Cannes 2023: విదేశీ అందాలకు అలా హంగులద్దారు!
కేన్స్.. పేరుకు చిత్రోత్సవమే అయినా ఫ్యాషన్ పరేడ్‌ను తలపిస్తుందీ వేడుక. దేశవిదేశాలకు చెందిన సెలబ్రిటీలు విభిన్న ఫ్యాషనబుల్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై హొయలుపోతుంటారు. అయితే ఈ వేడుక కోసం మన అందాల తారలు విదేశీ ఫ్యాషన్ డిజైనర్లను ఎంచుకోవడం, తమకు నచ్చిన స్టైల్స్‌లో దుస్తుల్ని డిజైన్ చేయించుకోవడం....
కేన్స్.. పేరుకు చిత్రోత్సవమే అయినా ఫ్యాషన్ పరేడ్‌ను తలపిస్తుందీ వేడుక. దేశవిదేశాలకు చెందిన సెలబ్రిటీలు విభిన్న ఫ్యాషనబుల్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై హొయలుపోతుంటారు. అయితే ఈ వేడుక కోసం మన అందాల తారలు విదేశీ ఫ్యాషన్ డిజైనర్లను ఎంచుకోవడం, తమకు నచ్చిన స్టైల్స్‌లో దుస్తుల్ని డిజైన్ చేయించుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఇతర దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు మన దేశానికి చెందిన డిజైనర్లతో దుస్తులు రూపొందించుకోవడం అరుదనే చెప్పాలి. అలా ఈసారి మన దేశానికి చెందిన ముగ్గురు మహిళా ఫ్యాషనర్లు విదేశీ అందాలకు తమ ఫ్యాషన్ సొగసులద్దారు. తద్వారా కేన్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై తమ ఫ్యాషన్ పరిమళాలు పూయించారు. ఇంతకీ ఎవరా ముగ్గురు డిజైనర్లు? ఎవరెవరికి దుస్తులు రూపొందించారు? తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి!
సరికొత్త టెక్నిక్ తో..
గౌన్లు పాత ఫ్యాషనే అయినా.. ఫ్యాషన్ ప్రియుల అభిరుచుల్ని బట్టి విభిన్న స్టైల్స్‌లో అవి రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి సరికొత్త ‘సిగ్నేచర్ కార్డింగ్ టెక్నిక్’తో గౌన్లు/ఇతర దుస్తులు రూపొందిస్తూ తనదైన ముద్ర వేశారు ముంబయి ఫ్యాషన్ డిజైనర్ వైశాలీ షడంగులే. ప్యారిస్, మిలాన్.. వంటి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్స్‌లో తన దుస్తుల్ని ప్రదర్శించే అరుదైన అవకాశం అందుకున్న తొలి భారతీయ మహిళా ఫ్యాషనర్‌గా ఖ్యాతి గాంచిన ఆమె.. తాజాగా ముగిసిన కేన్స్ చిత్రోత్సవంలోనూ తన ఫ్యాషన్ ప్రతిభను చాటుకున్నారు. యూకేకు చెందిన మోడల్ లేడీ విక్టోరియా హెర్వేకు ఈ సరికొత్త టెక్నిక్‌తోనే డ్రేప్ గౌన్‌ను డిజైన్ చేసి అందించారామె. తెలుపు రంగులో రూపొందించిన ఈ గౌన్‌పై వింటేజ్ దారాలను ఉపయోగించి కార్డింగ్ టెక్నిక్‌తో హంగులద్దారు. రెగ్యులర్ గౌన్లతో పోల్చితే.. ఇది విభిన్నంగా ఉండడంతో.. ఎంతోమందిని ఆకర్షించిందీ అవుట్‌ఫిట్. ఇక ఈ గౌన్‌లో హెర్వే రెడ్ కార్పెట్‌పై హొయలుపోవడంతో ఆ లుక్స్‌ని ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు.
ఆంక్షల్ని దాటుకొని.. డిజైనర్‌గా!
మధ్యప్రదేశ్‌లోని విదిశాలో పుట్టిపెరిగిన వైశాలికి చిన్నతనం నుంచి ఫ్యాషన్ డిజైనర్ కావాలని కోరిక. కానీ ఆడపిల్లలపై ఆంక్షలున్న సమాజంలో పుట్టి పెరిగిన ఆమె వీటికి తలొగ్గాలనుకోలేదు. అందుకే 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి ముంబయి చేరుకుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేసింది. అయితే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలంటే బోలెడంత డబ్బు ఖర్చవుతుంది. కానీ వాటిని భరించే స్థోమత లేక కోర్సుకు సంబంధించిన పుస్తకాలు తెప్పించుకొని చదువుకుంది. ఓవైపు జిమ్ ట్రైనర్‌గా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు డిజైనింగ్ పోర్ట్‌ఫోలియోలు తయారుచేసుకునేది. కొన్నాళ్లకు బ్యాంకు నుంచి రుణం తీసుకొని ‘వైశాలి ఎస్’ పేరుతో ఓ బొతిక్ ప్రారంభించిన ఆమె.. తన ప్రతిభతో దేశంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా పేరు సంపాదించింది. దుస్తుల తయారీలో ఎక్కువగా నేత వస్త్రాలను ఉపయోగించడం, వాటిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై స్టైలిష్‌గా ప్రదర్శించడం ఆమె ప్రత్యేకత! ప్రదీప్ షడంగులేని పెళ్లి చేసుకున్న వైశాలికి ఒక పాప ఉంది.
తల్లీకూతుళ్లిద్దరూ.. డిజైనర్లే!
తల్లిదండ్రుల స్ఫూర్తితో పిల్లలు అదే రంగంలోకి రావడం మనం చూస్తుంటాం. అలా మేటి ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు పొందిన తన తల్లి స్ఫూర్తితో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిందో కూతురు. ప్రస్తుతం ఈ తల్లీకూతుళ్లిద్దరూ దేశంలోనే పేరు మోసిన ఫ్యాషన్ డిజైనర్ల ద్వయంగా ఖ్యాతి గడించారు. వారే దిల్లీకి చెందిన రేణు టాండన్, నిఖితా టాండన్. 1999లో ‘మైనాస్ రేణు టాండన్’ పేరుతో ఓ ఫ్యాషన్ లేబుల్‌ను ప్రారంభించారు రేణు. ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్లు, యువత అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ఫ్యాషనబుల్ దుస్తుల్ని రూపొందిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు రేణు. ఇక 2019లో తన తల్లి వ్యాపారంలోకి అడుగుపెట్టింది నిఖిత. అప్పట్నుంచి ‘నిఖిత-మైనా డిజైన్స్’గా ఈ సంస్థ ఫ్యాషన్ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఆయా సందర్భాలకు అనుగుణంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అంతర్జాతీయ తారలకూ విభిన్న దుస్తులు రూపొందిస్తుంటుందీ మామ్-డాటర్ ద్వయం. అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయ వేదికల పైనా భారతీయ సంప్రదాయానికి మోడ్రన్ టచ్ ఇస్తూ.. తమదైన ప్రత్యేకతను చాటుకున్నారీ తల్లీకూతుళ్లు. ప్రస్తుతం భారతీయ స్టైల్స్ దగ్గర్నుంచి వెస్ట్రన్ స్టైల్స్ దాకా విభిన్న దుస్తుల్ని రూపొందించడంతో పాటు బ్రైడల్ అవుట్‌ఫిట్స్‌తోనూ ఎంతోమంది ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకుంటున్నారీ మామ్-డాటర్.
రెడ్ కార్పెట్ పైనా..!
అయితే తాజాగా ముగిసిన కేన్స్ చిత్రోత్సవం కోసం.. ఇద్దరు విదేశీ తారలకు విభిన్న దుస్తులు రూపొందించి మరోసారి తమ ఫ్యాషన్ పరిమళాల్ని హద్దులు దాటించారు రేణు-నిఖిత. ఇందులో భాగంగా.. రేణు అమెరికన్ నటి జిటా వాస్ కోసం లావెండర్ రంగు హాల్డర్ నెక్ కోచర్ గౌన్‌ను రూపొందించింది. దీనికి కింది భాగంలో అలల రూపంలో గుబురుగా చేసిన డిజైన్ గౌన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఇక ఫ్రెంచ్ మోడల్, ‘మిస్ యూరప్ - 2020’ కిరీటం నెగ్గిన గ్యాబీ గుహ కోసం నిఖిత ఓ స్టైలిష్ గౌన్‌ను రూపొందించింది. ఆరెంజ్ కలర్ థై-హై స్లిట్ తరహాలో డిజైన్ చేసిన ఈ గౌన్‌కు వెనుక భాగంలో 10 మీటర్ల పొడవాటి సీక్విన్ నెట్ ట్రెయిన్‌ను జత చేశారు. ఇది డ్రస్‌కు హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.