నగరాలను మార్చడమే నా లక్ష్యం!

చిన్నపుడు స్నేహితురాళ్లతో కలిసి స్వేచ్ఛగా వీధుల్లో ఆడుకునేది. సైకిల్‌ మీద బడికి వెళ్లొచ్చేది. కానీ ఆ నగరంలో పెరిగిపోయిన ట్రాఫిక్‌ ఆమె స్వేచ్ఛనూ, సరదాలనూ దూరం చేసింది. అందుకే ఆ అమ్మాయి అలాంటి వీధుల్నీ, నగరాల్నీ మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ (ఐటీడీపీ)’ దక్షిణాసియా డైరెక్టర్‌గా ఎదిగింది. తన లక్ష్య సాధనలో అశ్వతి

Published : 02 May 2022 00:55 IST

చిన్నపుడు స్నేహితురాళ్లతో కలిసి స్వేచ్ఛగా వీధుల్లో ఆడుకునేది. సైకిల్‌ మీద బడికి వెళ్లొచ్చేది. కానీ ఆ నగరంలో పెరిగిపోయిన ట్రాఫిక్‌ ఆమె స్వేచ్ఛనూ, సరదాలనూ దూరం చేసింది. అందుకే ఆ అమ్మాయి అలాంటి వీధుల్నీ, నగరాల్నీ మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ (ఐటీడీపీ)’ దక్షిణాసియా డైరెక్టర్‌గా ఎదిగింది. తన లక్ష్య సాధనలో అశ్వతి దిలీప్‌ ఏం చేస్తోందో వసుంధరతో పంచుకుంది...

నాన్న దిలీప్‌ చినరాజన్‌. నాకు ఏడేళ్లప్పుడు కేరళ నుంచి చెన్నైలోని గిండికొచ్చి స్థిరపడ్డాం. స్కూల్‌ రోజుల్లో వీధుల్లోనే ఆడుకునేవాళ్లం. స్నేహితులతో కలిసి పార్కులకీ, బడికీ, దుకాణాలకీ సైకిల్‌పైనే వెళ్లి వచ్చేదాన్ని. చూస్తుండగానే ట్రాఫిక్‌ పెరిగిపోయింది. ఓసారి స్నేహితురాలితో కలిసి సైకిల్‌మీద వెళ్తుంటే బైక్‌ ఢీకొంది. దాంతో సైకిళ్లపైన వెళ్లడం తగ్గించేశాం. కాలేజీకి వచ్చేసరికి మా వీధిలో నడిచి వెళ్లడానికి కూడా కష్టపడాల్సి పరిస్థితి. ‘దీన్ని మార్చే మార్గాలే లేవా’ అని ఆలోచించినపుడు నాకు ఆర్కిటెక్చర్‌ కనిపించింది. ఇంట్లో ఒప్పించి ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్‌, తర్వాత యూకేలోని కార్డిఫ్‌ యూనివర్సిటీలో ‘అర్బన్‌ డిజైనింగ్‌’లో పీజీ చేశా. బర్మింగ్‌హామ్‌ పారిశ్రామికవాడల్లోని రోడ్లపైన పరిశోధనలు చేశా. పాదచారులకూ చక్కని సదుపాయాలు ఏర్పాటుచేశారక్కడ. ఇండియా తిరిగొచ్చాక అహ్మదాబాద్‌లోని ‘సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌’కు డాక్టర్‌ బీమల్‌ పటేల్‌తో కలిసి ప్రణాళికలు రూపొందించే అవకాశం దక్కింది. ఆ ప్రాజెక్టుతో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అదెంతో పేరు, గుర్తింపు తెచ్చింది. అహ్మదాబాద్‌లో భవనాల్లోని నిర్మాణ లోపాలపై నివేదిక ఇచ్చా. దాని ఆధారంగా ప్రభుత్వం చట్టాల్ని సవరించింది.


రెండు చోట్లా సౌకర్యం..

మా రెండో అబ్బాయికి మూడు నెలలున్నపుడు ఆఫీసుకు తీసుకెళ్లేదాన్ని. ఆ సమయంలో సిబ్బంది, యాజమాన్యం సహకరించారు. మహిళలు ఉద్యోగాలు చేయాలంటే ఈ తరహా ప్రోత్సాహం, ఇలాంటి వసతులు అన్ని కార్యాలయాల్లోనూ ఉండాలి. వాటిల్లోనే కాదు, నగరాలు కూడా మహిళలకు, బాలికలకు సౌకర్యవంతంగా ఉండాలి. ప్రయాణాల్లో వారెన్ని ఇబ్బందులెదుర్కొంటారో కళ్లారా చూశా. కాబట్టి నగరాల్లో మహిళలకు అనువుగా బాటల్ని, వాహనాల్లో అనువైన వసతుల్ని తెచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం. కమిటీల్లో మహిళలకూ ప్రాధాన్యం ఉండేలా ప్రతిపాదిస్తున్నాం.


2010లో కపిల్‌తో వివాహమైంది. తను చెన్నైలోనే ఒక కెమికల్‌ సంస్థలో ఇంజినీర్‌. దాంతో మళీకల ఇక్కడికి వచ్చేశా. తర్వాత పిల్లల కోసం కొంత విరామం తీసుకున్నా. రెండో బాబు పుట్టాక చెన్నైలోనే 2014లో ఐటీడీపీలో చేరా. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ నగరాలకు అనువైన పాలసీల్ని రూపొందిస్తుంది. నా లక్ష్యం కూడా ఇదే కావడంతో మరో ఆలోచన లేకుండా చేరిపోయా. 20 ఏళ్ల నుంచి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందీ సంస్థ. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నగర పాలక సంస్థలతో కలిసి నగరాల్ని ప్రజల జీవనానికి అనుకూలమైనవిగా మార్చే ప్రణాళికల రచన, అమలులో మా సంస్థ భాగస్వామి.

చెన్నైతోనే మొదలు

ఐటీడీపీలో చేరిన కొత్తలో ‘నమ్మ చెన్నై నమక్కె (మన చెన్నై మనకే)’ ప్రాజెక్టు మేనేజర్‌గా నన్ను నియమించారు. నగరవాసుల్ని నడక, సైక్లింగ్‌ దిశగా ఆలోచించేలా అనేక కార్యక్రమాలు చేశాం. దేశంలోనే తొలిసారిగా ‘కార్‌ ఫ్రీ సండే’ని ప్రారంభించాం. ఎంపిక చేసిన రోడ్లలో ఉదయం 6-10 మధ్య కార్లూ, బైకులు తిరగకుండా ప్రజలు వాకింగ్‌, సైక్లింగ్‌, యోగా చేసుకునేలా, పిల్లలు కబడ్డీ, క్రికెట్‌ ఆడుకునే వీలు కల్పించాం. దానికి మంచి స్పందన వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమం దేశంలో అనేక నగరాలకూ విస్తరించింది. చెన్నైలోని టీనగర్‌(పాండీ బజార్‌) పెడస్ట్రియన్‌ ప్లాజా నేను డిజైన్‌ చేసిన ప్రాజెక్టుల్లో మరొకటి. 1.4 కిలోమీటర్ల పొడవుండే ఈ దారిలో వాహనాల కదలికలకు ఇబ్బంది లేకుండానే విశాలమైన వీధులుండేలా డిజైన్‌ చేశాం. ఇక్కడ పాదచారులు నిర్భయంగా నడిచి వెళ్లొచ్చు. పిల్లలు ఆడుకోవడానికీ ఏర్పాట్లు ఉన్నాయి. బెంచీలూ వృద్ధులకు ఎలక్ట్రిక్‌ కార్లు పెట్టాం. దీనికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. తర్వాత మరో రెండు చోట్లా ఇలాంటి ప్రాజెక్టులు చేస్తున్నాం.

కేంద్ర ప్రభుత్వ స్మార్ట్‌సిటీ మిషన్‌లోనూ ఐటీడీపీ కీలక భాగస్వామి. దీన్లో భాగంగా ఇండియాసైకిల్‌4 ఛేంజ్‌, స్ట్రీట్స్‌4 పీపుల్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ ఆల్‌... కార్యక్రమాలు రూపొందించాం. 2020 జూన్‌లో వీటిని ప్రారంభించాం. పర్యావరణహిత రవాణా, పాదచారులకూ, సైక్లిస్ట్‌లకూ అనుకూలమైన రహదారులు, తీసుకురావాల్సిన మార్పులపై ప్రణాళికలు, అవసరమైన పరిజ్ఞానాన్ని 140 నగరాలకు అందిస్తున్నాం. ఆ నగరాల భౌగోళిక తీరు, ట్రాఫిక్‌... ఇలా అన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు ఇస్తాం. ప్రజల కోసం రోడ్డుపక్కనే పచ్చదనం, సేదదీరేందుకు బల్లలు, వ్యాయామశాలలు, వర్షపు నీటి నిర్వహణ ఇవన్నీ రోడ్ల డిజైన్లలో ఉండేలా చేస్తున్నాం. నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో వినూత్నమైన సైకిల్‌బాటల్ని వేశాం. రోడ్డు పక్కనే సైక్లింగ్‌ శిక్షణ శిబిరాల్నీ, రిపేరింగ్‌ దుకాణాల్నీ పెట్టాం. ఇప్పుడది సైక్లింగ్‌ సిటీగా మారిపోయింది. నగరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సుల రవాణాకూ ప్రణాళికలు ఇస్తున్నాం. ఏప్రిల్‌లో రెండో దశ ఛాలెంజ్‌తో కొత్త నగరాలకూ విస్తరించాం.

‘మీకు రోడ్లంటే ఎందుకింత ఇష్టం’ అని చాలామంది అడుగుతుంటారు. నా సమాధానం ఒక్కటే... ప్రతి ఒక్కరి చిన్నతనం వీధుల్లో సరదాగా తిరగడం, ఆడుకోవడంతోనే మొదలవుతుంది. వీధుల్లో స్నేహితులతో కలిసి షికార్లు చేయడమంటే నాకెంతో ఇష్టం. రేపటి తరాలకూ మనం ఇలాంటి సరదాల్నీ, సంతోషాల్నీ అందించాలన్నదే నా లక్ష్యం.

- హిదయ్‌తుల్లాహ్‌ బీజాపూర్‌, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్