Yoga Day : ఆ కట్టుబాట్లను దాటి సెలబ్రిటీ యోగా ట్రైనర్‌గా ఎదిగింది!

‘ఆడపిల్లవు.. ఒంటరిగా గడప దాటకు!’ అన్నారు ఇంట్లో వాళ్లు. కానీ ‘మెడిసిన్‌ చదవాలి.. ప్రజలకు సేవ చేయాలి..’ అనేది తన ఆశయం. అయితే తనది ఆధ్యాత్మిక కుటుంబం కావడంతో అనుకోకుండా ఓ యోగా విశ్వవిద్యాలయంలో చేరాల్సి వచ్చిందామె. అప్పటికీ యోగాపై......

Published : 21 Jun 2022 15:19 IST

(Photos: Instagram)

‘ఆడపిల్లవు.. ఒంటరిగా గడప దాటకు!’ అన్నారు ఇంట్లో వాళ్లు. కానీ ‘మెడిసిన్‌ చదవాలి.. ప్రజలకు సేవ చేయాలి..’ అనేది తన ఆశయం. అయితే తనది ఆధ్యాత్మిక కుటుంబం కావడంతో అనుకోకుండా ఓ యోగా విశ్వవిద్యాలయంలో చేరాల్సి వచ్చిందామె. అప్పటికీ యోగాపై ఆసక్తి, అవగాహన లేకపోయినా.. క్రమక్రమంగా ఇదే తన జీవితంలో అంతర్భాగమైంది. కట్‌చేస్తే.. ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలెందరికో యోగా పాఠాలు నేర్పుతోంది. మరోవైపు.. అంతర్జాతీయంగానూ ఔత్సాహికులకు ఆన్‌లైన్‌లో యోగా తరగతులు నిర్వహిస్తోంది. ఆమే.. సెలబ్రిటీ యోగా ట్రైనర్‌ స్నేహా శర్మ. డాక్టర్‌ కాకపోతేనేం.. యోగాతో ఎంతోమంది ఆరోగ్యానికి బాటలు వేసే మంచి అవకాశం దొరికిందంటోన్న ఈ యోగిని సక్సెస్‌ఫుల్‌ జర్నీ గురించి ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా మీకోసం..!

వారణాసికి చెందిన ఓ ఆధ్యాత్మిక కుటుంబంలో పుట్టి పెరిగింది స్నేహా శర్మ. సంప్రదాయ కుటుంబం కావడంతో స్నేహకు, వాళ్ల అక్కకు ఇంట్లో కొన్ని కట్టుబాట్లు ఉండేవి. ఒంటరిగా ఆడపిల్లలు బయటికి వెళ్లకూడదని, బయట తిరగకుండా ఇంటి పట్టునే ఉండాలని ఇంట్లో వాళ్లు నియమం పెట్టేవారు. ఇలాంటి కట్టుబాట్లున్నా స్నేహకు మాత్రం చిన్నతనం నుంచీ మెడిసిన్‌ చదవాలని కోరిక. ఈ క్రమంలోనే 12వ తరగతి పూర్తి చేసిన ఆమె.. పలు కారణాల రీత్యా ‘దేవ్‌ సంస్కృతీ విశ్వవిద్యాలయం’లో చేరాల్సి వచ్చింది.

అలా యోగాపై ఇష్టం పెరిగింది!

అయితే అక్కడ యోగా కోర్సు తప్ప మరో ఆప్షన్‌ లేదు. అలాగని స్నేహకు యోగాపై ఆసక్తి, అవగాహన కూడా తక్కువే! అయినప్పటికీ 2014లో అదే యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసింది. ఆ తర్వాత అక్క సలహా మేరకు యోగా ప్రధాన సబ్జెక్టుగా జర్నలిజంలో పీజీ చదివింది. ఆపై కొన్నాళ్లు ఓ రేడియో ఛానల్‌లో విధులు నిర్వర్తించిన స్నేహకు ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. దాంతో ఆ ఉద్యోగం వదిలేసి బిహార్‌ ఔరంగాబాద్‌లోని ఓ పాఠశాలలో యోగా కోచ్‌గా తన యోగా ప్రయాణాన్ని ప్రారంభించిందామె. ‘నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన ఓ జంట ఇక్కడ ఓ స్కూల్‌ నడిపిస్తున్నారు. అందులోనే యోగా కోచ్‌గా నాకు తొలి అవకాశమొచ్చింది. ఇక్కడ పిల్లలకు యోగా పాఠాలు చెబుతున్న క్రమంలోనే ఈ వ్యాయామంపై క్రమంగా నాకు ఆసక్తి పెరిగింది. అందుకే దీన్నే నా కెరీర్‌గా మలచుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే యోగా నైపుణ్యాలను మరికొంతమందికి పంచాలనుకున్నా..’ అంటూ తన యోగా జర్నీ ఎలా ప్రారంభమైందో చెప్పుకొచ్చింది స్నేహ.

అక్కడే దశ తిరిగింది!

యోగాలో తన కెరీర్‌ను మరింత విస్తరించుకునే క్రమంలో తన ఫ్రెండ్‌ సలహా మేరకు ముంబయిలోని ‘సర్వ యోగా’ స్టూడియోలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుందామె. రాదనుకున్న ఈ ఉద్యోగం అదృష్టవశాత్తూ ఆమె తలుపుతట్టింది. బెంగళూరులో నెల రోజుల ట్రైనింగ్‌ అనంతరం చెన్నై శాఖలో విధుల్లో చేరింది స్నేహ. ఇక్కడే తన దశ తిరిగిందంటోందామె. ‘సుమారు ఏడాదిన్నర కాలం పాటు ఇక్కడ పనిచేశా. యోగా తరగతులు నిర్వహించడంతో పాటు నా యోగా జర్నలిజం నైపుణ్యాలు చాటుకునే అవకాశం ఇక్కడ నాకు దొరికింది. యోగాపై వ్యాసాలు రాయడం, యోగా వీడియోలకు వాయిస్‌ ఓవర్‌ చెప్పడంతో దీనిపై మరింత పట్టు పెరిగింది. మరోవైపు నేను నేర్పించే యోగా నైపుణ్యాలు ఎంతోమందిలో సానుకూల మార్పులు తీసుకురావడంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. ఇదే ఉత్సాహం నాకు ‘ట్యాలెంట్‌ టైకూన్‌ అవార్డు’ను తెచ్చిపెట్టింది. ఆపై ముంబయిలోని మలైకా అరోరా యోగా స్టూడియో ‘దివా యోగా’లో పనిచేసే అరుదైన అవకాశం నా తలుపు తట్టింది. ముంబయి అంటే నాకు ముందు నుంచీ ఇష్టం.. ఎప్పటికైనా ఈ నగరంలో పనిచేయాలని ఉండేది. అది ఇలా నెరవేరడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి..’ అంటోంది స్నేహ.

సెలబ్రిటీ యోగా ట్రైనర్‌గా..!

ప్రస్తుతం ‘సర్వ యోగా-దివా యోగా’తో మమేకమై పనిచేస్తోన్న స్నేహ.. ఈ క్రమంలో ఎంతోమంది సెలబ్రిటీలకు యోగా పాఠాలు నేర్పుతోంది. తమన్నా, శ్రద్ధా దాస్‌, కిమ్‌ శర్మ, ఇషా రిఖీ, హిమేష్‌ రేషమ్మియా, లియాండర్‌ పేస్‌.. వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు.. సింగపూర్‌, మలేషియా, జర్మనీ, అమెరికాలో నివసించే వారికి కూడా ఆన్‌లైన్‌లో యోగా తరగతులు నిర్వహిస్తోందామె. సుమారు ఏడేళ్లకు పైగా యోగాలో అనుభవం గడించిన ఆమె.. 20కి పైగా యోగా పద్ధతుల్ని నేర్పించడంలో నిపుణురాలు. సెలబ్రిటీలు, సామాన్యులతో కలుపుకొని వేలాది మందికి పైగా యోగా పాఠాలు నేర్పి.. వారి జీవితాల్ని మార్చేశారామె. మరోవైపు కరోనా సమయంలోనూ ఆన్‌లైన్‌ యోగా తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం యోగా జర్నలిస్ట్‌గా కొనసాగుతూనే.. విభిన్న యోగాసనాలు-వాటి ప్రయోజనాలు, యోగా చిట్కాలు.. వంటివన్నీ వీడియోలుగా రూపొందించి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మరెంతోమందికి చేరువయ్యారీ సెలబ్రిటీ యోగా ట్రైనర్‌.

యోగా.. సర్వరోగ నివారిణి!

ఒకప్పుడు ఆసక్తి లేకపోయినా యోగాలో ఓనమాలు నేర్చుకొని.. సెలబ్రిటీ యోగా ట్రైనర్‌గా మారిన స్నేహ.. ఎన్నో అనారోగ్యాల్ని ఈ వ్యాయామంతో తగ్గించుకోవచ్చని చెబుతోంది. ‘చాలామంది వెన్ను నొప్పి, బీపీ, ఆర్థ్రైటిస్‌.. వంటి సమస్యలతో మా వద్దకొస్తారు. అయితే ఎవరికైనా సరే.. నేను చెప్పేదొకటే! సమస్య వచ్చాక తగ్గించుకోవడం కంటే.. రాకుండా నివారించుకోవడమే ఉత్తమమైన మార్గం. అందుకు యోగా చేయడం తప్పనిసరి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఇది మనల్ని మరో మెట్టు ఎక్కిస్తుంది. ఇలా పాజిటివిటీని సొంతం చేసుకున్న వారు.. తమ చుట్టూ ఉన్న వారిని కూడా ఈ దిశగా ప్రభావితం చేయగలరు..’ అంటూ తన మాటలతోనూ ఎంతోమందిలో స్ఫూర్తి రగిలిస్తోందీ యోగిని.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్