మీ పిల్లలకు ఈ లైఫ్ స్కిల్స్ నేర్పిస్తున్నారా?

ఇంట్లో ఉన్న చిన్నారుల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతుంటాం.. వారికి ఏ కష్టం కలగకుండా చూసుకుంటాం. ‘ఇంకా చిన్న పిల్లలే కదా.. పెద్దయ్యాక అన్నీ వాళ్లే నేర్చుకుంటారులే’ అనుకుంటాం.. కానీ కొన్ని విషయాల్లో పిల్లల్ని చిన్నవయసు నుంచే సాన పెట్టాలంటున్నారు.....

Published : 05 Sep 2022 20:46 IST

మోహనకు ఏడో తరగతి చదివే అమ్మాయి ఉంది. ఒక్కగానొక్క కూతురని ఏ పనీ చెప్పకుండా అల్లారుముద్దుగా పెంచుతోందామె. దీంతో అమ్మానాన్న తోడు లేనిదే ఎక్కడికీ వెళ్లలేదా చిన్నారి.

భావనకు ఇద్దరు పిల్లలు. వారి పాకెట్‌ మనీ కోసం నెలనెలా వేలకు వేలు డబ్బులిస్తుంటుందామె. దీంతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ధ్యాసే తప్ప.. ఇచ్చిన డబ్బుని ఎలా దాచుకుందామా అన్న ఆలోచన లేదా ఇద్దరు పిల్లలకు!

ఇంట్లో ఉన్న చిన్నారుల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతుంటాం.. వారికి ఏ కష్టం కలగకుండా చూసుకుంటాం. ‘ఇంకా చిన్న పిల్లలే కదా.. పెద్దయ్యాక అన్నీ వాళ్లే నేర్చుకుంటారులే’ అనుకుంటాం.. కానీ కొన్ని విషయాల్లో పిల్లల్ని చిన్నవయసు నుంచే సాన పెట్టాలంటున్నారు నిపుణులు. అప్పుడే కాలంతో పరిగెడుతూ లోకం పోకడ తెలుసుకోగలుగుతారని, లేదంటే మాత్రం వెనకబడిపోయే ప్రమాదం ఉందని, ప్రతి విషయంలోనూ ఇతరులపై ఆధారపడే అవకాశమూ ఉందని చెబుతున్నారు.

‘ఈ పని చెప్తే పిల్లలకు కష్టం కలుగుతుందేమో.. వాళ్లు అలా కష్టపడడం నేను చూడలేను..’ అనుకుంటుంటారు కొంతమంది తల్లులు. నిజానికి అప్పుడు కష్టం అనుకున్న ఆ పని ఎప్పటికీ కష్టంగానే ఉంటుంది. అదే ఒక అడుగు ముందుకేసి వారిని అన్ని విషయాల్లో నిష్ణాతుల్ని చేస్తే ఆ నైపుణ్యాలు వారికి భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడచ్చంటున్నారు నిపుణులు.

వంట చేయగలరా?

కొంతమంది తల్లులు తమ పిల్లల్ని సుకుమారంగా పెంచుతుంటారు.. కనీసం వారిని వంటగదిలోకి రానివ్వకుండా వారికి కావాల్సినవన్నీ రుచికరంగా చేసి అందిస్తుంటారు. ఇలా వాళ్లు మీ దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉంటుంది.. అదే ఏదైనా పని మీద మీరు పిల్లల్ని వదిలేసి ఊరు వెళ్లాల్సి వచ్చినా.. లేదంటే వాళ్లే పైచదువులు/ఉద్యోగాల రీత్యా భవిష్యత్తులో వేరే చోట స్థిరపడాల్సి వచ్చినా.. అసలు ఇబ్బంది అప్పుడు మొదలవుతుంది.

‘ఇన్నాళ్లూ అమ్మ దగ్గర చిన్న చిన్న వంట మెలకువలు నేర్చుకున్నా బాగుండేది’ అని అప్పుడు అనుకుంటే లాభం లేదు. కాబట్టి పిల్లలకు ఓ వయసొచ్చాక కిచెన్‌లో చిన్న చిన్న పనులు నేర్పించాలి. గిన్నెలు తోమడం, సమయం దొరికినప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌/స్నాక్స్‌ ప్రిపేర్‌ చేయమనడం, టీ/కాఫీ తయారీ.. ఇలా ముందు నుంచే వారికి వంటపై ఆసక్తి పెంచితే మీరు దగ్గర లేనప్పుడు ఇతరులపై ఆధారపడకుండా వాళ్లకు వాళ్లే చేసుకోగలుగుతారు. వంట రాకపోతేనేం.. యూట్యూబ్‌ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు.. వీడియో చూసి చేయడానికైనా కనీస మెలకువలు తెలిసి ఉండడం ముఖ్యం కదా! అలాగే ఈ పాకశాస్త్ర నైపుణ్యాలతో ఆసక్తి ఉంటే భవిష్యత్తులో అటు యూట్యూబర్‌గా, ఇటు ఫుడ్‌ బ్లాగర్‌గానూ రాణించచ్చు.

అనవసర ఖర్చులొద్దు!

బయటికి తీసుకెళ్లినప్పుడల్లా పిల్లలు అడిగిందల్లా కొనివ్వడం, ఆన్‌లైన్‌లో చూసిన ప్రతి వస్తువూ కావాలని మారాం చేస్తే.. వాటి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడడం.. చాలామంది తల్లిదండ్రులకు ఉండే అలవాటు! ఇంకొంతమంది పేరెంట్స్‌ అయితే ఓ అడుగు ముందుకేసి తమ పిల్లలకు నెలనెలా పాకెట్‌ మనీ కూడా ఇస్తుంటారు. నిజానికి ఇలా పిల్లలకు డబ్బులివ్వడం తప్పని కాదు.. కానీ ఇలా మీరిచ్చిన డబ్బుతో వారేం చేస్తున్నారు అనే విషయంలో మాత్రం పేరెంట్స్‌ నిఘా పెట్టడం అవసరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాళ్లు ఆ డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టచ్చు. విచ్చలవిడిగా డబ్బులొస్తుంటే బెట్టింగ్స్‌, ఇతర చెడు అలవాట్లకు వాటిని వెచ్చించచ్చు. దీనివల్ల వారికి భవిష్యత్తులో నష్టమే కానీ.. పైసా లాభం ఉండదు. కాబట్టి పిల్లలకు పాకెట్‌ మనీ ఇచ్చే ముందు వారికి డబ్బు విలువ తెలియజేయండి. ఏవి అవసరమైన ఖర్చులు, ఏవి అనవసరమైనవో వారికి వివరంగా చెప్పాలి. నెలనెలా కొంత డబ్బును ఆదా చేయడం వారికి నేర్పాలి. అంతేకాదు.. వారిలో పెయింటింగ్‌/డ్రాయింగ్‌/క్రాఫ్టింగ్‌/కుకింగ్‌.. వంటి మెలకువలేమైనా ఉంటే ఈ దిశగా వారిని ప్రోత్సహిస్తూ.. వారు తయారుచేసిన ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ వేదికగా అమ్ముతూ.. డబ్బు సంపాదించడం ఎలాగో ఇప్పట్నుంచే వారికి నేర్పించచ్చు. తద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి సంక్షోభం తలెత్తినా.. ఏదో ఒక ఉపాధి మార్గం వారికి దొరుకుతుంది. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను సైతం వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.

సమయపాలన ముఖ్యం!

సెలవు దొరికితే చాలు.. ఆలస్యంగా నిద్ర లేవడానికి ప్రాధాన్యమిస్తుంటారు పిల్లలు. ఇక పుస్తకాల నుంచి ఎప్పుడు విరామం దొరుకుతుందా? ఈ ఆన్‌లైన్‌ క్లాసులు ఎప్పుడు అయిపోతాయా? ఎప్పుడెప్పుడు ఆడుకుందామా? అని ఎదురు చూస్తుంటారు. ఇలా వినోదానికి కేటాయించిన సమయం.. చదువు, ఇతర వ్యాపకాలు నేర్చుకోవడంపై పెట్టరనే చెప్పాలి. దీంతో వారిలో ఒక రకమైన బద్ధకం ఆవహిస్తుంది. ఒక్క ఆడుకోవడం తప్ప మరేదీ సమయం ప్రకారం వారు చేయలేరు. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో సమయపాలన (నిర్దేశించుకున్న పనుల్ని వేళకు పూర్తిచేయడం) విషయంలో వెనకబడిపోతారని చెబుతున్నారు నిపుణులు. అందుకే వారికి సంబంధించిన పనులన్నింటినీ ఒక సమయం అంటూ పెట్టుకొని వేళకు పూర్తి చేయమని చెప్పాలి. ఆ ప్రణాళిక వేసుకునే విషయంలో మీరే వారికి చక్కటి మార్గనిర్దేశనం చేయాలి. ఇలా కొన్నాళ్లకు కేటాయించుకున్న సమయాన్ని బట్టి అనుకున్న పనుల్ని పూర్తి చేసే నేర్పు వారికి అలవడుతుంది. ఈ నైపుణ్యాలు భవిష్యత్తులో చదువు, కెరీర్‌, ఇతర విషయాల్లోనూ వారికి ఉపయోగపడతాయి.

