ఆ బాధ.. వేలమందికి మార్గదర్శిని చేసింది!

ఆమె ప్రేమకు అమ్మానాన్న, స్థాయి.. ఏదీ అడ్డుకాలేదు. చివరికి అతడికొచ్చిన క్యాన్సర్‌ కూడా తమను వీడదీయలేదు అనుకుంది. కానీ అక్కడే ఆమె అంచనా తప్పింది. అతన్ని అది కబళించింది. బాధతో ఆగిపోలేదామె. ఆ మహమ్మారి బారి నుంచి వీలైనంతమందిని కాపాడాలనుకుంటోంది.

Updated : 20 May 2022 01:09 IST

డింపుల్‌

ఆమె ప్రేమకు అమ్మానాన్న, స్థాయి.. ఏదీ అడ్డుకాలేదు. చివరికి అతడికొచ్చిన క్యాన్సర్‌ కూడా తమను వీడదీయలేదు అనుకుంది. కానీ అక్కడే ఆమె అంచనా తప్పింది. అతన్ని అది కబళించింది. బాధతో ఆగిపోలేదామె. ఆ మహమ్మారి బారి నుంచి వీలైనంతమందిని కాపాడాలనుకుంటోంది. అందుకామేం చేస్తోందో తెలియాలంటే డింపుల్‌ పర్మర్‌ గురించి తెలుసుకోవాల్సిందే!

క్యాన్సర్‌ అని తెలిసీ ప్రేమించడం అంటే సరే! అది మూడో స్టేజీలో ఉందని తెలిసీ పెళ్లి చేసుకునే ధైర్యం చేస్తారా ఎవరైనా? డింపుల్‌ పర్మర్‌ చేసింది. ఈమెది పుణె. కోల్‌కతాలో ఎంబీఏ చేసేటపుడు నితేష్‌ని కలిసింది. ‘పాతికేళ్లు కూడా లేవు. అందరం కెరియర్‌ బాగుండాలని పోటీపడి చదివే వాళ్లం. తనేమో మొదటి ఏడాదిలోనే స్టార్టప్‌నీ మొదలుపెట్టాడు. చదువు, సంస్థ రెంటినీ బాగా సమన్వయం చేసే తన తీరు నాకు బాగా నచ్చింది. నాకూ సొంత వ్యాపార ఆలోచన ఉంది. దాంతో ఇద్దరం స్నేహితులయ్యాం. తను తరచూ జబ్బు పడే వాడు. హాస్పిటల్‌కి వెళ్లొచ్చాక బాగా అలసిపోయినట్లుగా కనిపించే వాడు. మరీ ఎక్కువ కష్టపడొద్దు అనేదాన్ని తనేమో నవ్వి ఊరుకునేవాడు. తన తీరు నాకు సందేహమనిపించేది. బహుశా నాతో స్నేహం ఇష్టం లేక అలా ప్రవర్తిస్తున్నాడనుకున్నా. తర్వాతే తనకు క్యాన్సర్‌ మూడో స్టేజ్‌ అన్న నిజాన్ని బయటపెట్టాడు. అంత తెలివైన, కష్టపడే అబ్బాయికి ఇంత కష్టమొచ్చిందని తెలిసి బాధేసింది. ఈ పోరాటంలో తనకు తోడుగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నా’ అని చెప్పుకొచ్చింది డింపుల్‌.

తను చికిత్స కోసం ముంబయి కెళితే.. తనకు నోట్్స రాసిపెట్టడం, మెటీరియల్‌తోపాటు తన సంస్థ వ్యవహారాలనూ డింపులే చూసుకునేది. మొదటి దశ కీమో తర్వాత నితేష్‌ కాలేజ్‌కి తిరిగొచ్చేశాడు. తనకు స్వయంగా వండి పెట్టడమే కాదు, దగ్గరుండి చెకప్‌లకీ తీసుకెళ్లేది. దీంతో వాళ్లిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారి తీసింది. ‘వరుస కీమోలు, తర్వాత ఒక సర్జరీ చేయాల్సి వచ్చింది. తనూ త్వరగానే కోలుకున్నాడు. ముఖంలోకీ జీవమొచ్చింది. చాలా సంతోషమేసింది. మా రెండు కుటుంబాలూ ఒప్పుకోవడంతో కాలేజ్‌లోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యింది. చికిత్సల సమయంలో సరిగా నిర్వహించలేక వ్యాపారాన్ని పక్కన పెట్టాం. తర్వాత ఇద్దరికీ మంచి సంస్థల్లో ఉద్యోగాలొచ్చాయి. తీరా చేరేటప్పటికి తనకి క్యాన్సర్‌ తిరగబెట్టింది. ఉద్యోగాన్ని పక్కనపెట్టి పరిశోధ]న మొదలుపెట్టా. ఐఐటీ స్నేహితులతో కలిసి ప్రత్యేక టెక్నాలజీనీ రూపొందించాం. అప్పుడే యూఎస్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని తెలిసి అక్కడ ప్రయత్నిస్తే చికిత్స చేయడానికి సరేనన్నారు. నా ప్రేమ తనను బతికిస్తుందని నమ్మకం. అందుకే పెళ్లి చేసుకొని మరీ వెళ్లాం. కానీ ఆశలు ఆవిరి చేస్తూ తను 2018లో దూరమయ్యాడు’ అంటూ ఆనాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకుంది డింపుల్‌.

ఆ బాధ నుంచి బయటపడ్డాక ఏదైనా చేయాలనుకుంది. అప్పటికే ఎంతోమంది సైంటిస్టులు, వైద్యులతో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో క్యాన్సర్‌తో పోరాడే వాళ్లకి సాయంగా 2019లో రెండు సంస్థల్ని ప్రారంభించింది. ‘లవ్‌ హీల్స్‌ క్యాన్సర్‌’ దీని ద్వారా చికిత్సతో మానసికంగా కుంగిపోయేవారికి కౌన్సెలింగ్‌ ఇస్తుంది. జెన్‌ఆంకో.ఐఓ ద్వారా రోగులు, వైద్యులకు మధ్య వారధిగా పని చేయడమే కాక వివిధ రకాల థెరపీలనూ పరిచయం చేస్తుంది. దాదాపుగా 40 వేలకుపైగా మంది ఈమె సేవలు వినియోగించుకున్నారు. ‘క్యాన్సర్‌ రోగులకు నాణ్యమైన జీవితాన్ని అందించడంతోపాటు దాని పట్ల భయాన్ని దూరం చేయడమే నా లక్ష్యం’ అనే డింపుల్‌ తన ఎన్‌జీఓ సహ వ్యవస్థాపకుడైన కిషన్‌నే ఇటీవల పెళ్లి చేసుకుంది. తనూ క్యాన్సర్‌ని జయించినవాడే.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్