మంటోసా అనే సమస్యకు గురైనట్లు తేల్చారు. కేరళలోని త్రిశూరు వాళ్లది. గీతను అమ్మానాన్నా ఎన్నో ఆసుపత్రులు తిప్పారు. అయినా  ఫలితం లేదు. కొద్ది రోజుల్లోపే తనను అంధత్వం ఆవరించింది.

బ్రెయిలీ నేర్చుకొని...

కంటిచూపు రాదని తెలిసి తీవ్ర కుంగుబాటుకు గురయ్యా అంటుంది గీత. ‘అకస్మాత్తుగా చూపు పోవడంతో తట్టుకోలేకపోయా. జీవితమే చీకటైపోయిందని అనుకున్నా. కానీ అమ్మానాన్నా అండగా నిలిచారు. నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ క్రమంగా పుంజుకున్నా. తిరిగి చదువుకోవాలని అంధుల పాఠశాలలో చేరా. అక్కడంతా కొత్తగా ఉండేది. జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి ప్రారంభించా. బ్రెయిలీ నేర్చుకున్నా. డిగ్రీ పాసయ్యా. ఆ తర్వాత చాలా ప్రేమగా, గౌరవంగా చూసే భర్త దొరికాడు. తన ప్రోత్సాహంతో చిన్న హోటల్‌ ప్రారంభించా. అయిదారేళ్లు బాగానే ఉంది, తర్వాత నష్టాలు మొదలయ్యాయి. చివరికి మూసేశాం. చాలా ఉద్యోగాలకు దరఖాస్తు చేసి విఫలమయ్యా. ఆ తర్వాత కోళ్లను పెంచి గుడ్లు అమ్మడం మొదలుపెట్టా. నా కాళ్ల మీద నేను నిలవాలి, ఇంటికి ఆర్థికంగా దన్నుగా ఉండాలి... ఇవీ నా లక్ష్యాలు. అంతలో కొవిడ్‌ వల్ల ఈ వ్యాపారానికీ నష్టం వచ్చింది. ఆ సమయంలోనే మావారిచ్చిన ఆలోచన నాకు నచ్చింది’ అని వివరించింది గీత.

వంటల్లో వాహ్వా...

కనిపించకపోయినా ఏ వంటనైనా చాలా రుచిగా చేసే నైపుణ్యం గీతకు ఉండటంతో దాన్నే ఉపాధి మార్గంగా మార్చుకోమని భర్త సలహా ఇచ్చాడు. దాంతో గతేడాది ‘హోమ్‌ టు హోమ్‌’ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది. మొదట పచ్చళ్లు, చట్నీలు చేసి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచేది. వాటిని చూసి కొందరు తమకు చేసిమ్మని అడిగేవారు. అలా నెమ్మదిగా ఆర్డర్లు మొదలయ్యాయి. అలా నెయ్యి, ఖర్జూరంతో పలురకాల వంటకాలనూ జత చేసింది. ‘ఇప్పుడు పచ్చళ్లు, నెయ్యి అమ్ముతున్నా. కొవిడ్‌ సమయంలో వ్యాధి నిరోధక శక్తిని అందించే ‘కురుక్కుమీల్‌’ అనే అద్భుతమైన వంటకాన్ని మొదలు పెట్టా. పసుపు, ఖర్జూరం, బాదం, కొబ్బరి పాలు, బెల్లం వంటి పదార్థాలతో తయారయ్యే ఈ పదార్థం ప్రాచీన కాలం నుంచి వస్తున్న వంటకం. దీని తయారీకి 7, 8 గంటలు పడుతుంది. దీన్ని బాలింతలకు అందించేవారు. పోషక విలువలతో వ్యాధి నిరోధక శక్తిని పెంచే కురుక్కమీల్‌కు దక్షిణభారతదేశం సహా పంజాబ్‌, కశ్మీరు వంటి ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నేను చేస్తున్న 10 రకాలకు పైగా ఆహార ఉత్పత్తులతో నెలకు రూ.1.5 లక్షలకు పైగా సంపాదిస్తున్నా. ఆర్డర్లను ఫాలో కావడం, కొనుగోలుదారుల అభిప్రాయాలను పరిశీలించడం వంటివన్నీ నేనే చూసుకుంటా. ప్రస్తుతం పది మందికి ఉపాధిని అందిస్తున్నా. మరిన్ని కొత్త వంటకాలను, ఉత్పత్తులను తయారు చేయబోతున్నా’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది 39 ఏళ్ల గీతా సాలీష్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్