Dronavalli Harika: నిండు గర్భంతో ఆడి మెడల్‌ అందించింది!

కెరీరా? పిల్లలా?.. అనడిగితే దేన్నీ వదులుకోలేరు మహిళలు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రెండింటినీ సమన్వయం చేసుకోవడానికే శాయశక్తులా ప్రయత్నిస్తారు. హైదరాబాదీ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక కూడా అదే చేసింది. మొన్న చెస్‌ ఒలింపియాడ్‌ .....

Published : 11 Aug 2022 19:14 IST

కెరీరా? పిల్లలా?.. అనడిగితే దేన్నీ వదులుకోలేరు మహిళలు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రెండింటినీ సమన్వయం చేసుకోవడానికే శాయశక్తులా ప్రయత్నిస్తారు. హైదరాబాదీ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక కూడా అదే చేసింది. మొన్న చెస్‌ ఒలింపియాడ్‌ జరిగే నాటికి ఆమె తొమ్మిది నెలల నిండు గర్భిణి. అలాగని ఈ కారణంతో పోటీలకు దూరం కావడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే డాక్టర్‌ సలహాతో ఆటలో కసరత్తులు చేసింది. పోటీలో పాల్గొని జట్టుకు కాంస్యం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. ఓవైపు త్వరలోనే అమ్మ కాబోతుండడం, మరోవైపు ప్రతిష్టాత్మక ‘చెస్‌ ఒలింపియాడ్‌’లో దేశానికి తొలి పతకం అందించడం.. ఈ రెండూ మర్చిపోలేని అనుభూతులంటూ.. ఆ గెలుపు క్షణాల్ని ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో అక్షరీకరించింది హారిక. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఇటీవలే చెన్నై వేదికగా ప్రతిష్టాత్మక ‘చెస్‌ ఒలింపియాడ్‌’ ముగిసిన సంగతి తెలిసిందే! ఇందులో భారత మహిళల జట్టుకు కాంస్య పతకం దక్కింది. 1978లో తొలిసారి ఈ పోటీల్లోకి భారత మహిళల విభాగం ప్రవేశించగా.. ఈ ఏడాదే కాంస్యం రూపంలో తొలి పతకం దక్కడం విశేషం. గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి నాయకత్వంలో ముందుకు సాగిన ఈ బృందంలో వైశాలి, తానియా, భక్తి కులకర్ణిలతో పాటు హైదరాబాదీ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక కూడా భాగమైంది. అయితే ఇక్కడ హారిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఇప్పుడు తొమ్మిది నెలల నిండు గర్భిణి. ఈ దశలో కూడా పోటీల్లో పాల్గొని.. బృందం కాంస్యం గెలవడంలో కీలక పాత్ర పోషించడం ఆటపై తనకున్న అంకితభావానికి నిదర్శనం!

అందుకు డాక్టర్‌ ఒప్పుకున్నారు!

అయితే ఇటు అమ్మను కాబోతుండడం, అటు కాంస్య పతకం నెగ్గడంతో డబుల్‌ హ్యాపీనెస్‌తో ఉన్నానన్న హారిక.. ఈ క్రమంలో తన అనుభవాలను ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.
‘నాకు 13 ఏళ్లున్నప్పుడు నేను చెస్‌లోకి అడుగుపెట్టాను. 18 ఏళ్లుగా ఆటలో కొనసాగుతున్నా. ఇప్పటివరకు 9 ఒలింపియాడ్స్‌లో పాల్గొన్నా. అప్పట్నుంచి ప్రతిసారీ భారత మహిళల బృందం పోడియంపై నిల్చొని పతకం అందుకోవాలని కలలు కన్నా.. అది ఇప్పుడు సాకారమైంది. ఈ మెడల్‌ నాకెంతో ప్రత్యేకం.. ఎందుకంటే నేను ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణిని. ఒలింపియాడ్‌ మన దేశంలో తొలిసారి నిర్వహిస్తున్నారన్న విషయం తెలియగానే డాక్టర్‌ని సంప్రదించా. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యంగా ఉంటే ఈ టోర్నీలో పోటీ పడచ్చని సలహా ఇవ్వడంతో సంతోషంగా ఈ పోటీపై దృష్టి పెట్టా.

ఏదైనా ఆ తర్వాతే అనుకున్నా!

అప్పట్నుంచి నా మనసు, ఆలోచనలన్నీ ఈ ఆట చుట్టూ తిరగడం ప్రారంభించాయి. నేను వేసే ప్రతి అడుగు విజయాన్ని కాంక్షించింది. సీమంతం, పార్టీలు, ఇతర సెలబ్రేషన్స్‌.. అన్నీ మెడల్‌ గెలిచాకే అని నిర్ణయించుకున్నా. ఇలా ఇవన్నీ త్యాగం చేసి రోజురోజుకీ నా నైపుణ్యాల్ని పెంచుకోవడం పైనే దృష్టి పెట్టా. ఈ అద్భుతమైన క్షణం కోసమే ఇన్ని నెలలుగా ఎదురుచూశా.. ఇప్పటికి ఫలించింది. భారత మహిళల చెస్‌ బృందం.. చెస్‌ ఒలింపియాడ్‌లో తొలి పతకం అందుకొని మెరిసింది..’ అంటూ తన సంతోషాన్ని పంచుకుందీ గ్రాండ్‌ మాస్టర్‌. ఈ ప్రతిష్టాత్మక పోటీలో తొలి పతకం నెగ్గడం ఒకెత్తయితే.. నిండు గర్భంతో హారిక పోటీపడి ఈ విజయంలో కీలకంగా మారడం మరో ఎత్తు. అందుకే ఈ లేడీ గ్రాండ్‌ మాస్టర్‌ స్ఫూర్తిని, ఆటపై ఆమెకున్న అంకితభావాన్ని, పట్టుదలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

వాళ్ల అండతోనే సాధ్యమైంది!

మన పట్టుదలకు తోడు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటేనే మహిళలు ఎందులోనైనా, ఏ దశలో ఉన్నా విజయం సాధించగలుగుతారు. ఇదే విధంగా తాను కూడా భర్త, కుటుంబ సభ్యుల అండతోనే ముందుకు సాగానంటోంది హారిక. చెస్‌ ఒలింపియాడ్‌ గురించి తెలిసేసరికి మూడో దశ ప్రెగ్నెన్సీలోకి అడుగుపెట్టిన ఆమె.. అటు ఆరోగ్యాన్ని, ఇటు ఆటను బ్యాలన్స్‌ చేస్తూ ముందుకు సాగానంటూ చెప్పుకొచ్చింది.
‘గర్భం ధరించడమనేది ప్రతి మహిళ జీవితంలో ఓ మధురమైన ఘట్టం. నేనూ ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తున్నా. అయితే చెస్‌ ఒలింపియాడ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో అటు ఆరోగ్యాన్ని, ఇటు ఆటను సమన్వయం చేసుకోగలిగానంటూ అదంతా నా భర్త కార్తీక్‌, ఇతర కుటుంబ సభ్యుల అండతోనే సాధ్యమైంది. అలాగే ఆన్‌లైన్‌ తరహాలో నిర్వహించిన క్యాంపులు నాకు బాగా ఉపయోగపడ్డాయి. అయితే సాధనలో భాగంగా ఎక్కువ సమయం కూర్చొనే ఉండడం వల్ల కాళ్లలో నీరు చేరి వాపొచ్చేది. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి నడక, తేలికపాటి వ్యాయామాలు చేశా. ఇక పోటీల కోసం చెన్నై వెళ్లేందుకు డాక్టర్‌ పలు జాగ్రత్తలు చెప్పడంతో పాటు.. సకల సదుపాయాలూ సమకూర్చారు.. ఇలా వీళ్లందరి సహకారం, ప్రోత్సాహంతోనే నా కల నెరవేరింది..’ అంటూ ఉప్పొంగిపోతోందీ విన్నర్‌.

ప్రెగ్నెన్సీ అనారోగ్యం కాదని, బిడ్డ పుట్టే వరకు మహిళలు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి, డాక్టర్‌ సలహా మేరకు తమ కెరీర్‌లోనూ కొనసాగచ్చని తన విజయంతో మరోసారి నిరూపించిన ఈ గ్రాండ్‌మాస్టర్‌ నేటి మహిళలకు స్ఫూర్తిదాయకం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్