22వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాం!

దేశానికి యువతే వెన్నెముక. వాళ్లు బాధ్యతగా ఉంటేనే దేశం ప్రగతి పథంలో నడుస్తుంది. మరి వాళ్లలా ఉండాలంటే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ ఆలోచనే ఆమెని వేలమందికి ఉద్యోగాలు చూపేలా చేసింది. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ 75వేల మందికి ఉద్యోగాలు...

Published : 29 Mar 2022 01:39 IST

దేశానికి యువతే వెన్నెముక. వాళ్లు బాధ్యతగా ఉంటేనే దేశం ప్రగతి పథంలో నడుస్తుంది. మరి వాళ్లలా ఉండాలంటే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ ఆలోచనే ఆమెని వేలమందికి ఉద్యోగాలు చూపేలా చేసింది. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ 75వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాలని లక్ష్యం పెట్టుకున్నారామె. ఇప్పటికే 22వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారు ‘నిపుణ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకురాలు సుభద్రా రాణి. ఆ వివరాల్ని వసుంధరతో పంచుకున్నారిలా...

యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది.. పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కావాలి. ఈ రెండు వర్గాలనీ అనుసంధానించే లక్ష్యంతో 2020 ఉగాది రోజున ‘నిపుణ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌’ని ప్రారంభించా. నేను సంపాదిస్తే నాకే ప్రయోజనం.. యువతకు ఉపాధి చూపిస్తే సమాజం ఆనందంగా ఉంటుందని దీన్ని మొదలుపెట్టా. కానీ కరోనా లాక్‌డౌన్‌తో వెంటనే ఎక్కువ పని చేయలేకపోయా. నేను అంతకు ముందునుంచే ‘సేవా ఇంటర్నేషనల్‌’లో పనిచేస్తున్నా. అక్కడ పరిశ్రమ వర్గాలతో కలిసి చేపట్టే సేవా కార్యక్రమాల విభాగాన్ని పర్యవేక్షించేదాన్ని. ఆ అనుభవంతో 2019లో జమ్మూలోని ఉదంపూర్‌లో ఉద్యోగ మేళా నిర్వహించాం. 40 రోజులు అక్కడే ఉండి యువతను ఉద్యోగ మేళాకు హాజరయ్యేలా ప్రోత్సహించా. ఆగస్టు 3న మేళా ఏర్పాటుచేశాం. స్థానిక కంపెనీలేవీ ముందుకు రాకపోవడంతో దిల్లీ నుంచి తీసుకెళ్లా. సైనికుల భద్రత మధ్య మేళా విజయవంతంగా నిర్వహించాం. 311 మందికి ఉద్యోగాలు ఇప్పించా. అప్పటికే అక్కడ పరిస్థితి భీకరంగా మారింది. ఆర్మీ సహకారంతో మమ్మల్ని అంబులెన్సులో ఎయిర్‌పోర్టుకు తరలించారు. యాదృచ్ఛికంగా మరుసటి రోజే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఒకేసారి 18వేల మందికి..

కొవిడ్‌ కారణంగా ప్రాంగణ నియామకాలు తగ్గాయి. అందుకే మెగా జాబ్‌ మేళా నిర్వహించాలనుకున్నాం. నిపుణ ద్వారా మొదటి జాబ్‌ మేళా గతేడాది డిసెంబరులో జేఎన్‌టీయూ- హైదరాబాద్‌లో నిర్వహించాం. లక్ష మంది నమోదు చేసుకోగా, 72 వేల మంది ప్రత్యక్షంగా హాజరయ్యారు. దానికి 144 సంస్థలను రప్పించి 18,373 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌... ఇలా విద్యార్హతల్నిబట్టి ఐటీ, ఐటీ ఆధారిత సేవలూ, తయారీ, ఫార్మా, బ్యాంకింగ్‌... రంగాల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఆ కార్యక్రమాని కి వచ్చిన గవర్నర్‌ తమిళిసై ఇలాంటి మేళా పుదుచ్చేరిలో చేయమంటే, మార్చి 5, 6 తేదీల్లో అక్కడ నిర్వహించాం. 15వేల మంది వచ్చారు. 2900 మందికి ఉద్యోగాలు అందించాం. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో తదుపరి మేళాలు ఉంటాయి. స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 15 నాటికి 75వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నా. ఇదే కాదు.. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఉద్యోగార్థులకు భావవ్యక్తీకరణ, ప్రవర్తన... అంశాల్లో శిక్షణా ఇవ్వనున్నాం.  

అందుకే అమెరికా నుంచి వచ్చేశా..

మాది తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం. భీమవరంలో ఎంసీఏ చేశా. పెళ్లి తర్వాత 2000లో అమెరికా వెళ్లి కస్టమ్స్‌ విభాగంలో పనిచేశా. అక్కడున్నా స్వదేశంలో ఏదో చేయాలనే తపన ఉండేది. 2016లో తిరిగొచ్చి సేవా ఇంటర్నేషనల్‌తో కలిసి పనిచేస్తున్నా. పరిశ్రమ వర్గాల పరిచయాలతో యువతకు ఉపాధి కల్పించాలనుకున్నా. దీనిపైన లోతైన అవగాహన కోసం ఏడాదిన్నర దేశవ్యాప్తంగా పర్యటించా. పరిశ్రమల నిర్వాహకులు కూడా తమ బాధ్యతగా యువతకు ఏదైనా చేయాలనే ఆసక్తితో ఉండటంతో ఇద్దరినీ కలిపేందుకు నిపుణ ప్రారంభించా. ఆయన దేశవిదేశాల్లో గీతా బోధన చేశారు. నన్ను సేవా ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకులు శ్యామ్‌ పరాండే, మా బాబాయి సూర్యనారాయణ వెంట ఉండి ప్రోత్సహించే వారు. నాకు మంచి బృందం ఉంది. హర్ష, కార్తీక్‌, అనూషా... ఇంకా వందలమంది వాలంటీర్ల సహకారంతో ఇవన్నీ చేస్తుంటా. కరోనా సమయంలో వేలమందికి ఆహార పొట్లాలు, మందులూ, నిత్యావసరాల్నీ సరఫరా చేశాం. త్వరలో యువతకు స్వయం ఉపాధి మార్గాల్నీ చూపిస్తాం.


నాకు చదువంటే ఎంతో ఆసక్తి. దూరవిద్యలో ఎంబీఏ, ఐఐఎం లఖ్‌నవూలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ పూర్తిచేశా. ప్రస్తుతం కళింగ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేస్తున్నా. నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే ఎదగగలం.

- అమరేంద్ర యార్లగడ్డ, హైదరాబాదు


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్