రిటైరయ్యాక .. రికార్డులు సృష్టిస్తోంది!

పదవీ విరమణ అంటే.. పని నుంచి విరామం పొంది విశ్రాంతి తీసుకునే సమయం. కానీ తనకు పనిలోనే విశ్రాంతి దొరుకుతుందంటారు రాయ్‌పూర్‌కు చెందిన శుభాంగి ఆప్టే. ఉద్యోగంలో కొనసాగుతున్నంత సేపూ తీరిక లేకుండా గడిపిన ఆమె.. పదవీ విరమణ పొందాక తన మనసులోని అభిరుచులపై....

Published : 25 Jan 2023 14:28 IST

(Photos: Instagram)

పదవీ విరమణ అంటే.. పని నుంచి విరామం పొంది విశ్రాంతి తీసుకునే సమయం. కానీ తనకు పనిలోనే విశ్రాంతి దొరుకుతుందంటారు రాయ్‌పూర్‌కు చెందిన శుభాంగి ఆప్టే. ఉద్యోగంలో కొనసాగుతున్నంత సేపూ తీరిక లేకుండా గడిపిన ఆమె.. పదవీ విరమణ పొందాక తన మనసులోని అభిరుచులపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కీ రింగ్‌ సేకరణ దగ్గర్నుంచి పర్వతారోహణ వంటి సాహసాల దాకా.. ఆమె దృష్టి పెట్టని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. అంతేనా.. తన వంతుగా సమాజ సేవకూ పూనుకున్నారు శుభాంగి. ఇలా తన ఆసక్తులకు పదును పెడుతూ పలు రికార్డుల్నీ సొంతం చేసుకున్నారు. తపనను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదంటోన్న ఈ రికార్డుల బామ్మ స్ఫూర్తి గాథ మీకోసం..!

రాయ్‌పూర్‌కు చెందిన శుభాంగి ఆప్టే వయసు 70 ఏళ్లు. హోమ్‌సైన్స్‌లో బీఎస్సీ, సైకాలజీలో ఎంఏ పూర్తిచేసిన ఆమె.. చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకున్నారు. అయితే పెళ్లయ్యాక ఇంట్లో అత్తమామల బాధ్యత ఉండడంతో.. ఆమె ఉద్యోగం చేయకుండా అడ్డుపడాలని చూశారు. అయినా ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేస్తూ మరీ ఉద్యోగం చేశారు శుభాంగి.

పనిలోనే సంతోషం..!

శుభాంగి-సంజయ్‌ ఆప్టే దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. కొడుకు దుబాయ్‌లో, కూతురు ముంబయిలో స్థిరపడ్డారు. ఇద్దరికీ పెళ్లిళ్లు, సంతానం.. ఇలా బాధ్యతలన్నీ తీరిపోయాయి. దీంతో రిటైర్మెంట్‌ తర్వాత గురించిన ఆలోచన ఆమె మనసులో మొదలైంది. అలాగని ఖాళీగా విశ్రాంతి తీసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఇదే విషయాన్ని భర్తతో చర్చించి.. పదవీ విరమణ తర్వాత తన అభిరుచులపై దృష్టి పెట్టాలనుకున్నారామె. ఇందుకు ఆమె భర్త కూడా ప్రోత్సహించడంతో ఆనందంగా అడుగు ముందుకు వేశారు. ‘రిటైరయ్యాక హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చుగా అన్నారు చాలామంది.. కానీ నాకు పనిలోనే విశ్రాంతి దొరుకుతుంది. ఖాళీగా కూర్చొని అనవసరమైన ఆలోచనలతో మనసు పాడుచేసుకోవడం కంటే.. నచ్చిన పనులు చేస్తూ ప్రశాంతంగా ఉండడం మేలనిపించింది. అందుకే పదవీ విరమణ తర్వాత నా అభిరుచులపై దృష్టి పెట్టా..’ అంటారు శుభాంగి.

‘కీ రింగ్‌ కలెక్షన్‌’తో మొదలుపెట్టి..!

అరవై ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేసిన శుభాంగి.. ఆపై కీ రింగ్‌ కలెక్షన్‌తో తన అభిరుచుల చిట్టా విప్పారు. బంధువులు, తెలిసిన వాళ్లు, ఇరుగుపొరుగు వాళ్లు, దుకా ణదారులు.. ఇలా అందరి దగ్గర్నుంచి సుమారు 3,500 లకు పైగా కీ రింగ్స్‌ని పోగు చేసి వాటితో ఓ ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేశారు. అలాగే తాను వెళ్లిన చోట కూడా విభిన్న కీ రింగ్స్‌ని కనిపిస్తే వాటినీ కొనేవారు. ఇలా ఈ అభిరుచి ఆమెను 2007లో ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో’ చోటు సంపాదించేలా చేసింది. ఆ తర్వాత ఆసక్తితో హోటల్‌ మెనూ, ఫుడ్‌ మెనూ.. వంటివీ పోగు చేశారు శుభాంగి. ఇక ప్రయాణాలంటే ఆమెకు మరీ మక్కువ. ఉద్యోగం చేస్తున్నప్పుడు తీర్చుకోలేని ఈ ముచ్చటనూ రిటైరయ్యాక తీర్చుకున్నానంటున్నారీ బామ్మ.

‘పదవీ విరమణ పొందాక నా కాళ్లకు రెక్కలొచ్చినట్లనిపించింది. అందుకే ఓ ఏడాది కాలంలోనే సుమారు 145 రోజులు ప్రయాణాల్లోనే గడిపా. ఈ క్రమంలో దిల్లీ, మహారాష్ట్ర, బిహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు.. ఇలా సుమారు 13 రాష్ట్రాల్లో పర్యటించా. ఇప్పటికీ వాటి తాలూకు టికెట్లు నా దగ్గర భద్రంగా ఉన్నాయి..’ అంటున్నారు శుభాంగి.

బ్యాగ్‌ ఆంటీ..!

తన లక్ష్యాల్లో సమాజ సేవకూ అత్యంత ప్రాధాన్యమిచ్చారీ రాయ్‌పూర్‌ బామ్మ. ఈ క్రమంలో అంధ బాలల కోసం హనుమాన్‌ చాలీసా, రామాయణం, మహాభారతం.. వంటి ఇతిహాస పుస్తకాలు, భక్తి శ్లోకాల్ని బ్రెయిలీ లిపిలో అచ్చు వేయించి ఉచితంగా పంపిణీ చేశారు. మరోవైపు ప్లాస్టిక్ పైనా యుద్ధం ప్రకటించారు శుభాంగి. రాయ్‌పూర్‌ నగరాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చడానికి కంకణం కట్టుకున్న ఆమె.. ఈ క్రమంలో తనకు ప్రావీణ్యం ఉన్న కుట్టు మిషన్‌ నైపుణ్యాల్ని వినియోగించుకున్నారు. వేల సంఖ్యలో క్లాత్‌, కాటన్‌ బ్యాగ్స్‌ కుట్టి ఉచితంగా పంపిణీ చేసేవారు. ఇలా ఇప్పటిదాకా సుమారు 40 వేలకు పైగా బ్యాగ్స్‌ని అందించారామె. ఇలా పర్యావరణహితం కోరి ఆమె చేస్తోన్న ప్రయత్నాన్ని గుర్తించిన రాయ్‌పూర్‌ ప్రభుత్వం.. ఆమెను ‘నో ప్లాస్టిక్‌ క్యాంపెయిన్‌’కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి గౌరవించింది. దీంతో పాటు ‘నేషనల్‌ ఐకాన్‌ హ్యూమన్‌ రీసెర్చ్‌ అవార్డ్‌-2019’తో పాటు మరెన్నో అవార్డులు ఆమెను వరించాయి. అంతేకాదు.. అక్కడి ప్రజలు తనను ముద్దుగా ‘ఆంటీ విత్‌ ఎ బ్యాగ్‌’ అంటూ పిలుచుకుంటారని చెబుతూ సంతోషపడుతున్నారామె.

మహిళలకు అండగా..!

గృహహింస, ఇతర సమస్యలతో కొంతమంది మహిళలు స్థానిక మహిళా పోలీస్‌ స్టేషన్‌ని ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారికీ అండగా నిలబడుతున్నారు శుభాంగి. గత 12 ఏళ్లుగా రాయ్‌పూర్‌లోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలర్‌గా కొనసాగుతోన్న ఆమె.. తన మాటలతో మహిళల్లో ఉన్న భయాల్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. ‘రిటైర్మెంట్‌ అనేది ఉద్యోగానికే కానీ వయసుకు కాదు. కాబట్టి మన లక్ష్యాలు, అభిరుచులపై దృష్టి పెట్టేందుకు ఇదే మంచి సమయం. మావారు, పిల్లల ప్రోత్సాహంతో ఏడు పదుల వయసులోనూ ఎంతో చురుగ్గా ముందుకు సాగుతున్నా..’ అంటోన్న ఈ రాయ్‌పూర్‌ దాదీకి పర్వాతారోహణలోనూ ప్రవేశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే సర్పాస్‌, నైనిటాల్‌, డల్హౌసీ.. వంటి పర్వతాల్ని అధిరోహించిన శుభాంగి.. భవిష్యత్తులో మరిన్ని పర్వతాలను లక్ష్యంగా చేసుకున్నానంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్