వ్యర్థాలకు ఫ్యాషన్ హంగులద్దుతోంది!
పెద్ద పెద్ద చెత్త కుప్పల్ని చూసినప్పుడు మనమైతే ముక్కు మూసుకొని దూరంగా వెళ్లిపోతాం. కానీ దిల్లీకి చెందిన కనికా అహుజాకు ఆ వ్యర్థాల నుంచి వచ్చే దుర్గందం కంటే.. వాటి వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతుందన్న చేదు నిజం మింగుడు పడలేదు. చిన్న వయసు నుంచే పర్యావరణహితం, సమాజ హితం కోరే మంచి మనసున్న ఆమె.. ఈ పరిస్థితిని మార్చడానికి....
(Photo: Screengrab)
పెద్ద పెద్ద చెత్త కుప్పల్ని చూసినప్పుడు మనమైతే ముక్కు మూసుకొని దూరంగా వెళ్లిపోతాం. కానీ దిల్లీకి చెందిన కనికా అహుజాకు ఆ వ్యర్థాల నుంచి వచ్చే దుర్గందం కంటే.. వాటి వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతుందన్న చేదు నిజం మింగుడు పడలేదు. చిన్న వయసు నుంచే పర్యావరణహితం, సమాజ హితం కోరే మంచి మనసున్న ఆమె.. ఈ పరిస్థితిని మార్చడానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలోనే వ్యర్థాల్ని రీసైక్లింగ్ చేసి అందరికీ ఉపయోగపడే వస్తువుల్ని తయారుచేయాలన్న ఆలోచన వచ్చిందామెకు. అనుకున్నదే తడవుగా ఈ దిశగా ప్రారంభమైన తన సంస్థ.. ఇప్పుడు కోట్లాది రూపాయల వ్యాపారంగా రూపుదిద్దుకుంది.. అంతేనా.. వందల మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. సంస్థను ఈ స్థాయికి తీసుకురావడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందంటోన్న కనిక.. వ్యాపార ప్రయాణంలోని కొన్ని మలుపుల్ని తెలుసుకుందాం..!
దిల్లీలో పుట్టి పెరిగిన కనిక తల్లిదండ్రులిద్దరూ.. 1998లో ