అందుకే పీహెచ్‌డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!

‘ఓటమే గెలుపుకి నాంది’ అంటుంటారు. ‘ఎన్నిసార్లు విఫలమైనా పట్టుదలతో ప్రయత్నిస్తేనే విజయం సిద్ధిస్తుంది’ అంటోంది కశ్మీర్‌కు చెందిన ఇన్షా రసూల్‌. ఎంత ఉన్నత చదువులు చదివినా వ్యవసాయమే చేయాలని చిన్నతనంలోనే సంకల్పించుకున్న ఆమె.. తన కలను నెరవేర్చుకోవడానికి....

Updated : 07 Jul 2022 09:25 IST

(Photos: Instagram)

‘ఓటమే గెలుపుకి నాంది’ అంటుంటారు. ‘ఎన్నిసార్లు విఫలమైనా పట్టుదలతో ప్రయత్నిస్తేనే విజయం సిద్ధిస్తుంది’ అంటోంది కశ్మీర్‌కు చెందిన ఇన్షా రసూల్‌. ఎంత ఉన్నత చదువులు చదివినా వ్యవసాయమే చేయాలని చిన్నతనంలోనే సంకల్పించుకున్న ఆమె.. తన కలను నెరవేర్చుకోవడానికి విదేశాలను వదిలి స్వదేశానికి చేరుకుంది. పీహెచ్‌డీని మధ్యలోనే వదిలేసి సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతుల్ని అవపోసన పట్టింది. అయినా పంట అంత సులభంగా చేతికి రాలేదు. అలాగని విశ్రమించక చేసిన ప్రయత్నమే తనను ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ ఆంత్రప్రెన్యూర్‌గా ఎదిగేలా చేశాయంటోన్న ఇన్షా వ్యవసాయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం..!

జమ్మూ కశ్మీర్‌లోని బుడ్గామ్‌కు చెందిన ఇన్షా రసూల్‌ది వ్యవసాయాధారిత కుటుంబం. ఆమె పూర్వీకుల దగ్గర్నుంచి ఈ రంగంలోనే స్థిరపడ్డారు. దీంతో ఆమెకూ వ్యవసాయమంటే మక్కువ పెరిగింది. అయితే ఓసారి తన స్కూల్‌ యాక్టివిటీలో భాగంగా స్ట్రాబెర్రీ ఫామ్‌ను సందర్శించింది ఇన్షా. ఆ పచ్చదనానికి ముగ్ధురాలైన ఆమె.. ఎంత ఉన్నత చదువులు చదివినా వ్యవసాయంలోనే స్థిరపడాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది.

చదువును మధ్యలోనే వదిలేసి..!

భర్త ఉద్యోగ రీత్యా దక్షిణ కొరియా వెళ్లిన ఇన్షా.. అక్కడి ఓ యూనివర్సిటీలో మాలిక్యులర్‌ సిగ్నలింగ్ ప్రధాన అంశంగా పీహెచ్‌డీ కోర్సు ఎంచుకుంది. ఖాళీ దొరికినప్పుడల్లా తన భర్తతో కలిసి అక్కడి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించే ఆమెకు.. సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్న కోరిక కలిగింది. ఇందుకు తన భర్త కూడా సరేననడంతో.. తన పీహెచ్‌డీ కోర్సును మధ్యలోనే వదిలేసి కశ్మీర్‌ చేరుకుందామె. తన పూర్వీకుల పంట భూమి 3.5 ఎకరాల్లోనే సాగు చేయడం ప్రారంభించింది. అయినా పంట చేతికి రావడం అంత సులభం కాలేదంటోంది ఇన్షా.

ప్రయత్నాలు విఫలమైనా..!

‘సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్న ఆలోచనతో 2018లో దక్షిణ కొరియా నుంచి ఇండియా చేరుకున్నా. సేంద్రియ వ్యవసాయంపై ఓ చిన్నపాటి అధ్యయనమే చేశా. కానీ పరిశోధన కంటే ప్రయత్నంతోనే ఫలితం ఉంటుందనిపించింది. అందుకే నాకున్న నాలెడ్జ్‌ ప్రకారం ఆయా కాలాల్లో విభిన్న రకాల విత్తనాలు నాటించేదాన్ని. అయితే ఈ క్రమంలో విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఎదురయ్యాయి. ఓసారి నాటిన విత్తనాలు మొలకెత్తక, మరోసారి పంటకు నీళ్లు ఎక్కువై, ఇంకోసారి అన్‌సీజన్‌లో ఆయా విత్తనాలు నాటడం.. ఇలాంటి కారణాల వల్ల ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అయినా వెనక్కి తగ్గాలనుకోలేదు. మా పూర్వీకులు, నిపుణులు, స్థానిక రైతుల దగ్గర్నుంచి పలు మెలకువలు తెలుసుకున్నా. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు..’ అంటూ చెప్పుకొచ్చింది ఇన్షా.

సహజసిద్ధంగా..

వ్యవసాయంలో భాగంగా వివిధ రకాల కాయగూరలు, పండ్లు సాగు చేసే ఇన్షా.. ఇందుకోసం ఎరువులేవీ ఉపయోగించకుండా సహజసిద్ధమైన పద్ధతుల్నే పాటిస్తుంది. అంతేకాదు.. పంట కోసం సంప్రదాయ విత్తనాలనే ఉపయోగిస్తుంది. వీటిని స్థానిక, అంతర్జాతీయ సీడ్‌ బ్యాంక్స్‌ నుంచి కొనుగోలు చేయడానికీ వెనకాడట్లేదు ఇన్షా.

‘వేప నూనె, ఉల్లి, మిర్చి, అల్లం వ్యర్థాలు.. వంటి వాటిని పులియబెట్టి పంట ఎరువులుగా వినియోగిస్తున్నా. నేను పండించే పంట ఉత్పత్తులు ‘హోమ్‌గ్రీన్స్‌’ పేరుతో సోషల్‌ మీడియాలో విక్రయిస్తున్నా. వీటికి తోడు మా వద్ద తయారయ్యే పచ్చళ్లు, శీతలీకరించిన కాయగూరలు, పండ్లు, బీన్స్‌, గింజ ధాన్యాలు, పెంచే అలంకరణ మొక్కలు.. వంటి వాటికి ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఎందుకంటే ఇవైతే ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి..’ అంటోంది ఇన్షా. ప్రస్తుతం తన వ్యాపారంతో లక్షలు ఆర్జిస్తోన్న ఆమె.. తన వ్యవసాయ క్షేత్రాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నానంటోంది. మరోవైపు త్వరలోనే పౌల్ట్రీ బిజినెస్‌ కూడా ప్రారంభించే యోచన చేస్తున్నానంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని