Nykaa: ఆ జాబితాలో బిలియనీర్.. ఫల్గుణీ నాయర్..!
‘మనలోని తపనేంటో తెలుసుకుంటే సరిపోదు.. దాని పైనే ప్రాణం పెట్టాలి.. సవాళ్లకు వెరవకుండా ముందుకు సాగాలి.. అప్పుడే విజయం వరిస్తుంది’ అంటారు ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్. బ్యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. యాభై ఏళ్ల వయసులో తన తపనేంటో తెలుసుకున్నారు. మేకప్‌ను అమితంగా ఇష్టపడే ఆమె.....
(Photos: https://www.nykaa.com/who_are_we)
‘మనలోని తపనేంటో తెలుసుకుంటే సరిపోదు.. దాని పైనే ప్రాణం పెట్టాలి.. సవాళ్లకు వెరవకుండా ముందుకు సాగాలి.. అప్పుడే విజయం వరిస్తుంది’ అంటారు ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్. బ్యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. యాభై ఏళ్ల వయసులో తన తపనేంటో తెలుసుకున్నారు. మేకప్‌ను అమితంగా ఇష్టపడే ఆమె.. అతివలందరూ కోరుకునే అపురూప లావణ్యాన్ని వారి సొంతం చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే నైకా పేరుతో ఆన్‌లైన్‌లో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తన వ్యాపారాన్ని వృద్ధి చేసి అత్యుత్తమ బ్రాండ్‌గా తన కంపెనీని తీర్చిదిద్దారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి Unicorn Status నూ సొంతం చేసుకుందీ సంస్థ. ఇలా అంతకంతకూ తన సంపదను పెంచుకుంటూ పోతోన్న ఆమె.. తాజాగా ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. ‘2022 ఎమ్3ఎమ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ పేరుతో విడుదలైన బిలియనీర్ల జాబితాలో తొలిసారిగా స్థానం సంపాదించుకున్నారు. ఇలా తన వ్యాపార దక్షతతో సంస్థను లాభాల వెంట పరుగులు పెట్టిస్తోన్న ఈ సూపర్ ఉమన్ సక్సెస్ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం..
అది వ్యాపారమైనా, మరేదైనా.. మన మనసుకు నచ్చిన పని ప్రారంభించడానికి వయసు అడ్డు కానే కాదని చెబుతారు బిలియనీర్ ఫల్గుణీ నాయర్. ముంబయిలో పుట్టి పెరిగిన ఆమె.. తన తండ్రిని చూసి వ్యాపారంపై ప్రేమ పెంచుకున్నారు. అంతేకాదు.. అందరమ్మాయిల్లాగే ఆమెకు చిన్నతనం నుంచి అందమంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా మేకప్ వేసుకోవడమంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారామె.
వ్యాపారంపై మక్కువతో..!
ఎప్పటికైనా వ్యాపారం ప్రారంభించాలన్న తపనతోనే తన చదువును కొనసాగించారు నాయర్. ఈ క్రమంలోనే కామర్స్ విభాగంలో డిగ్రీ చేశారు.. ఆపై అహ్మదాబాద్ ఐఐఎం నుంచి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. అక్కడే ఫైనాన్స్‌లో మేజర్ (ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం, ఖాతాదారులకు పెట్టుబడి గురించి సలహాలివ్వడంపై నైపుణ్యాలు సంపాదించడం) పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక కొన్నేళ్ల పాటు A F Ferguson & Co. సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేసిన నాయర్.. ఆ తర్వాత 19 ఏళ్ల పాటు కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో పని చేశారు. ఈ క్రమంలో సంస్థ తరఫున లండన్, న్యూయార్క్‌లలో అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆపై ఇన్‌స్టిట్యూషన్ ఈక్విటీస్ బిజినెస్ హెడ్‌గా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అందుకున్నారు. 2012లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి బయటికొచ్చారామె.
తపన తెలుసుకొని..!
ఏ కంపెనీలో ఎంత పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తున్నా.. మన అంతిమ లక్ష్యం అది కానప్పుడు ఎక్కువ కాలం అక్కడ కొనసాగలేం. నాయర్ విషయంలోనూ అదే జరిగింది. కొటక్ గ్రూప్ నుంచి బయటికొచ్చేనాటికి ఆమె వయసు 50 ఏళ్లు. ఆ వయసులో వ్యాపారం చేయాలన్న తన తపనపై దృష్టి పెట్టారామె. అది కూడా తనకెంతో మక్కువైన సౌందర్య ఉత్పత్తులు, మేకప్ సామగ్రి.. వంటి వస్తువుల్ని తన వ్యాపారాంశాలుగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే 2012లో ‘నైకా’ పేరుతో బ్యూటీ బ్రాండ్‌ని ప్రారంభించారు. అది కూడా ‘నైకా.కామ్’ పేరుతో సౌందర్య ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌లో అమ్మేవారామె. ఈ-కామర్స్ వైపు అప్పుడప్పుడే వడివడిగా అడుగులు పడుతోన్న ఆ సమయంలో ఆన్‌లైన్‌లో వస్తువులు అమ్మడమంటే అదో సంచలనమని చెప్పాలి.
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా..!
ముంబయి ప్రధాన కార్యాలయంగా ప్రారంభమైన ఈ కంపెనీ.. ఈ తొమ్మిదేళ్లలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతూ వచ్చింది. మస్కారా దగ్గర్నుంచి మేకప్ రిమూవర్ దాకా, ట్యాటూ మొదలుకొని మెహెందీ దాకా.. అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులకు, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌కి నైకా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని చెప్పాలి. అంతేకాదు.. ఈ వేదికగా ఇతర బ్రాండ్స్ ఉత్పత్తులు కూడా అమ్ముడవుతున్నాయి. ఇక నైకా ఉత్పత్తుల్ని ఇతర ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్‌తో పాటు బయట బ్యూటీ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉంచి అతివలకు వాటిని మరింత చేరువ చేశారు నాయర్. 2015లో సొంత స్టోర్లను తెరిచారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 76కు చేరుకుంది.
ఇక తన వ్యాపార విస్తరణలో భాగంగా 2018లో నైకా ఫ్యాషన్ బ్రాండ్‌ను క్రియేట్ చేశారు నాయర్. ఈ వేదికగా మహిళలు, పిల్లలు, పురుషుల ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్‌ని అమ్మడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నైకా బ్రాండ్ కేవలం సామాన్యుల వరకే పరిమితం కాలేదు.. కరీనా కపూర్, ఆలియా భట్, జాన్వీ కపూర్.. వంటి అగ్ర తారామణులు నైకా బ్యూటీ, ఫ్యాషన్ ఉత్పత్తుల కోసం క్యూ కడుతున్నారనడంలో సందేహం లేదు. ఇక రెండేళ్ల క్రితం ‘కే’ పేరుతో సౌందర్య ఉత్పత్తుల సంస్థను ప్రారంభించిన బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.. ఈ క్రమంలో నైకాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.
లాక్‌డౌన్‌లోనూ లాభాల బాట!
కరోనా రాకతో చాలా వరకు వ్యాపారాలు దెబ్బతినడం, ఆర్థిక సంక్షోభం తలెత్తడం మనం చూశాం. అయితే లాక్‌డౌన్ సమయంలో కొన్ని ఆఫ్‌లైన్ వ్యాపారాలు పూర్తిగా మూతపడినా.. కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో సేవలందించాయి. ఇలాంటి ప్రతికూల సమయంలో తన వ్యాపారాన్ని మరింత మెరుగుపరచుకునేందుకు క్రియేటివ్‌గా ఆలోచించారు నాయర్. బ్యూటీ ఉత్పత్తులతో పాటు తన సొంత లేబుల్‌తో హ్యాండ్ శానిటైజర్స్, మాస్కులు, హ్యాండ్‌వాష్, పీపీఈ, థర్మామీటర్లు.. వంటి ఉత్పత్తుల్ని ఆన్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంచారు. దీంతో సంక్షోభ సమయంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం నైకా లాభాలు అమాంతం పెరిగాయి. సుమారు 38 శాతం వృద్ధితో దాదాపు 2400 కోట్లకు పైగా ఆర్జనతో Unicorn Status (వెంచర్ క్యాపిటల్ ఇండస్ట్రీలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ) ను దక్కించుకుందీ సంస్థ. అంతేకాదు.. మహిళలు ముందుండి నడిపిస్తోన్న తొలి Unicorn Status సంస్థ కూడా నైకానే కావడం విశేషం! ఇలా ఈ క్రెడిటంతా తన ఉద్యోగులదే అంటారామె.
‘మా ఉద్యోగులే మా ఫ్రంట్‌లైన్ వారియర్స్.. లాక్‌డౌన్ సమయంలోనూ వారు ఎంతో నిబద్ధతతో పనిచేశారు.. అందుకే సంక్షోభ సమయంలోనూ సంస్థ లాభాల బాట పట్టింది..’ అంటూ తన నిరాడంబరతను చాటుకున్నారు నాయర్.
స్వయంశక్తితో ‘శ్రీమంతురాలిగా’..!
ఇక గతేడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 మధ్య మూడు రోజుల పాటు జరిగిన నైకా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లను సమీకరించింది. దీంతో నైకా మార్కెట్ విలువ రూ. లక్ష కోట్లు దాటేసింది. మరోవైపు.. ఎఫ్‌ఎస్‌ఎన్ ఇ-కామర్స్ వెంచర్స్‌లో ఫల్గుణి నాయర్, ఆమె కుటుంబానికి కలిపి 54.22 శాతం (2.53 కోట్ల) షేర్లున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ షేర్లు 82 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. దీంతో గతేడాది 7.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 56,000 కోట్ల) సంపద కలిగిన ఆమె ఆస్తుల విలువ ఇప్పుడు 7.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 57,629 కోట్ల)కు చేరుకుందని తాజాగా విడుదల చేసిన ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ ప్రకటించింది. ఫలితంగా తొలిసారి ఈ బిలియనీర్ల జాబితాలోకి అడుగుపెట్టారు ఫల్గుణీ. అంతేకాదు.. తొలిసారి ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న వారిలో టాప్-10లో ఆమె స్థానం సంపాదించడం విశేషం. ఇలా స్వీయ శక్తిసామర్థ్యాలతో ఎదిగిన సంపన్న మహిళల్లో ఫల్గుణీది అగ్రస్థానం అని చెప్పచ్చు.
పవర్‌ఫుల్ ఉమన్‌గా..!
బ్యాంకులో ఉద్యోగం చేసే సమయంలోనే (1987లో) ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ నాయర్‌ను వివాహమాడారు ఫల్గుణీ. ఈ జంటకు ఇద్దరు సంతానం. ప్రస్తుతం వీళ్లు కూడా నైకా వ్యాపారంలోనే భాగస్వాములయ్యారు. ఈ తొమ్మిదేళ్లలో తాను ప్రదర్శించిన వ్యాపార దక్షతకు గుర్తుగా ఫోర్బ్స్ ఏషియా, ఫార్చ్యూన్.. వంటి పత్రికలు విడుదల చేసిన ‘అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో చోటు దక్కించుకున్నారీ గ్రేట్ బిజినెస్ ఉమన్. 2019లో ‘వోగ్ విమెన్ ఆఫ్ ది ఇయర్’గానూ నిలిచారు. ‘తపన, అందుకు తగ్గ ప్రయత్నం ఉంటే.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోగలం..’ అంటూ తన వ్యాపార సూత్రంతో నేటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు నాయర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.