87 ఏళ్ల వయసులో మాస్టర్స్ చేసింది!

అరవై సంవత్సరాలు దాటాయంటే చాలామంది మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా తమ శేష జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, శ్రీలంకకు చెందిన ఓ బామ్మ మాత్రం 87 ఏళ్ల వయసులో ఏకంగా మాస్టర్స్‌ డిగ్రీనే పూర్తి చేసింది. అంతేకాదు.. ఆ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేసిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.

Published : 12 Nov 2021 19:55 IST

(Photo: Screengrab)

అరవై సంవత్సరాలు దాటాయంటే చాలామంది మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా తమ శేష జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, శ్రీలంకకు చెందిన ఓ బామ్మ మాత్రం 87 ఏళ్ల వయసులో ఏకంగా మాస్టర్స్‌ డిగ్రీనే పూర్తి చేసింది. అంతేకాదు.. ఆ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేసిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. మరి ఆమె ఎవరో?ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

చదువును నిర్లక్ష్యం చేయలేదు...

శ్రీలంకకు చెందిన వరథా షణ్ముగనాథన్ వెలనాయ్‌ అనే చిన్న గ్రామంలో జన్మించారు. తన ప్రాథమిక విద్యాభ్యాసమంతా స్థానిక పాఠశాలలోనే జరిగింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం భారతదేశానికి వచ్చారు. ఇక్కడ మద్రాసు యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందిన ఆమె తర్వాత తన స్వదేశానికి వెళ్లి ఆంగ్లం, భారత చరిత్రను బోధిస్తూ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. ఆ తర్వాత శ్రీలంకలోని సిలోన్‌ యూనివర్సిటీ నుంచి టీచింగ్ సర్టిఫికెట్ పొందారు.

లండన్‌లో మొదటి మాస్టర్స్..

టీచర్‌గా వరథా కెరీర్‌ అధిక భాగం శ్రీలంకలోనే కొనసాగింది. ఆ తర్వాత ౯౦ దశకంలో లండన్‌ వెళ్లిన ఆమె తన టీచింగ్‌ వృత్తిని కొనసాగిస్తూనే మొదటిసారి మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. అక్కడి లండన్‌ యూనివర్సిటీలో అప్లైడ్ లింగ్విస్టిక్స్ (applied linguistics)లో మాస్టర్స్ చేశారు. ఈ క్రమంలో భాష విషయంలో శ్రీలంకన్‌ తమిళుల అభిప్రాయం ఇంగ్లాండ్‌లో ఎలా ఉంటుంది అనే అంశంపై థీసిస్‌ చేశారు. ఆమెకు నలుగురు పిల్లలు, ఏడుగురు మనవలు మనవరాళ్లు. మొదటి మాస్టర్‌ డిగ్రీ అందుకునే సమయానికి ఆమె వయసు 50 సంవత్సరాలు.

అదే ఉత్సాహంతో..!

ఇంత చేసినా వరథా మదిలో ఏదో ఒక వెలితి ఉండేదట. శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధం తాలూకు సంఘటనలు తనను ఎప్పుడూ వేధిస్తుండేవని అంటారామె. ఈశాన్య శ్రీలంకలో ఉండే తమిళ మిలిటెంట్లు తమకు స్వతంత్ర రాష్ట్రం కావాలని దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఆ దేశ ప్రభుత్వంపై యుద్ధం చేశారు. ఈ పోరులో దాదాపు లక్ష మంది మరణించారు. ఈ మారణకాండను స్వయంగా చూసిన ఆమె.. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని చెబుతారు. ‘నేను శాంతి, న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యానికి విలువిస్తాను. నా దేశ గాథను స్పష్టంగా, గట్టిగా ప్రతి తరానికి చెప్పాలనుకుంటున్నాను. మనందరం శాంతిని కాంక్షించాలి’ అంటారామె. ఈ అభిప్రాయాలే ఆమె మరో మాస్టర్‌ డిగ్రీ చేయడానికి ప్రేరణగా మారాయి.

కెనడాలో రెండో మాస్టర్స్..!

వరథా తన కూతురు సహాయంతో 2004లో కెనడాకి షిఫ్ట్‌ అయ్యారు. ఆమె కూతురు యార్క్‌ యూనివర్సిటీలో ఎంబీయే పట్టా పొందింది. అలా అదే యూనివర్సిటీలో 60 ఏళ్లు దాటిన వయోజనులకు ఉచిత విద్యను అందిస్తున్నారని తెలుసుకున్నారు. ఈ క్రమంలో 2019లో తన 85వ సంవత్సరంలో 4000 మంది విద్యార్థులతో కలిసి మాస్టర్స్‌ డిగ్రీ చదవడం మొదలుపెట్టారు. తనకు పాలిటిక్స్‌పై ఉన్న మక్కువ, తన దేశ గాథను అందరికీ గట్టిగా వినిపించాలనే సంకల్పంతో పొలిటికల్‌ సైన్స్‌ని సబ్జెక్టుగా ఎంచుకున్నారు.

క్యాంపస్‌కు వెళ్లిన ప్రతిసారి తనకు దేవాలయానికి వెళ్లినట్టుగా అనిపించేదని చెబుతారామె. అలా నాలుగు నెలల పాటు సాఫీగా సాగిన తన ప్రయాణం ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృభించడంతో మారిపోయింది. కొడుకు, కోడలు, మనవడు అందరూ ఇంటి దగ్గర ఉండడంతో మొదట చదువుకోవడానికి కొంత ఇబ్బంది ఎదురైందని చెప్పుకొచ్చారామె. అయినా సరే పట్టు వదలకుండా జూమ్ ద్వారా ఆన్‌లైన్ తరగతులకు హాజరై 87 ఏళ్ల వయసులో రెండో మాస్టర్స్‌ డిగ్రీని పొందారు. ఈసారి థీసిస్‌లో భాగంగా ‘శ్రీలంక అంతర్యుద్ధం, శాంతి స్థాపన’ అనే అంశాన్ని ఎంచుకున్నారు. ‘పొలిటికల్‌ సైన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. అందులో మాస్టర్స్‌ చేయడంతో నా చిరకాల స్వప్నం నెరవేరింది’ అంటారామె.

ఇంకా లక్ష్యం నెరవేరలేదు!

87 ఏళ్ల వయసులో మాస్టర్‌ డిగ్రీ చేసిన ఈ బామ్మ ఇంకా తన లక్ష్యం పూర్తిగా నెరవెరలేదంటోంది. ఈ క్రమంలో యుద్ధం తర్వాత శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? శాంతి స్థాపన.. వంటి అంశాలపై ఓ పుస్తకం రాయడమే తన తర్వాతి లక్ష్యం అని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు-  ‘ప్రతిఒక్కరూ జీవితంలో ఒక లక్ష్యం  ఏర్పర్చుకోవాలి. అది మనకు ఇష్టమైంది కావడంతో పాటు ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలి. దానిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలి’ అంటూ యువతకు సందేశాన్నిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్