అందుకే నలుగురితో మాట్లాడాలి!

కొంతమంది పిల్లలు నలుగురితో కలుపుగోలుగా ఉంటే.. మరికొంతమంది అంత త్వరగా కలిసిపోలేరు.. రిజర్వ్‌డ్‌గా ఉంటారు. దీనికి ఇంటి వాతావరణమే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. అంటే.. ఇంట్లో ఒకే బిడ్డ ఉండడం, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని అతి సుకుమారంగా పెంచుతూ.. నలుగురితో కలవనివ్వకపోవడం, పేరెంట్స్‌ వృత్తి ఉద్యోగాల్లో బిజీగా మారి పిల్లల్ని పట్టించుకోకపోవడం.. వంటి కారణాల వల్ల పిల్లలు సమయం గడపడానికి ఏ మొబైల్‌నో/టీవీనో నేస్తాలుగా ఎంచుకుంటారు. ఇక నిరంతరం వాటితోనే గడుపుతూ ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడరు. ఇలా నలుగురితో వారికి కమ్యూనికేషన్‌ లేకపోవడం వల్ల భవిష్యత్తులో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పలు ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే ఇంట్లో ఒక్కరున్నా/ఇద్దరు పిల్లలున్నా తల్లిదండ్రులే వారికి తొలి నేస్తాలు కావాలంటున్నారు. ఈ క్రమంలో రోజూ కాస్త సమయం కేటాయించి వారితో గడపడం, బయటికెళ్లి తమ ఫ్రెండ్స్‌ని కలుసుకునే వీల్లేని పిల్లలకు ఇంటి నుంచే వారి ఫ్రెండ్స్‌తో వర్చువల్‌గా మాట్లాడే అవకాశం ఇవ్వడం, తమ ప్రియ స్నేహితులతో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకోనివ్వడం.. ఇలాంటివి చేస్తే వారు నలుగురితో సులభంగా కలిసిపోతారు. రేపు ఎక్కడైనా ఉద్యోగమొస్తే బృందంతో కలిసి సునాయాసంగా పనుల్ని పంచుకోగలుగుతారు.. తమ బాధ్యతల్నీ నెరవేర్చగలుగుతారు.

ప్రథమ చికిత్స తెలిసుండాలి!

దెబ్బతగిలితే అమ్మా అంటాం.. అమ్మ దగ్గరుంటే ఆ గాయానికి ప్రథమ చికిత్స చేస్తుంది. అదే తను దగ్గర లేకపోతే/ లేదంటే పిల్లలే వేరే దగ్గర ఉండాల్సి వస్తే.. ఏం చేయాలో తోచదు.. సరికదా ఇలాంటి చిన్న పనులకు కూడా వేరే వాళ్లపై ఆధారపడాల్సి వస్తుంది. అదే.. జ్వరం, జలుబు, చిన్న దెబ్బ తగిలినప్పుడు.. ఎవరికి వారే ప్రథమ చికిత్స చేసుకోగలిగితే అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం రాదు.. పైగా ప్రతి చిన్న అనారోగ్యానికీ డాక్టర్‌ దగ్గరికి పరిగెత్తలేం. కాబట్టి ఇలాంటి ప్రథమ చికిత్స గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయసు నుంచే అవగాహన కల్పించాలంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని మందుల విషయంలో సొంత నిర్ణయాలు కాకుండా డాక్టర్‌ సలహా తీసుకోవాలన్న విషయం కూడా వారికి తెలియజేయాలి.

వీటితో పాటు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, ఇంటిని శుభ్రం చేయడం/అలంకరించడం.. వంటి విషయాల్లోనూ పిల్లలకు చిన్నతనం నుంచే కనీస అవగాహన అలవర్చడం తల్లిదండ్రుల బాధ్యత! ఇలా ప్రతి విషయంలోనూ వారికి స్వతంత్రంగా ఉండడమెలాగో నేర్పితే.. ఎక్కడికెళ్లినా, ఏ పనినైనా వారు ధీమాగా చేయగలరు. ఈ కంప్యూటర్‌ యుగంలో వెనకబడిపోకుండా చురుగ్గా ముందుకెళ్లాలంటే ఇలాంటి అలర్ట్‌నెస్‌/వేగమే కావాలంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని