పిల్లలు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారా?

మారుతున్న రోజులతో పాటు పిల్లల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ప్రత్యేకించి చెయ్యొద్దన్న పనులే చేయడం, దాచాలనుకున్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం టీనేజ్ పిల్లల నైజం. ఇలాంటి సందర్భాల్లో వద్దన్నకొద్దీ ఎందుకు వద్దన్నామో తెలుసుకోవాలనే ఆతృత వారిలో మరింత ఎక్కువవుతుంది. ప్రత్యేకించి టీనేజ్‌లోకి అడుగుపెట్టే పిల్లలకు ప్రేమ, సెక్స్ మొదలైన అంశాలపై రకరకాల సందేహాలు, అనుమానాలు ఉండడం సహజం.

Updated : 29 Feb 2024 17:00 IST

మారుతున్న రోజులతో పాటు పిల్లల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ప్రత్యేకించి చెయ్యొద్దన్న పనులే చేయడం, దాచాలనుకున్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం టీనేజ్ పిల్లల నైజం. ఇలాంటి సందర్భాల్లో వద్దన్నకొద్దీ ఎందుకు వద్దన్నామో తెలుసుకోవాలనే ఆతృత వారిలో మరింత ఎక్కువవుతుంది. ప్రత్యేకించి టీనేజ్‌లోకి అడుగుపెట్టే పిల్లలకు ప్రేమ, సెక్స్ మొదలైన అంశాలపై రకరకాల సందేహాలు, అనుమానాలు ఉండడం సహజం. తమ సందేహాలను తీర్చుకోవడానికి వాళ్లు ఇంటర్‌నెట్, సోషల్ మీడియాల పైన ఆధారపడుతున్నారు. ఈ రెండూ వారిని కొంతవరకు పక్కదోవ పట్టిస్తున్నాయి. అశ్లీల వెబ్‌సైట్లు చూసి ప్రభావితమయ్యే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లలు చెడు విషయాల పట్ల ఆసక్తి చూపించకుండా ఉండాలంటే టీనేజ్‌లో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..

* పిల్లల వయసు బట్టి తల్లిదండ్రులు వాళ్లతో ప్రవర్తించడాన్ని అలవాటు చేసుకోవాలి.

* పిల్లలతో చాలా స్నేహంగా మెలగండి. వాళ్లు మీతో అన్ని విషయాలూ పంచుకునేలా ఉండాలి. వాళ్ల సందేహాలు, ఇబ్బందులు మీ దగ్గర ప్రస్తావించే స్వేచ్ఛ మీరు కల్పించాలి.

* పిల్లల ముందు జీవిత భాగస్వామి పట్ల కూడా హుందాగా ప్రవర్తించాలి.

* ఇతరులకు సంబంధించి మంచి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇబ్బందికరమైన ప్రవర్తన ఎలా ఉంటుందో వారికి విడమర్చి చెప్పాలి. ఎవరైనా వాళ్లతో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే ఏం చేయాలో ఉదాహరణల ద్వారా తెలియజేయండి. మంచి, చెడు తేడాలు గ్రహించగలిగేలా చిన్నప్పటి నుంచే వారికి అవగాహన కల్పించాలి.

* బయటకు వెళ్లినప్పుడు ఎలా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. సమాజం, బయట జరిగే సంఘటనలపై ఎప్పటికప్పుడు పిల్లల్లో అవగాహన కల్పించండి.

* వాళ్ల కంటే కాస్త పెద్దవాళ్లు, సన్నిహితులతో వాళ్లకుండే సందేహాల గురించి చర్చించనీయండి. ప్రతిదీ తప్పుపట్టి ఇబ్బంది పెట్టకండి. వాళ్లు తల్లిదండ్రులతో చెప్పలేనివి కూడా అక్క లేదా అన్నయ్య వంటి వాళ్లతో చెప్పగలుగుతారు.

* టీనేజ్ పిల్లలకు లైంగిక అంశాల గురించి కనీస అవగాహన కల్పించాలి. పరిధి దాటకుండా వాళ్ల వద్ద కొన్ని విషయాలు చర్చించవచ్చు. వారికి కలిగే సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించండి.

* పిల్లలను అశ్లీల సినిమాలు, వీడియోల నుంచి దూరంగా ఉంచండి. వాటిని చూడడం వల్ల వచ్చే నష్టాలేమిటో అర్థమయ్యే రీతిలో వివరించండి.

* ఆయా అంశాలపై సరైన అవగాహన కలిగి ఉండడంతో పాటు, తల్లిదండ్రులు అండగా ఉన్నారన్న విశ్వాసమే వాళ్లను ఎలాంటి తప్పు చేయకుండా, ప్రమాదానికి గురి కాకుండా కాపాడుతుంది. కాబట్టి పిల్లలతో ప్రేమగా ఉంటూనే ఏది ఎందుకు మంచిదో, ఏది ఎందుకు చెడ్డదో సరైన అవగాహన కల్పించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్