Published : 19 Sep 2021 00:04 IST

మీ ఇంట్లో.. శంఖుపూల మొక్క ఉందా?!

మతిమరుపు... యాభై పైబడిన వాళ్లలో క్రమేణా పెరుగుతోంది. క్యాన్సర్‌... వయసుతో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా కబళిస్తోంది. ఆందోళన... చిన్నాపెద్దా అందరినీ కుంగదీస్తోంది. బీపీ, మధుమేహం... ఇలా మరెన్నో ఆరోగ్య సమస్యలు ఎందరినో ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వీటన్నింటికీ చూడచక్కని పరిష్కారమే శంఖుపుష్పి అంటున్నారు సంప్రదాయ వైద్యులు..!

నగనగా ఓ అడవి... అక్కడ మనుషులతోపాటు చిత్రŸమైన జంతువులూ ఉండేవట. ఒకరోజు ఇస్రా అనే మహిళని సగం మనిషి సగం పక్షి ఆకారంలో ఉన్న కిన్నారి అనే విచిత్రజీవి వచ్చి ఓ పూలవనంలోకి తీసుకెళ్లిందట. అక్కడ ఇస్రాకి ఎన్నడూ చూడని ఓ నీలి పుష్పం కనిపించింది. ‘ఈ మొక్కని తీసుకెళ్లి పాకించు. ఊరందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది’ అని చెప్పింది కిన్నారి. అలాగే చేసింది ఇస్రా. కొన్నాళ్లకి అది గోడంతా పాకి విరబూసింది. ఓ పువ్వుని కోసి, కాసిని మరిగించిన నీళ్లలో వేసి, నిమ్మరసం పిండింది. అది కాస్తా గులాబీ రంగులోకి మారిపోయింది. ఆ రంగుని చూసి ఆనందపడిపోతూ ఇస్రా చుట్టుపక్కలవాళ్లకీ ఆ పానీయాన్ని ఇచ్చిందట. ఆ రంగుకి ఫిదా అయిపోయిన వాళ్లంతా దాన్ని తాగడం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా జీవించారట. థాయ్‌లాండ్‌ వాసులు నీలి టీని చప్పరిస్తూ ఇప్పటికీ ఈ జానపద కథని తలచుకుంటారు. ఆ కథలోని నీలి పువ్వే మన శంఖుపుష్పి. దీన్నే అపరాజిత, గోకర్ణ, గెంతన... ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఊదా, తెలుపూ రంగుల్లో మాత్రమే కనిపించే ఈ పూల తీగ, ఎరుపూ గులాబీ నీలం రంగుల్లోనూ వికసిస్తోంది. ఆ టీని ఇప్పుడు మనదగ్గరా చప్పరిస్తున్నారు.

అవునండీ... ఈమధ్య కొందరి ఇళ్లల్లో ఓ తీగ మొక్క కనిపిస్తోంది. అయితే ఆ మొక్కకి పువ్వులు మాత్రం కనిపించడం లేదు. వాటిని ఏ రోజుకారోజు కోసుకుని టీ రూపంలో తాగేస్తున్నారు మరి. నిజానికి శంఖుపుష్పం పూలతీగగా మనకీ సుపరిచితమే. పశుగ్రాసంగానూ వాడేవారు. కానీ అదో అద్భుతమైన ఔషధమొక్క అన్నది సంప్రదాయ, ఆయుర్వేద వైద్యులకే తెలుసు.

శంఖు మొక్క పువ్వులే కాదు, ఆకూ వేరూ కాండమూ గింజా అన్నీ ఆరోగ్యకరమైనవే. నెలసరి ఇబ్బందులకి పూల కషాయాన్ని ఇస్తే, విషపదార్థాలకి విరుగుడుగా వేళ్లతో చేసిన మందుని ఇచ్చేవారట. పాముకాటుకి తెలుపురంగు శంఖు మొక్క వేళ్లను నూరి ఇస్తుంటారు. సొరియాసిస్‌కీ ఈ మందు పనిచేస్తుందట. పంచకర్మ వైద్యంలోనూ వాడతారు. ఇక, ఈ పూలని ఆగ్నేయాసియా దేశాల్లో ఆహారపదార్థాల్లో రంగుకోసం పూర్వం నుంచీ వాడుతున్నారు. వాటితో వంటలూ చేస్తుంటారు. ఈ మొక్క లేతకాయల్ని కూరగానూ వండుతారట. అంతర్జాలం పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచమంతా ఆ పూలని తింటున్నారు, తాగుతున్నారు.

