Updated : 13/02/2022 04:53 IST

చెత్త దిబ్బను నందనవనంగా మార్చేసింది..

తనో చిత్రకారిణి. దేశదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. అయినా ఏదో అసంతృప్తి. పుట్టిన నేలకు, ప్రకృతికి దూరంగా ఉంటున్నానన్నదే దానికి కారణమని ఊరికి వెళ్లినప్పుడు అర్థమైంది. అప్పుడే తన పూర్వీకుల భూమిని చూసింది. చెత్తదిబ్బగా ఉన్న ఆ ప్రదేశం ఆవేదనతో పాటు తనకో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది... తన జీవన గమనాన్ని మార్చింది.
గంగా కదకియాకు చిన్నప్పటి నుంచి చిత్రకళపై ఆసక్తి ఎక్కువ. దాంతో ఆ రంగంలోనే ఉన్నత విద్యాభ్యాసం చేసింది. ప్రొఫెషనల్‌గా తన కళతో ప్రపంచ దేశాల్లో పలు ప్రదర్శనలిచ్చింది. అయినా ఏదో అసంతృప్తి. వాళ్లది మహారాష్ట్రలోని కర్జాత్‌. ఓసారి స్వగ్రామంలో తల్లి తరఫు నుంచి వారసత్వంగా వస్తున్న భూమిని చూసింది. ఖాళీగా ఉండటంతో 15 ఎకరాల ఆ భూమి చెత్తతో నిండి పోవడం చూసి చాలా బాధపడింది. అప్పుడే తన మార్గం ఏంటో తనో చిత్రకారిణి. దేశదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. అయినా ఏదో అసంతృప్తి. పుట్టిన నేలకు, ప్రకృతికి దూరంగా ఉంటున్నానన్నదే దానికి కారణమని ఊరికి వెళ్లినప్పుడు అర్థమైంది. అప్పుడే తన పూర్వీకుల భూమిని చూసింది. చెత్తదిబ్బగా ఉన్న ఆ ప్రదేశం ఆవేదనతో పాటు తనకో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది... తన జీవన గమనాన్ని మార్చింది.బోధపడింది. ఆ భూమిని ఓ కళాఖండంగా తీర్చిదిద్ది, ఆహ్లాదంగా మార్చాలనుకుంది. అలా వచ్చిన ఆలోచనే ‘ఆర్ట్‌ విలేజ్‌ కర్జత్‌ (ఏవీకే)’. ఇప్పుడీ ప్రాంతం వేలాది పర్యాటకులకు సందర్శక స్థలంగా నిలుస్తోంది.

పర్యావరణ దిశగా...
ఆ ప్రాంతాన్ని ఆర్ట్‌ విలేజ్‌గా మార్చాలనుకున్నప్పుడు పూర్తిగా పర్యావరణ పరిరక్షణ దిశగానే ఆలోచించా అంటుంది గంగ. ‘కిరణ్‌ వఘేలా నుంచి ఆర్కిటెక్ట్‌, హన్నర్‌శాల నుంచి కళాకారులను, భుజ్‌ నుంచి నిర్మాణానికి సంబంధించిన వారిని ఎంపిక చేశా. నేనే ఆయా ప్రాంతాలకెళ్లి వారి నైపుణ్యాలను పరిశీలించిన తర్వాతే ఇందులో భాగస్వాములను చేశా. ముందుగా ఓ పార్కులా తీర్చిదిద్దాలనుకున్న నాకు అందరూ ఇచ్చిన ఓ ఆలోచన మరింత నచ్చింది. ప్రకృతికి దగ్గరగా ఉన్నట్లు అనిపించేలా ఎకో టూరిజం కేంద్రంగా తయారు చేస్తే ఈ ప్రాంతంపై అందరికీ అవగాహన ఉంటుందనిపించింది. అలా ఈ ఆర్ట్‌ విలేజ్‌లో ఆరు గదులు, మెడిటేషన్‌ సెంటర్‌, వంటిల్లు, కమ్యూనిటీ హాలువంటివన్నీ ఏర్పాటు చేశాం. ఈ నిర్మాణంలో మన పాతకాలంనాటి సంప్రదాయ పద్ధతులనే ఆచరించాం. మట్టి, సున్నం సహా పలు సహజ సిద్ధమైన వాటినే వినియోగించాం. ప్రకృతి విపత్తులను తట్టుకునేలా గదుల నిర్మాణం చేపట్టాం. అలాగే కాలాలకు తగ్గట్లు వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా గదిలోని వాతావరణం మారుతుంటుంది. అలాగే పూర్తిగా చెక్కను వినియోగించాం. మట్టి ఇటుకలతోపాటు రీసైకిల్‌లో తయారయ్యే ఇటుకలను వాడాం.  నీటి విషయంలోనూ ఇవే జాగ్రత్తలు తీసుకున్నాం. వినియోగించిన నీటిని ప్రత్యేక పద్ధతి ద్వారా శుద్ధి చేసి రీసైకిల్‌ చేస్తున్నాం.

అలా వృథాను తగ్గించాం. వృక్షాలను నాటి పూర్తిగా పచ్చదనాన్ని నింపాం. సేంద్రియ విధానంలో ఓ ప్రాజెక్టును ప్రారంభించి, కూరగాయలు, పండ్లు, పూలు సహా ఔషధమొక్కలను పెంచుతున్నాం. 2017లో ఈ నిర్మాణం పూర్తయింది. ఈ నాలుగేళ్లలో అందమైన పార్కు, విడిది భవనంతోపాటు ప్రకృతి దిగివచ్చినట్లుగా పక్షుల కిలకిలరావాలు ఇక్కడ నిండిపోయాయి. తాజాగా సీతాకోక చిలుకల పార్కును కూడా సిద్ధం చేశాం. దీంతో గతంలో ఇటువైపు అడుగేయడానికి ఇబ్బంది పడేవారంతా ప్రత్యేకంగా కుటుంబంతోసహా ఇప్పుడు ఈ విలేజ్‌ పార్కును సందర్శిస్తున్నారు. ప్రతి చోటా చిత్రకళ ఉట్టిపడే ఈ ప్రాంతం చాలా ఆహ్లాదంగా మారింది’ అని చెబుతోందీమె. పర్యాటకులకు ఇప్పుడీ పార్కులో విడిది ఏర్పాటును కూడా అందిస్తోంది. గంగ నాటిన మొక్కలు ఇప్పుడు మహావృక్షాలై ఆ ప్రాంతమంతా చిట్టడవిని తలపిస్తున్నాయి.  దీనికితోడు కూరగాయల పెంపకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడికొచ్చే పర్యాటకులు కూడా తోట పనిలో పాలుపంచుకోవచ్చు. అలాగే సేంద్రియ పద్ధతిలో పండించే ఈ తోటలోని కూరగాయలతోనే వీరికి ఆహారం తయారు చేసి అందిస్తారు. చిత్రకళ, కుండల తయారీ, తోటపని వంటి పలు అంశాలపై వర్క్‌షాపులు నిర్వహించడం, స్థానికులకు ప్రకృతి - పర్యావరణ పరిరక్షణపై అవగాహనా కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని