సైకిల్‌పై ప్రపంచ రికార్డు!

అమ్మాయిలు.. సోలో ట్రిప్‌లు.. వేల కిలోమీటర్ల ప్రయాణాలు అనగానే వింతగా అనిపించకపోవచ్చు. మన దగ్గరా ఎందరో బైకర్ణీలు ఈ సాహసాలను చేస్తున్నారు. దీన్నే సైకిల్‌పై ప్రయత్నించింది ప్రీతి మాస్కే. అది ప్రపంచ రికార్డు కూడా! ఆ సాహస వివరాలు చూద్దామా?లేహ్‌ నుంచి మనాలీ వరకు ప్రయాణం ప్రీతి టార్గెట్‌.

Published : 30 Jun 2022 00:44 IST

అమ్మాయిలు.. సోలో ట్రిప్‌లు.. వేల కిలోమీటర్ల ప్రయాణాలు అనగానే వింతగా అనిపించకపోవచ్చు. మన దగ్గరా ఎందరో బైకర్ణీలు ఈ సాహసాలను చేస్తున్నారు. దీన్నే సైకిల్‌పై ప్రయత్నించింది ప్రీతి మాస్కే. అది ప్రపంచ రికార్డు కూడా! ఆ సాహస వివరాలు చూద్దామా?

లేహ్‌ నుంచి మనాలీ వరకు ప్రయాణం ప్రీతి టార్గెట్‌. మొత్తం 480 కి.మీ.. ఇలా ఇంతదూరం సోలో సైక్లింగ్‌ చేసిన తొలి మహిళగా నిలవడమే కాకుండా గిన్నిస్‌ రికార్డునీ అందుకుంది. దీన్ని 60 గంటల్లో పూర్తిచేస్తే రికార్డు. కానీ 55 గంటల 13 నిమిషాల్లోనే సాధించింది. ఇంతకీ తన వయసెంతో తెలుసా? 45 ఏళ్లు. పైగా ఇద్దరు పిల్లల తల్లి. అయిదేళ్ల క్రితం అనారోగ్య సమస్యల దృష్ట్యా వ్యాయామంగా సైక్లింగ్‌ను ఎంచుకుంది. దేంట్లో అయినా ప్రత్యేకంగా నిలవాలన్న కోరిక ఆమెను సాహసాల వైపు నడిపించింది. అన్ని గంటలు, అంత దూరం సైకిల్‌ తొక్కడం ఒకెత్తయితే నిరంతరం మారే వాతావరణం ఆమెకు సవాళ్లను విసిరింది. కొద్దిసేపు మంటలు పుట్టించే వేడి, బలమైన ఈదురు గాలులు, అంతలోనే మంచు వర్షం, ఎముకలు కొరికే చలి, దారంతా ఎన్నో మలుపులు. అంతేకాదు.. వేల మీటర్ల ఎత్తున పర్వత ప్రాంతంలో ఆక్సిజన్‌ అందడమూ కష్టమే. దీంతో రెండుసార్లు కృత్రిమంగా ఆక్సిజన్‌ను తీసుకోవాల్సి వచ్చిందట.

మొదటిదేం కాదు..

ప్రీతీ వాళ్లది పుణె. తను బాస్కెట్‌ బాల్‌, హాకీలలో జాతీయ స్థాయి క్రీడాకారిణి. పెళ్లయ్యాక ఆటకి దూరమైంది. ఆరోగ్యం కోసమని నడక, పరుగు మొదలుపెట్టింది. ఆమెను చూసిన ఓ కోచ్‌ రన్నింగ్‌ను సీరియస్‌గా సాధన చేయమన్నాడు. అలా 30 హాఫ్‌ మారథాన్‌లు, 2 అల్ట్రా మారథాన్లలో పాల్గొంది. ఇవి అంత సవాల్‌గా అనిపించక సైకిల్‌ బాట పట్టింది. 2019 నుంచి సాహసాలు ప్రారంభించింది. ఇద్దరితో కలిసి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 3773 కి.మీ. దూరాన్ని 17 రోజుల 17 గంటల్లో పూర్తిచేసింది. ఇది గ్రూప్‌ వరల్డ్‌ రికార్డు. అదే ఏడాది డిసెంబరులో అమృత్‌సర్‌ నుంచి నాసిక్‌ వరకు 1600 కి.మీ. 5 రోజుల్లో ప్రయాణించి ఇలా చేసిన ఏకైక మహిళగా నిలిచింది. 2021లో 6 వేల కి.మీ. స్వర్ణ చతుర్భుజి రహదారిని 24 రోజుల్లో పూర్తిచేసింది. ఎందుకీ సాహసాలంటే.. ‘జీవితమంటేనే ఎన్నో సవాళ్లు. వాటిని చూసి భయపడక ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ భయాన్ని పోగొట్టుకునే మార్గమే ఇది. నాలానే మీరూ ఎదుర్కోవచ్చు అని తోటి మహిళల్లో ధైర్యం నింపే ప్రయత్నమే ఇది’ అంటోన్న ఈమె సాహసం స్ఫూర్తిమంతమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్