ఎందుకు మంచిదంటే...

ఈ మొక్కలో ఫ్లేవనాయిడ్లూ కెటెచిన్‌లూ పాలీఫినాల్సూ... ఇలా అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. అవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు హానికర పదార్థాలను బయటకు పంపిస్తాయి. పూలల్లో కాల్షియం, మెగ్నీషియం, సోడియం... వంటి పోషకాలూ ఉంటాయి. ఇందులోని ప్రొయాంథోసైనిన్‌ అనే యాంటీఆక్సిడెంటు రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుందట. అందుకే ఈ పూలతో చేసిన టీ తాగడం పెరిగింది.

మతిమరుపు రాకుండా: శంఖు పూలు, ఆకులు, వేళ్లతో చేసిన పొడి నాడీవ్యవస్థ పనితీరుని పెంచడం ద్వారా జ్ఞాపకశక్తినీ తెలివితేటల్నీ పెంచుతుందనీ; నిద్రలేమికీ డిప్రెషన్‌కీ మందులా పనిచేస్తుందని ఆధునిక వైద్యులూ చెబుతున్నారు. ఇందులోని ఆర్గనెల్లోలిన్‌ అనే పదార్థం, శరీరంలో ఎసిటైల్‌ కోలీన్‌ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ శాతాన్ని పెంచి మెదడు పనితీరుకి తోడ్పడుతుందనీ, తద్వారా వయసుతోబాటు వచ్చే మతిమరపుని తగ్గిస్తుందనీ అంటున్నారు.

జీర్ణశక్తికి: వారానికి రెండుసార్లు చొప్పున పరగడుపున శంఖుపూలూ లేదా ఆకుల్ని మరిగించిన కషాయం తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ పోయి జీర్ణవ్యవస్థ బాగుంటుంది. ఇది పొట్టలో మంటనీ మలబద్ధకాన్నీ తగ్గిస్తుంది. గ్యాస్ట్రైటిస్‌, వాంతులు, వికారాలకీ మందే. ఈ మొక్క గింజల్ని పొడి చేసి గ్రా. చొప్పున రెండు పూటలా తిన్నా మంచిదేనట.

చర్మసౌందర్యానికి: కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మం సాగుదలని పెంచి, వయసుతోబాటు వచ్చే ముడతల్నీ చర్మంమీది మచ్చల్నీ తగ్గిస్తుందట. అందుకే ప్రస్తుతం దీన్ని అనేక సౌందర్యోత్పత్తుల్లోనూ వాడుతున్నారు. ఇందులోని క్యుయెర్సిటిన్‌ అనే ఫ్లేవనాయిడ్‌ జుట్టుని త్వరగా నెరవనీయదట.

క్యాన్సర్లకి: ఈ పూల టీలోని సైక్లోటైడ్లు క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని అడ్డుకుంటాయట. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నివారణలో శంఖుపూల కషాయం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు పరిశీలనలు చెబుతున్నాయి.

జ్వరంగా ఉంటే: ఈ టీ తాగితే జ్వర తీవ్రత, దగ్గు, జలుబు తగ్గుతాయట. 

చూపు తగ్గుతుంటే: శంఖుపువ్వులోని ప్రొయాంథోసైనిడిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కంటి నరాల్లో రక్తసరఫరాని పెంచడం ద్వారా గ్లకోమాని నిరోధించడంతోబాటు రెటీనా దెబ్బతినకుండా చేస్తుంది. తరచూ కళ్లు ఎర్రబడటం, వాయడం, ఇన్ఫెక్షన్‌కు గురయ్యేవాళ్లకి ఈ పూల టీ మంచి మందు.

సంతానోత్పత్తికి: రోగనిరోధకశక్తికి మారుపేరైన శంఖుపుష్పం శృంగారప్రేరితం కూడా. క్రమం తప్పక తాగడం వల్ల శుక్రకణాల శాతం పెరుగుతుందట. నెలసరిని క్రమబద్ధీకరించేందుకూ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరుకీ తోడ్పడుతుంది.

కొవ్వు పెరిగితే: రోజూ శంఖుపూల టీని తాగితే కొలెస్ట్రాల్‌ శాతం తగ్గినట్లు పరిశీలనలు చెబుతున్నాయి. అయితే పూలకన్నా వేళ్ల నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ లేదా గింజలను పొడి చేసి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరిగినట్లు చెబుతున్నారు. రక్తంలో క్లాట్స్‌ ఏర్పడకుండానూ బీపీని అదుపులో ఉంచేందుకూ తోడ్పడుతుందీ మొక్క.

చక్కెరవ్యాధికి: శంఖుపూలలో సమృద్ధిగా ఉండే ఫినాలిక్‌ ఆమ్లం, ఫినాలిక్‌ అమైడ్‌లు ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడంతోపాటు జీవక్రియను నియంత్రిస్తాయి. అంటే- రక్తంలో గ్లూకోజ్‌ నిల్వలు లేకుండా చేస్తాయి. భోజనానికి ముందు ఈ టీ లేదా కషాయాన్ని తాగడం వల్ల ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు తగ్గడానికీ తోడ్పడుతుంది.

అదీగాక, కొన్ని రకాల మొక్కల్లోనే సైక్లోటైడ్లూ పెప్టైడ్లూ ఉంటాయి. అలాంటివాటిల్లో ఒకటైన శంఖు మొక్కలోని సైక్లోటైడ్లకి హెచ్‌ఐవీ వైరస్‌నీ అడ్డుకునే గుణం ఉందట. ఇంకా శంఖుపూలు మూత్ర, శ్వాస సమస్యల్నీ నివారిస్తాయి. పంటినొప్పికీ మశూచికానికీ డయేరియా నివారణకీ గొంతు శ్రావ్యంగా ఉండేందుకూ తలనొప్పికీ... ఇలా ఎన్నో సమస్యలకు శంఖుమొక్క మంచి మందు. సాధారణంగా పండ్లూ కూరగాయలన్నింట్లోనూ ఉండే ఫ్లేవనాయిడ్‌ శంఖు పూలల్లోనూ ఉంటుంది. అది చురుకైన యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తూ వయసుతోబాటు పెరిగే హానికర ఫ్రీరాడికల్స్‌ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా అనేక వ్యాధుల్ని అడ్డుకుంటుంది. అందుకే ఇంటింటా ఓ శంఖుపూల మొక్క ఉంటే అంతా మేలే.


ఎలా వాడతారు?

ఈ పువ్వుని గ్రీన్‌ టీ మాదిరిగానే తాగితే మంచిది. పువ్వుల్ని సలాడ్లలో తినొచ్చు. ఎండబెట్టి చేసిన పువ్వులూ లేదా పొడిని కాఫీలో కేకుల్లో ఐస్‌క్రీముల్లో డెజర్ట్‌ల్లో జ్యూసుల్లో... ఇలా రకరకాల వంటల్లో వాడుకోవచ్చు. కాసిని పూలని నీళ్లలో వేసి మరిగించి దించాక వచ్చిన నీలి రంగు టీలో కాస్త నిమ్మరసం పిండితే అది ముదురు గులాబీరంగులోకి మారుతుంది. రసం పిండేకొద్దీ లేత రంగులోకి వస్తుంటుంది. అందులో మళ్లీ తేనె కలిపితే ముదురు గోధుమ వర్ణం వస్తుంది. దీన్ని వేడిగా చల్లగా ఎలా తాగినా మంచిదే. పైగా గులాబీ ఎరుపూ రంగుల్లో విరబూసే శంఖుపూలూ ఉంటున్నాయి. కాబట్టి ఈ పూలను మరిగించి చల్లార్చిన నీటిలో నిమ్మరసం పిండి, రెండు ఐస్‌క్యూబ్స్‌ వేసిన షర్బత్‌లను అతిథులకి అందిస్తే ఆ రంగుల గమ్మత్తుని చూస్తూ గ్లాసు ఖాళీ చేసి మిమ్మల్ని అభినందించేేయడం ఖాయం!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని