చిట్టితెర నవ్వుల తారలు!

వేపకాయంత వెర్రి... కొండంత అమాయకత్వం... బోలెడు గడుసుతనం... కలిస్తే వీళ్లు..! ఏ సమయంలో మొబైల్‌ తెరిచినా చతుర్లు రువ్వుతూ వీక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. ఓ పక్క కుటుంబ

Updated : 01 May 2022 05:14 IST

వేపకాయంత వెర్రి... కొండంత అమాయకత్వం... బోలెడు గడుసుతనం... కలిస్తే వీళ్లు..! ఏ సమయంలో మొబైల్‌ తెరిచినా చతుర్లు రువ్వుతూ వీక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. ఓ పక్క కుటుంబ బాధ్యతలు... మరోపక్క వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూనే సంధ్యా శ్రీకాంత్‌, జయ తనికెళ్లలు చేస్తున్న హాస్య పారాయణం... ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా...!

సంతోషాలని పంచాలని...

కంప్యూటర్‌ సైన్స్‌లో పీజీ చేశాను. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న ఉద్యోగరీత్యా కొన్నాళ్లు వైజాగ్‌లోనూ ఉన్నాం. చిన్నతనం నుంచీ నటన, మోడలింగ్‌ ఇష్టం. ఆ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నది మాత్రం పెళ్లయ్యాకనే. మావారు సూర్యప్రకాష్‌, డెలాయిట్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌. ఆయన ప్రోత్సాహంతోనే... మిసెస్‌ ఆసియా, శ్రీమతి విశాఖ, మిసెస్‌ తెలంగాణా ఇండియా(రన్నరప్‌) వంటి పోటీల్లో ఆరు టైటిళ్లు గెల్చుకున్నా. ధారావాహికల్లో అవకాశాలు వచ్చాయి. ఇంట్లో అంతా పెద్దవాళ్లు, బాబు చిన్నవాడు కావడంతో... వద్దనుకున్నా. కానీ ఎక్కడో ఆ అసంతృప్తి. అది గమనించి ఆయన... మనమే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభిద్దాం అన్నారు. కొవిడ్‌ సమయంలో తీరిక దొరికింది. నాపేరుతో ‘జయోమయం’ని మొదలుపెట్టాం. నేను జాతీయస్థాయి వంటల పోటీల్లో విజేతను కూడా. వంటల ఛానెల్‌నే పెట్టొచ్చు. కానీ... నలుగురినీ నవ్వించడం ముఖ్యం అనిపించింది. ఎందుకంటే.. రోజంతా ఉద్యోగం చేసి సాయంత్రానికి అలసిపోయి మెట్రోల్లో, బస్సుల్లో నిలబడి కూడా ఫోన్లు చూస్తూ నవ్వుకొనే వాళ్లని గమనించాను. అలాంటి వారికి కాస్తైనా సంతోషం పంచాలనిపించింది. మావారికీ హాస్యచతురత ఎక్కువే. నేనూ పుస్తకాలు, మ్యాగజైన్లు బాగా చదువుతా. నచ్చిన జోక్స్‌ని ఒకచోట పెట్టుకుని వీడియోలు చేయాలనుకున్నాం. నేనో స్కూల్లో ఎడ్యుకేటర్‌గా చేస్తున్నా. ఇద్దరికీ ఖాళీ వారాంతాల్లోనే. అప్పుడే ఇవన్నీ చేస్తాం. ఇప్పటివరకూ 200 వీడియోలు చేశాం. పుష్ప సినిమాలో ‘సామి సామి’ పాటను అనుకరిస్తూ చేసిన ‘పిచ్చి పుష్పాలు’ వీడియో కోటి వ్యూస్‌ని అందుకుంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలోనూ ఆదరణ పెరుగుతోంది. ఎక్కడికి వెళ్లినా ‘ఒక్క సెల్ఫీ మేడమ్‌’ అని అడుగుతుంటే ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది. చాలామంది స్క్రిప్ట్‌లు రాసిచ్చి మీరు చేస్తే బాగుంటాయి మేడమ్‌ అంటే సంతోషంగా అనిపిస్తుంది. నా దృష్టిలో సొమ్ములు పంచడం కాదు... నవ్వుల్ని పంచుతూ ఆరోగ్యాన్ని పెంచడమే అసలైన మంచి పని. తీరిక దొరికినప్పుడల్లా మూగజీవాల సంరక్షణ కోసం పనిచేయడం నా అభిరుచి.

- జయ


సున్నితంగానే పంచులు...

నా స్వస్థలం జనగాం. స్థిరపడింది హైదరాబాద్‌లో. బీ ఫార్మసీ చదివా. మావారు శ్రీకాంత్‌తో కలిసి... మందుల దుకాణం నిర్వహిస్తుంటా. మాకు ఇద్దరమ్మాయిలు శ్రీజ, శ్రేయ. పిల్లలు, ఇల్లు, షాప్‌ ఇవే నా లోకం. మూడేళ్ల క్రితం మా పెద్దమ్మాయి శ్రీజ చేస్తున్న టిక్‌టాక్‌ వీడియో కోసం మావారు, నేను కూడా యాక్ట్‌ చేశాం. అవి జనాలకు నచ్చాయి. టిక్‌టాక్‌ని ఆపేసిన తర్వాత.. ఆసక్తి తగ్గినా, రోపోసోలో మేం చేసిన వీడియో ఒకదాన్ని లక్షల సంఖ్యలో షేర్‌ చేసుకున్నారు. దాంతో యూట్యూబ్‌లో ఎస్‌ఎస్‌ కపుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరుతో హాస్యజంటగా ఇంటి ముచ్చట్లపైనే వీడియోలు మొదలుపెట్టాం. వాటికి మంచి ఆదరణ దక్కింది. చాలామంది ‘మా ఇంట్లోకొచ్చి చూసినట్టే వీడియోలు చేస్తున్నారే! అంత సహజంగా ఎలా చేస్తున్నారు?’ అని అడుగుతుంటే సంతోషంగా ఉంటుంది. స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏ కార్యక్రమాలు జరిగినా చురుగ్గా ఉంటాను. ఈటీవీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనేదాన్ని. ఆ అనుభవం వీడియోలు సహజంగా చేయడానికి ఉపయోగపడుతోంది. జంధ్యాల జోక్స్‌ అంటే ఇష్టం. పుస్తకాలు ఎక్కువ చదువుతాను. వాటిల్లోని సున్నిత హాస్యానికి ఆధునికతను అద్దుతుంటా. వర్తమాన విషయాలపై పంచ్‌లు వేయడం ఇంకా ఇష్టం. మొన్నో పెళ్లికి వెళ్లా. అక్కడ భోజనంలో నిమ్మకాయ ముక్కలు పెట్టలేదు. ‘ధర ఎక్కువ కదా.. దోచుకెళ్తారని పెట్టలేదేమో అన్నా’. వెంటనే అక్కడే నిమ్మకాయలతో వీడియో చేశాం. ఇదొక ఉదాహరణే. కేవలం 30 సెకన్ల వ్యవధిలో, అదిరే పంచ్‌తో కడుపుబ్బా నవ్వించాలన్నది లక్ష్యం. షాప్‌ చూసుకుంటూనే ఈ వీడియోలు చేస్తుంటాను. ఎడిటింగ్‌లో ఆయన సహకరిస్తారు. యూట్యూబ్‌లో 4 లక్షలకుపైగా, మోజ్‌లో అయితే 11 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టీవీ తారల్లా మమ్మల్నీ కార్యక్రమాలకి ముఖ్యఅతిథులుగా పిలుస్తున్నారు. పోటీపడి సెల్ఫీలు అడుగుతున్నారు.

- సంధ్య


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్