Updated : 19/03/2022 06:05 IST

రిపోర్టర్‌ ఎరిన్‌...యుద్ధభూమి నుంచి!

యుద్ధమన్నాక ఎప్పుడెటువైపు నుంచి మృత్యువు కబళిస్తుందో తెలీదు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాలంటే అసమాన ధైర్యం ఉండాలి. దానికో లక్ష్యమూ తోడవ్వాలి.  ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధంపై వార్తలు అందిస్తూ... ముగ్గురు పాత్రికేయులు బాంబు దాడుల్లో చనిపోయారు. ఇంకా చాలా మంది ప్రాణాలకి తెగించి మరీ అక్కడి నుంచి వార్తలు అందిస్తున్నారు. వారిలో కొందరు మహిళా పాత్రికేయులు అనుభవాలను పంచుకున్నారిలా....


కంటతడి పెట్టిస్తున్నాయి: క్లారిస్సా వార్డ్‌...

అమెరికాకు చెందిన 42 ఏళ్ల క్లారిస్సా, సీఎన్‌ఎన్‌ చీఫ్‌ ఇంటర్నేషనల్‌ కరెస్పాండెంట్‌. అఫ్గన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌- లెబనీస్‌ యుద్ధం, సద్దాం హుస్సేన్‌ను నిర్బంధించడం వంటి సందర్భాల్లో క్లారిస్సా విధులు నిర్వహించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడినప్పుడు అక్కడి పరిస్థితిని ప్రపంచానికి చేరవేసిన తొలి మహిళా పాత్రికేయురాలు తను. ఉక్రెయిన్‌లో దారుణాలను, క్షతగాత్రుల స్థితిని కళ్లకు కట్టినట్లుగా రిపోర్ట్‌ చేసింది. ‘నివాసాలపై బాంబులుపడి వృద్ధులు, మహిళలు, చిన్నారులెందరో గాయపడ్డారు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు’ అంటూ ఆవేదనా భరితంగా తనందిస్తున్న వీడియో కథనాలు వీక్షకుల కంటతడి పెట్టిస్తున్నాయి.


కళ్ల ముందే ...: లిన్సే అడారియో..

కదిలించే ఫొటోలు తీయడంలో 48 ఏళ్ల అమెరికా ఫొటో జర్నలిస్టు లిన్సే దిట్ట. యుద్ధంలో మహిళల పాత్ర, మానవ హక్కులు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తుంది తను. అఫ్గనిస్థాన్‌, ఇరాక్‌, దర్ఫూర్‌, ది రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో, హైతీ యుద్ధాల్లో ప్రాణాలకు తెగించి మరీ చిత్రాలను తీసింది. వాటికి ప్రతిష్ఠాత్మక ‘ది పులిట్జర్‌ ప్రైజ్‌’ కూడా దక్కించుకుంది. ప్రాణాలను అరచేత పెట్టుకొని పారిపోతున్న ఉక్రెయినీలపై రష్యా దళాలు దాడి చేస్తున్న దృశ్యాలను అందిస్తోంది. ‘తమ పిల్లల ప్రాణాలు కాపాడటానికి ఎందరో తల్లులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని తెలిసి, ఫొటోలు తీద్దామని వెళ్లా. అక్కడ ఓ సంఘటన తీవ్ర వేదనకు గురిచేసింది. ఇర్పిన్‌ వంతెన దగ్గర ఓ మహిళ ముగ్గురు పిల్లలతో నుంచుంది. 200 - 300 మీటర్ల పొడవుండే ఆ వంతెన దాటితే తను సురక్షితమే. అంతలోనే పెద్ద శబ్దం. అంతా పొగ. నేనూ ఎగిరిపడ్డా. గాయమైందేమోనని తలను చూసుకుంటున్నా... ఇంతలో ఎదురుగా కనబడిన దృశ్యం చూసి దుఃఖం తన్నుకొచ్చింది. నా పక్కగా ఆమె, ముగ్గురు పిల్లలు రక్తపు మడుగులో విగతజీవులై వారి సామాగ్రి, దుస్తులన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆ చిన్నారుల బూట్లు, కోటు రక్తమయం. ఒక్క క్షణం దాటితే వారు తప్పించుకునే వారు. అలా ఎందరో అమాయకులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది’.


హృదయ విదారకం: ఎరిన్‌ మెక్లాఘ్లిన్‌..

అమెరికాకు చెందిన 40 ఏళ్ల ఎరిన్‌ డిట్రాయిట్‌లో ఉగ్రవాదుల దాడి, సద్దామ్‌ హుస్సేన్‌ విచారణ, 2011లో లండన్‌ అల్లర్లను కవర్‌ చేసింది. ఎన్‌బీసీ న్యూస్‌ కరస్పాండెంట్‌గా ఎరిన్‌ యుద్ధవార్తలను ప్రపంచానికి చేరవేస్తోంది. ‘చాలామంది యువకులు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి యుద్ధానికి వెళుతూ ఇంట్లోని మహిళలు, పిల్లలను పోలండ్‌కు పంపించారు. తమ భర్తలు, కొడుకులు, తండ్రులు తిరిగి వస్తారో రారో తెలీక, అక్కడ ఉండలేక ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. ఇవన్నీ హృదయ విదారకం’.


క్షణమొక యుగం: హోలీ విలియమ్స్‌...

చైనాలో 2008లో జరిగిన సమ్మర్‌ ఒలింపిక్స్‌ కవరేజీ 44 ఏళ్ల హోలీ విలియమ్స్‌కు తొలి అసైన్‌మెంట్‌. తర్వాత ఇరాక్‌, యెమన్‌, సిరియా, పాకిస్థాన్‌, అఫ్గనిస్థాన్‌, లిబియా, ఇజ్రాయెల్‌ యుద్ధాల్లో విధులు నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రసంస్థ ఐసిస్‌ వ్యవహారాలను ప్రపంచానికి తెలియజేసి పలు పురస్కారాలను అందుకుందీ ఆస్ట్రేలియా పాత్రికేయురాలు. సీబీఎస్‌ న్యూస్‌ కరస్పాండెంట్‌గా ఉన్న ఈమె ఈస్ట్రన్‌ ఉక్రెయిన్‌ ప్రాంతంలో దాడులను ప్రపంచానికి తెలియజేస్తోంది. ‘కొద్దిరోజులుగా ఇక్కడి ప్రజలు రష్యా బెదిరింపులతో క్షణమొక యుగంగా బతుకుతున్నారు. నా కళ్ల ముందే ఓ దాడిలో ముగ్గురు చనిపోవడం చూశా. ఇటువంటి పరిస్థితి మరోసారి ఇక్కడి ప్రజలకు రాకూడదని కోరుకుంటున్నా’.


మహిళల ధైర్యం స్ఫూర్తిదాయకం : సారా రెయిన్స్‌ఫోర్డ్‌..

బ్రిటన్‌కు చెందిన 45 ఏళ్ల సారా ఈస్ట్రన్‌ యూరప్‌లో బీబీసీ కరస్పాండెంట్‌. క్యూబా, ఇరాక్‌, టర్కీ, స్పెయిన్‌, రష్యాల్లో పలు ముఖ్య ఘటనలను కవర్‌ చేసింది. మాస్కోలో బీబీసీ కరెస్పాండెంట్‌గా పనిచేస్తున్న సారాకు వీసా గడువు తీరడంతో రష్యా విడిచి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధభూమి నుంచి పనిచేస్తున్న ఈమె రష్యా దాడుల్లో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకొంది. ‘భర్తలు యుద్ధానికి వెళితే, పిల్లలకు ధైర్యం చెబుతూ, చిరునవ్వును చెదరనివ్వకుండా ఇక్కడి మహిళలు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తోంది. వర్షంలో గంటల తరబడి తడుస్తూ సైనికుల కోసం రక్తదానం చేయడానికి పిల్లలను చంక నేసుకుని క్యూలో నిలబడుతున్నారు. వీళ్ల ధైర్యం స్ఫూర్తిదాయకం.’


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని