Updated : 02/11/2021 12:51 IST

ప్లస్ సైజ్ అయితే ఏంటి.. నేను హ్యాపీగానే ఉన్నా!

(Photo: Instagram)

కాస్త లావుగా ఉన్న వారు... అందులోనూ అమ్మాయిలను చూడగానే చాలామంది నవ్వుతుంటారు. వివిధ రకాల పేర్లతో పిలుస్తూ హేళన చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఏదో సరదాకి ఫొటో షేర్‌ చేసినా రకరకాల కామెంట్లు పెడుతూ వేధిస్తుంటారు కొంతమంది నెటిజన్లు. ఫలితంగా లావుగా ఉన్న అమ్మాయిలు తమపై తాము నమ్మకాన్ని కోల్పోతుంటారు. ఆత్మన్యూనతతో కుంగిపోతుంటారు. అయితే తాను మాత్రం అలా బాధపడనంటోంది ముంబయికి చెందిన తన్వి గీతా రవి శంకర్.

పండగలా సెలబ్రేట్‌ చేసుకోండి!

చూడడానికి భారీకాయంతో కనిపించే ఈమె తనకు నచ్చిన దుస్తులే వేసుకుంటానంటోంది. తనకు ఇష్టమైన ఫ్యాషన్‌నే ఎంజాయ్ చేస్తానంటోంది. అదేవిధంగా ప్లస్‌ సైజ్‌ గురించి చింతించాల్సిన అవసరం లేదని... ఒబేసిటీని పండగలా సెలబ్రేట్‌ చేసుకోవాలని తనలాంటి వారిలో స్ఫూర్తి నింపుతోంది.

ప్లస్‌ సైజ్‌ మోడల్‌గా!

బొద్దుగా ఉన్న గీత ప్లస్‌ సైజ్‌ మోడల్‌గా, డ్యాన్సర్‌గా, సోషల్‌ మీడియా ఇన్ఫ్లు యెన్సర్‌గా రాణిస్తోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటోంది. లావుగా ఉన్న తన శరీరాన్ని దాచుకోవడానికి సిగ్గుపడడం లేదంటూ తన ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేస్తోంది.

‘సాధారణంగా నాలాగా లావుగా ఉన్న వారికి రెండు సార్లు నామకరణం జరుగుతుంది. మనం పుట్టగానే పేరెంట్స్ పేరు పెడితే... ఆ తర్వాత మనం పెరిగే క్రమంలో, మన శరీరాకృతిని చూసి సమాజం రకరకాల పేర్లు పెడుతుంది..!’

లావుగా ఉన్నా బద్ధకస్తురాలిని మాత్రం కాదు!

‘జీరో సైజ్‌ ఫిగర్‌నే అసలైన అందంగా భావించే ముంబయి నగరంలోనే నేను పుట్టి పెరిగాను. అయితే నా శరీరం మాత్రం అందులో ఇమడలేకపోయింది. నా శరీరాకృతిని చూసి సమాజం హేళన చేసినా, అవమానించినా నేను సానుకూలంగానే తీసుకున్నాను. ఇప్పుడే కాదు.. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. నేను పుట్టినప్పుడు మా బంధువులందరూ నన్ను ముద్దుగా చూసుకునేవారట. తమ చేతుల్లోకి తీసుకుని ఎంతో గారాబం చేసేవారట. నేను లావుగా ఉన్నా బద్ధకస్తురాలిని మాత్రం కాదు. బాల్యంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నాను. స్కూల్లో అందరమ్మాయిల కంటే నేనే బాగా డ్యాన్స్‌ చేస్తున్నానని మా టీచర్‌ కూడా మెచ్చుకున్నారు. సినిమాలంటే కూడా చాలా ఆసక్తి. మహిళా ప్రాధాన్య చిత్రాలు  చూస్తూ పెరిగాను. నేను బొద్దుగా ఉండడంతో ఆత్మన్యూనతకు గురి కాకూడదన్న భావనతో అమ్మానాన్నలు నిత్యం నాకు ధైర్యం చెప్పేవారు. అలా వారిచ్చిన నమ్మకంతో పెరిగిన నేను 12 ఏళ్ల నుంచే ఫ్యాషనబుల్గా ఉండడానికి ప్రయత్నించాను. అయితే మార్కెట్లో నా శరీరానికి సరిపోయే దుస్తులు ఎక్కువగా దొరికేవి కావు. అందుకే టైలర్‌ సహాయంతో నాకు నచ్చినట్లు దుస్తులు కుట్టించుకునే దాన్ని.’

ఎక్కడకు వెళ్లినా నెగెటివ్‌ కామెంట్లు తప్పలేదు!

‘మొదట్లో ఇంజినీరింగ్‌ చదవాలనుకుని ఓ కాలేజీలో చేరాను. అయితే డ్యాన్స్‌పై ఆసక్తితో కోర్సు మధ్యలోనే వదిలేసి ముంబయిలోని ఓ డ్యాన్స్‌ అకాడమీలో చేరాను. ఆ తర్వాత ఫ్యాషన్‌ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశాను. స్కూల్‌, కాలేజీ, డ్యాన్స్‌ అకాడమీ...ఇలా ఎక్కడకు వెళ్లినా నెగెటివ్‌ కామెంట్లు తప్పేవి కావు. అయితే నేను మాత్రం ఎప్పుడూ నా శరీరాన్ని చూసి సిగ్గుపడలేదు. ఎందుకంటే లావుగా ఉండడం తప్పు కాదు. ఆ భావనతోనే ఇన్‌స్టాగ్రామ్‌లో చేరాను. చీరలు, జీన్స్, షార్ట్స్‌, బికినీలు..ఇలా అన్ని రకాల దుస్తులు ధరించి ఫొటోలు అప్‌లోడ్చేసేదాన్ని..

బికినీ ఫొటోలు చూసి ఏమన్నారంటే!

‘నేను బికినీ ధరించి దిగిన ఫొటోలను చూసి చాలామంది నన్ను మెచ్చుకున్నారు. ఒక మహిళ ‘నాకు ఫ్యాషనబుల్‌గా ఉండాలని ఆసక్తి ఉంది. కానీ బికినీ వేసుకునే ధైర్యం లేదు. మిమ్మల్ని చూసి 42 ఏళ్ల వయసులో మొదటిసారి బికినీ ధరించాను’ అని మెసేజ్‌ చేసింది. మరొక అమ్మాయి ‘నాకు ఒబేసిటీ సమస్య ఉంది... అందుకే ఇప్పటివరకు జీన్స్‌ ధరించలేదు. కానీ మిమ్మల్ని చూశాక జీన్స్‌ ధరించాలన్న ధైర్యం వచ్చింది’ అని చెప్పుకొచ్చింది. ఇలా నా పోస్టులు చూసి ఎంతోమంది ఆడవారు స్ఫూర్తి పొందుతున్నారు. అందుకు నాకెంతో గర్వంగా, సంతోషంగా ఉంది.. ’

ఆ మాటలు పట్టించుకోవద్దు!

‘సాధారణంగా మనలాంటి వారిని చూసి చాలామంది ‘ఎక్సర్సైజులు, వర్కవుట్లు చేయండి... చిప్స్, కేకుల్లాంటివి ఎక్కువ తినకండి... బరువును తగ్గించుకోండి... లేదంటే ఎవరు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు’ అని ఉచిత సలహాలు ఇస్తుంటారు. దయచేసి ఇలాంటి మాటలు పట్టించుకోకండి. ఒకవేళ విన్నారంటే మాత్రం ఆహారాన్ని కూడా ప్రసాదంలా తీసుకోవాల్సి వస్తుంది. మనసుకు నచ్చింది తినండి. మనసుకు నచ్చిన పనులు చేయండి. మా అమ్మ పూర్వీకులు అందరూ సన్నగా ఉంటే... మా నాన్న వైపు వాళ్లు మాత్రం లావుగా ఉండేవారు. అలా వాళ్ల జాబితాలో నేనూ చేరాను. అంతేకానీ ఏ రోగం వల్లనో, రుగ్మత వల్లనో నేను బరువు పెరగలేదు. కాబట్టి దీని గురించి నేను ఏ మాత్రం చింతించడం లేదు.’

లావుగా ఉంటే ఏంటి?

‘ఒకవేళ మీరు నాలాగా లావుగా ఉంటే అసలు దిగులు పడకండి. ఎందుకంటే లావుగా ఉండడం తప్పేమీ కాదు. అందులోనూ అది శారీరక లోపం ఎంతమాత్రం కాదు.  నాజూగ్గా ఉన్న వారి లాగే మనం కూడా అన్ని పనులూ చేయగలం. లావుగా ఉన్నా హెల్దీగా, యాక్టివ్‌గా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరో ఏదో అన్నారని కుంగుబాటుకు గురికాకండి. ‘ఐ యామ్‌ ఓకే..నేను సాధించగలను’ అనుకుంటూ ధైర్యంగా ముందుకు సాగండి. మీ జీవిత లక్ష్యాలను చేరుకోండి. అప్పుడు మిమ్మల్ని విమర్శించిన సమాజమే మీ విజయాలు, ఉన్నతిని చూసి మెచ్చుకుంటుంది’ అని స్ఫూర్తి పంచుతోంది’ తన్వి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని