Updated : 11/01/2022 05:32 IST

వేల జీవితాల్లో వెలుగులు...

కమల్‌ప్రీత్‌ కౌర్‌ అడుగుపెట్టక ముందు ఆ ఊళ్లో మహిళలకు పెద్దగా ఉపాధి ఉండేది కాదు. దొరికిన వాళ్లు ఏవో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ గడిపేవారు. లేని వాళ్ల పరిస్థితి అంతే. అయితే ఈ పరిస్థితిని మార్చాలనుకుంది తను. ఈమె అందించిన ఉచిత శిక్షణ అక్కడి వారందరినీ ఆర్థిక స్వావలంబన పొందేలా చేసింది. లెడ్‌ బల్బుల తయారీని నేర్చుకున్న వీరంతా తమ జీవితాల్లోనూ వెలుగు నింపుకొన్నారు.

డెహ్రాడూన్‌కు చెందిన కమల్‌ప్రీత్‌కౌర్‌ వ్యాపారవేత్తగా స్థిరపడాలని కలలు కనేది. తనతోపాటు మరికొందరు మహిళలకు ఉపాధినీ కల్పించాలనుకునేది. ఎంబీఏ పూర్తైన తర్వాత రాజీవ్‌సింగ్‌తో పెళ్లి కావడంతో ఆమె కల అక్కడితో ఆగింది. ఓ పాపకు తల్లైన తర్వాత తిరిగి తన కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం (పీఎంఈజీపీ)’ కింద రూ.20 లక్షలు రుణాన్ని పొందడంతో 2016లో ‘ఒరా ఇన్‌ఫినీ’ స్టార్టప్‌ను స్థాపించింది. పర్యావరణ పరిరక్షణ దిశగా వృథా నుంచి వెలుగులను తీసుకురావాలనుకుంది కమల్‌. దాంతో ‘మినిస్ట్రీ ఆఫ్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎమ్మెస్‌ఎమ్‌ఈ)’ వెంచర్‌లో భాగంగా ఎల్‌ఈడీ లైట్లు, సౌరశక్తితో వెలిగే లైట్లకు కావాల్సిన పరికరాల తయారీని ప్రారంభించింది. ఇందులో పూర్తిగా మహిళలకే ఉపాధిని అందించాలనుకుంది. అలా గృహిణులందరికీ 100 రోజుల పాటు ఉచితంగా శిక్షణా తరగతులను నిర్వహించింది.

ఎల్‌ఈడీ బల్బుల తయారీ రంగంలో ఎక్కువగా పురుషులే ఉండటంతో చాలా సవాళ్లను ఎదుర్కొన్నా అంటుంది కమల్‌. ‘ఇంటి నుంచే బల్బుల తయారీ ప్రారంభించా. వీటి తయారీలో మహిళలను పెద్ద స్థాయిలో చేర్చుకునేందుకు 2017లో తేలివాలా గ్రామంలో స్థానిక స్వయం ఉపాధి సంఘాలను సంప్రదించా. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఈ తయారీ ద్వారా ఆర్థిక స్వావలంబన ఎలా పొందొచ్చో వివరంగా చెప్పేదాన్ని. మొదట్లో అందరికీ చాలా సంకోచాలుండేవి. చెప్పగా చెప్పగా క్రమంగా మార్పొచ్చింది. ఈ అయిదేళ్లలో దాదాపు 3 వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చి, ఉపాధిని కల్పించగలిగాను. వారి కాళ్లపై వారిని నిలబడేలా చేయగలిగాననేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఎల్‌ఈడీ లైట్ల విక్రయాలకు డెహ్రాడూన్‌ ప్రధాన కేంద్రంగా నిలిచింది. టార్చిలైట్లు, మినియేచర్‌ బల్బులు, స్ట్రింగ్‌ లైట్స్‌ వంటి వాటిని రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. మాతో పని చేస్తున్న మహిళలు ఒక్కొక్కరూ నెలకు రూ.25వేలు సంపాదించగలుగుతున్నారు’ అని సంతోషంగా వివరించింది కమల్‌ప్రీత్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని