మచ్చలు, మొటిమలు... సమస్యలు ఎన్నయినా మందు ఇదే!

ఎన్నిసార్లు కడిగినా మీ చర్మం కాసేపటి తర్వాత మళ్లీ జిడ్డుగా మారుతోందా?? చర్మంపై పడిన దుమ్ము, ధూళి వల్ల రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతున్నాయా?? ముఖంపై బ్లాక్‌హెడ్స్ బాధపెడుతున్నాయా?? ట్యాన్ వల్ల చర్మం అందవికారంగా కనిపిస్తోందా?? ఏంటి ఇన్ని....

Published : 13 Jun 2022 21:11 IST

ఎన్నిసార్లు కడిగినా మీ చర్మం కాసేపటి తర్వాత మళ్లీ జిడ్డుగా మారుతోందా?? చర్మంపై పడిన దుమ్ము, ధూళి వల్ల రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతున్నాయా?? ముఖంపై బ్లాక్‌హెడ్స్ బాధపెడుతున్నాయా?? ట్యాన్ వల్ల చర్మం అందవికారంగా కనిపిస్తోందా?? ఏంటి ఇన్ని సమస్యలా.. అని ఆశ్చర్యపోతున్నారా?? సమస్యలెన్నయినా కానీయండి.. మందు మాత్రం ఒక్కటే.. అదే 'టమాటా'! నిజమే... మన రిఫ్రిజిరేటర్లో అనునిత్యం దర్శనమిచ్చే సహజసిద్ధమైన టమాటాల వల్ల అనేక రకాల చర్మ సమస్యల్ని నివారించుకోవచ్చు తెలుసా! మరి ఆ పద్ధతులేంటో మనమూ తెలుసుకుందాం రండి...

ముఖంపై గుంతలా??

కొంతమందికి ముఖంపై చాలా సన్నటి రంథ్రాల మాదిరిగా ఏర్పడుతుంటాయి. వీటిలో దుమ్ము, ధూళి చేరి మరిన్ని ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. కాబట్టి ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే.. ఒక చెంచా టమాటా రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకొని.. అందులో దూదిని ముంచి ముఖానికి అప్త్లె చేసుకొని కాసేపు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఓ పదిహేను నిమిషాల పాటు ఉంచుకొని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల కేవలం దుమ్ము, ధూళి తొలగిపోవడమే కాదు.. క్రమక్రమంగా రంథ్రాలు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుంది.

మొటిమల సమస్యకు చెక్!

ఇది చాలామందిని వేధించే సమస్య. దీన్ని నివారించడానికి అవసరమయ్యే సహజసిద్ధమైన ఆమ్లాలు, విటమిన్లు టమాటాల్లో ఉన్నాయి. ఒక టమాటా నుంచి రసాన్ని తీసి దాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీలైతే ఇలా రోజూ చేయడం వల్ల సమస్య క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

ట్యాన్‌కు టాటా..

ఎండ పడిన చర్మ భాగాల్లో నల్లగా మారిపోతుంటుంది. మరి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. ట్యాన్‌కు గురైన చర్మ భాగాల్లో టమాటా ముక్కతో కాసేపు రుద్దుకోవాలి. తర్వాత కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. లేదంటే.. టమాటా రసంలో కొద్ది మోతాదుల్లో శెనగపిండి, నిమ్మరసం, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశాల్లో రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

మెరుపు కోసం..

చర్మం తళతళా మెరిసిపోవాలని ఎవరికుండదు చెప్పండి?? దీనికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల క్రీములు తెచ్చుకొని వాడతారు చాలామంది. కొందరిపై ఇవి దుష్ప్రభావాలను చూపుతాయి. కాబట్టి ఇంట్లో లభించే తేనె, టమాటా రసంతో ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. అదెలాగంటే.. కాస్త టమాటా రసంలో కొంచెం తేనె వేసి గట్టి పేస్ట్‌లా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మృదువైన, కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.

జిడ్డు చర్మానికి..

కడుక్కున్న కాసేపటి తర్వాత మళ్లీ మీ ముఖం జిడ్డుగా తయారవుతోందా?? అయితే ఇలా చేయండి. కాస్త టమాటా రసంలో కొంచెం నిమ్మరసం లేదా దోసకాయ రసం కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకుంటే ముఖంపై జిడ్డు తొలగిపోయి.. నీట్‌గా కనిపిస్తుంది.

బ్లాక్‌హెడ్స్ నివారణకు..

చాలామంది ముఖంపై ఏర్పడే బ్లాక్‌హెడ్స్‌ను తొలగించుకోవడానికి బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తుంటారు. ఈ సమస్యను తొలగించుకోవడానికి పార్లర్లలో ఉపయోగించే పద్ధతి కొందరిపై దుష్ప్రభావాన్ని చూపించచ్చు. కాబట్టి ఈ సమస్యను ఇంట్లో లభించే టమాటాలతో సులభంగా తొలగించుకోవచ్చు. అదెలాగంటే.. ఒక టమాటా ముక్కను తీసుకుని బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట కాసేపు రుద్దాలి. ఇలా తరచూ చేయడం వల్ల క్రమంగా ఈ సమస్య నుంచి బయటపడచ్చు.

దురదను తరిమేస్తుంది..

కొంతమందికి చర్మంపై ఎండ పడిన చోట ఎర్రగా మారుతుంది. ఫలితంగా కొన్ని సందర్భాల్లో దురద ఏర్పడి చికాకు తెప్పిస్తుంది. మరి ఈ సమస్యను నివారించుకోవాలంటే.. కొంచెం టమాటా రసంలో రెండు చెంచాల మీగడ లేని పెరుగు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు, పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే క్రమంగా సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

జుట్టుకు కండిషనర్‌గా..

టమాటాలు జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్‌గా పనిచేస్తాయి. టమాటా రసాన్ని జుట్టుకు పట్టించి కాసేపటి తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టుకు మంచి రంగు, మెరుపూ వస్తాయి. అలాగే చుండ్రు సమస్య వేధిస్తోందా?? అయితే డోంట్‌వర్రీ.. టమాటా గుజ్జును మాడుకు పట్టించి.. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్