నా కోసం షూటింగ్‌ వాయిదా వేసేవారు: సరస్వతీ సత్యం

హేమామాలిని, శ్రీదేవి నుంచి సమంత, నయనతార, రకుల్‌ వంటి వారి వరకూ ఎందరో హీరోయిన్లు తన కోసం ఎదురు చూసిన వారే. కొందరైతే ఆమె ఖాళీగా లేకపోతే షూటింగ్‌లను వాయిదా వేసుకుంటారు. ఇంతకీ ఎవరావిడ, ఏం చేస్తారు అంటే...

Updated : 24 Jul 2021 09:38 IST

హేమామాలిని, శ్రీదేవి నుంచి సమంత, నయనతార, రకుల్‌ వంటి వారి వరకూ ఎందరో హీరోయిన్లు తన కోసం ఎదురు చూసిన వారే. కొందరైతే ఆమె ఖాళీగా లేకపోతే షూటింగ్‌లను వాయిదా వేసుకుంటారు. ఇంతకీ ఎవరావిడ, ఏం చేస్తారు అంటే... చీర కడతారు! చీరా అని తేలిగ్గా తీసేయకండి. దేశంలోనే తొలి శారీడ్రేపర్‌గా రెండు దశాబ్దాలుగా ప్రత్యేకతను చాటుకుంటున్న సరస్వతీ సత్యం తన ప్రస్థానాన్ని ‘వసుంధర’తో పంచుకున్నారు.

చీర కట్టుకోవడం ఓ కళ. వంద రూపాయలదైనా, లక్షల ఖరీదు చేసేదైనా కట్టుకోవడంలోనే దాని అందం, విలువ పెరుగుతాయి. ఈ కళ నాకెలా అబ్బిందో తెలీదు. నేనే శిక్షణా తీసుకోలేదు. జీవితమే అన్నీ నేర్పింది. మాది బొబ్బిలి. అమ్మా నాన్న బతుకుదెరువు కోసం చెన్నైకి వచ్చారు. తొమ్మిది మంది సంతానం. ఇద్దరు ఆడపిల్లలం, ఏడుగురు మగపిల్లలు. నేను ఏడోదాన్ని. నాన్న కారు డ్రైవరు. ఆయన సంపాదన చాలేది కాదు. దాంతో మాకు చదువు చెప్పించలేదు. నా పదో ఏట నుంచి నూజివీడులోని అత్త దగ్గర పెరిగా. 18 ఏళ్లకే పెళ్లైంది. ఆ వెంటనే ఇద్దరాడపిల్లలు. అత్తవారి వేధింపులు భరించలేక పుట్టింటికి వెళితే, తిరిగి నా భర్త దగ్గరకే పంపేవారు. రెండో అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. దాంతో పుట్టింటి దారి మూసుకు పోయింది. అత్తగారింట్లో ఉండలేని పరిస్థితి. పిల్లలతో బయటికొచ్చేశా. అప్పటికి పెద్దమ్మాయి దివ్యకి ఎనిమిది, చిన్నపాప జీవితకి ఆరున్నరేళ్లు. ఉద్యోగం చేసే చదువులేదు. ఎవరి సాయమూ లేదు. ఎంత కష్టమైనా పిల్లలను బాగా చదివించాలనేది నా లక్ష్యం.

అవకాశాలొచ్చాయి

ఒక ఇంట్లో పనికి చేరా. అక్కడ వారిచ్చే భోజనాన్ని పిల్లలకు పెట్టి నేను మంచి నీళ్లు తాగేదాన్ని. తెలిసినవారి ద్వారా టీవీ, సినీ తారలకు అసిస్టెంట్‌గా వెళితే, రోజుకి రూ.75 వచ్చేవి. ఒక్కోసారి అవీ దొరికేవి కాదు. అలాంటప్పుడు పిల్లల కడుపు నింపి, నేను పస్తుండేదాన్ని. ఆ పరిస్థితుల్లోనూ వాళ్లను స్కూల్‌లో చేర్చా. తర్వాత సినిమాల్లో హీరోయిన్స్‌కు అసిస్టెంట్‌గా అప్పుడప్పుడూ పని దొరికేది. మీరా జాస్మిన్‌, స్నేహ, మీరా వాసుదేవన్‌ వంటి చాలా మందికి అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు వాళ్లకు చీరకట్టే దాన్ని. డిజైనర్‌ దక్ష పరిచయంతో యాడ్స్‌లో అవకాశం వచ్చింది. అలా అనుభవం, నైపుణ్యం వచ్చాయి.

సరస్వతి చీరకట్టులో తమన్నా..

హేమమాలిని దగ్గర కాళ్లు వణికాయి...

రెండు దశాబ్దాల క్రితం నా అసలైన కెరియర్‌ మొదలైంది. అప్పటికి నాకు పాతికేళ్లు. అప్పట్లో డిజైనర్లే శారీ డ్రేపింగ్‌ చేసేవారు. లేదంటే ఆర్టిస్టులే కట్టుకునే వారు. ఆ సమయంలో నేను తొలి శారీ డ్రేపర్‌గా అడుగుపెట్టా. నా మొదటి అవకాశం హేమామాలిని. చెన్నైలో ఓ యాడ్‌ కోసం వచ్చారామె. కారవ్యాన్‌లోకి వెళితే ప్రశ్నార్థకంగా చూశారు. నా కాళ్లు వణికాయి. ‘చీర కట్టడానికి ప్రత్యేకంగా మనిషి ఉంటారా, నాకు అవసరం లేదు’ అన్నారు. డైరెక్టరు పంపారు, ఒక్కసారి కట్టి చూపిస్తా మేడం అంటే ఒప్పుకొన్నారు. అయిదు నిమిషాల్లోనే కట్టేసరికి, ‘ఇంత తక్కువ సమయంలో చాలా అందంగా కనిపించేలా చేశావు. నువ్వు నాతో ముంబయి వచ్చేయకూడదూ’ అన్నారు. అదీ నా మొదటి అనుభవం. తర్వాత ఓ యాడ్‌లో శ్రీదేవికి చీరకట్టే అవకాశం వచ్చింది.

కుటుంబ సభ్యురాలిని...

కాస్త పేరొచ్చాక ప్రముఖుల పెళ్లిళ్లకు పిలుపు రావడం మొదలైంది. ఒకేరోజు రెండు మూడు, కొన్ని సార్లు రాత్రీ పగలూ షూటింగ్స్‌ ఉండేవి. దీంతో పది మందికి శిక్షణనిచ్చి, ఓ బృందాన్ని తయారు చేసుకున్నా. ఫ్యాషన్‌ షోలకూ పనిచేశా. ఒకప్పుడు బాగా పని చేయలేదని నన్ను బయటకు పంపిన వారే, తర్వాత నా కాల్‌షీట్స్‌ కోసం నెల రోజులైనా షూటింగ్‌ను వాయిదా వేసుకున్న సందర్భాలున్నాయి. ఓసారి రూ.50 లక్షలు ఖరీదైన బంగారం చీరను ఓ మోడల్‌కు కట్టాను. చీర అంచు అంతా కాసులతో, నెమలి డిజైన్‌లో ఉంది. ఇవన్నీ కెమెరాకు కనిపించేలా చీరను తీర్చిదిద్దడం తృప్తిగా అనిపించింది. రెమో చిత్రంలో అమ్మాయిగా నటించిన శివ కార్తికేయన్‌కు చీర కట్టడానికి ప్రముఖ డిజైనర్‌ అనూ పార్థసారథి నన్నే ఎంచుకున్నారు. నయన తార, అనుష్క, పూజాహెగ్దే, నిత్యా మేనన్‌లాంటి చాలా మందికి కుటుంబ సభ్యురాలిగా మారిపోయా.

రవివర్మ నాయికలకు...

రవివర్మ చిత్రలేఖనాల్లోని నాయికల థీమ్‌తో సుహాసిని మణిరత్నం ఓ క్యాలెండర్‌ను రూపొందించారు. అందులో ఖుష్బూ, శృతి హాసన్‌, రమ్యకృష్ణ వంటి వారికి నేనే చీరకట్టా. నా కెరీర్‌లో అద్భుతమైన అనుభవమిది. ఆ చిత్రలేఖనాల ఫొటోలిచ్చి, అందులో ఉన్నట్లుగా కట్టాలన్నారు. క్యాలెండర్‌ పూర్తయ్యాక అందరూ అభినందిస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి.

హీరోయిన్లు వందలు...

హేమమాలిని నుంచి అనుపమా పరమేశ్వరన్‌ వరకూ వందల మంది హీరోయిన్లకు, వేల మంది మోడల్స్‌కు చీర కట్టా. నిమిషాల్లో షూటింగ్‌కు సిద్ధం చేయగలిగే సామర్థ్యం నన్ను చాలా మంది హీరోయిన్స్‌కు ఆప్తురాలిగా మార్చింది. దుబాయి, సింగపూర్‌, మలేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకూ వెళ్లి పని చేశా. ఇద్దరు పిల్లలనూ చదివించి, పెళ్లిళ్లు చేశా. వీరిద్దరూ నా రంగంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పని చేస్తే, ఎన్ని కష్టాలెదురైనా సాధించగలం అనేదానికి నేనే సాక్ష్యం.


మంచిమాట

మహిళలు వృత్తి వ్యాపారాల్ని మొదట్లోనో లేదా మధ్యలోనో వదిలిపెట్టేసే పరిస్థితిని సృష్టిస్తారు కొందరు. కానీ అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే వాళ్లెన్నో అద్భుతాలు సాధించి చూపిస్తారు.

- సైరీ చహల్‌ ఫౌండర్‌, సీఈవో, షీరోస్‌ (విమెన్‌ ఓన్లీ సోషల్‌ ప్లాట్‌ఫాం)


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్