పిల్లల కోసం క్యాన్సర్‌ని జయించింది!

‘ఆరు నెలలే.. అంతకు మించి బతకడం కష్టం’ అన్నారు వైద్యులు... ‘ఇలా బతికేకంటే ఏదైనా తిని చావొచ్చుగా’ అన్నారు ఇంట్లో వాళ్లు... ఇవన్నీ విన్నప్పుడు తనకంటే కూడా పిల్లల గురించే ఆందోళన చెందేది ఆ తల్లి. ‘ఎలాగైనా బతకాలి... వాళ్లకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి’ అనుకునేది. ఆ అమ్మ కోరిక ముందు అసాధ్యం సుసాధ్యమైంది. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటంలో ఆమె గెలిచి నిలిచింది.

Published : 08 May 2022 00:29 IST

‘ఆరు నెలలే.. అంతకు మించి బతకడం కష్టం’ అన్నారు వైద్యులు... ‘ఇలా బతికేకంటే ఏదైనా తిని చావొచ్చుగా’ అన్నారు ఇంట్లో వాళ్లు... ఇవన్నీ విన్నప్పుడు తనకంటే కూడా పిల్లల గురించే ఆందోళన చెందేది ఆ తల్లి. ‘ఎలాగైనా బతకాలి... వాళ్లకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి’ అనుకునేది. ఆ అమ్మ కోరిక ముందు అసాధ్యం సుసాధ్యమైంది. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటంలో ఆమె గెలిచి నిలిచింది.

భువనేశ్వరి ఉండేది తమిళనాడులోని తిరుచ్చిలో. భర్త, ఇద్దరు ఆడపిల్లలు, తను... సాఫీగా సాగిపోయేది జీవితం. బ్యుటీషియన్‌గా, టైలర్‌గా చేస్తూ భర్త భరత్‌కు చేదోడు వాదోడుగా ఉండేది. సంతోషంగా ఉన్న ఆమె జీవితంలోకి అనుకోని విపత్తు వచ్చింది. ఓసారి బైక్‌ పైనుంచి పడిపోవడంతో తనకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స జరిగిన రెండు నెలలకు ముఖానికి ఎడమవైపు చిన్న కణితి వచ్చింది. మొదట్లో పట్టించుకోలేదు. రెండేళ్లకు ఉసిరికాయంత పెరిగింది. చివరకు పరీక్షల్లో క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. ‘నెల రోజులకే అది పెద్దదైంది. కణితి ఉన్నవైపు దవడ తీసేయాలన్నారు డాక్టర్లు. లక్షల రూపాయలు ఖర్చయినా ప్రాణానికి 33 శాతం మాత్రమే గ్యారెంటీ అనడంతో మెదడు మొద్దుబారిపోయింది. ఆ నిమిషంలో నాకు గుర్తొచ్చిందొకటే... పిల్లలు.. నాకేదైనా అయితే వాళ్ల భవిష్యత్తు ఏంటని ఆలోచించా. అందుకే ఎలాగైనా బతకాలనే ఆశతో చికిత్సకి సిద్ధపడ్డా’ అని గుర్తుచేసుకుంటుంది భువనేశ్వరి.

పిల్లల ఆకలి తీర్చలేదు...

చూస్తుండగానే కణితి కిలోన్నర సైజు పెరిగి అందులోంచి చిన్న పురుగుల్లాంటివి వచ్చేవి. చెవి, ముక్కు నుంచి రక్తం ఆగేది కాదు. దీంతో తీవ్ర కుంగుబాటుకు గురైంది భువనేశ్వరి. ‘ఒక రోజు కణితి నుంచి వచ్చిన పురుగుని చూసిన వైద్యులు నీది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఏం చేసినా లాభం లేదు. ఆరు నెలలే సమయం ఉందని చెప్పి పంపించేశారు. దాంతో నన్ను కేరళలోని మా సొంతూరులో ఉంచారు. దగ్గరకు రావడానికే భయపడేవారంతా. ‘ఇంత కష్టపడి బతకడమెందుకు.. ఏదైనా తిని ఆత్మహత్య చేసుకోరాదూ’ అన్నారు కూడా. ఇంత బాధలోనూ ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించే దాన్ని. పిల్లలకు వేళకి అన్నం కూడా పెట్టేవారు కాదు. కళ్లు మూసినా తెరిచినా వాళ్లే గుర్తొచ్చే వారు’ అని తన మానసిక సంఘర్షణను చెబుతుందామె. ఎవరే సలహా చెప్పినా పాటించేది. ఒకావిడ సూచనతో సేంద్రియ విధానంలో పండించిన పచ్చికూరగాయలు, చిరుధాన్యాలు, ముతక బియ్యం వంటివి తినడం మొదలుపెట్టింది. ‘ఆహారంలో మార్పుతో నాలుగైదు నెలలకు శరీరానికి శక్తి వచ్చినట్లనిపించింది. ఈసారి పుదుచ్చేరి జిప్‌మర్‌కు వెళ్లాం. చికిత్స చేస్తే తగ్గుతుందనడంతో పట్టరాని సంతోషం కలిగింది. 23 గంటలు ఆపరేషన్‌ చేశారు. తొడ నుంచి కొంత కండ, చర్మాన్ని తీసి ముఖానికి వినియోగించారు. కానీ ఆ ఆపరేషన్‌ ఫెయిలైంది. దాంతో మళ్లీ చేశారు. ఈసారి పొట్ట పక్కన ఉన్న కండ, చర్మాన్ని తీశారు. ఆ మూడు నెలల్లో చాలా చికిత్సలు జరిగాయి. శరీరం శుష్కించింది. గతంలో తీసుకున్న ఆహారాన్నే కొనసాగించి ఆరునెలలకు తేరుకున్నా. ఇది జరిగి పదేళ్లు అయ్యింది. ఇప్పటికీ నా నోరు 20 శాతమే తెరుచుకుంటుంది. చికిత్స కోసం నాన్న ఇచ్చిన పొలం, కారు, నగలు అన్నింటినీ అమ్మేశా. క్రౌడ్‌ ఫండింగ్‌ద్వారా కొంత సాయం దొరికింది. పెద్దమ్మాయి స్వర్గవి సివిల్స్‌కి సిద్ధమవుతోంది. చిన్నమ్మాయి సంధ్య ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తోంది. వదిన చనిపోవడంతో అన్నయ్య ఇద్దరు ఆడపిల్లలకూ నేనే తల్లినయ్యా. నా నలుగురు పిల్లల్నీ మంచి స్థాయిలో చూడాలన్నది లక్ష్యం’ అనే భువనేశ్వరి ప్రస్తుతం వెల్‌నెస్‌ కోచ్‌గా ఆరోగ్యకర జీవన విధానాల గురించి చైతన్యం తీసుకొచ్చే కృషిలో ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్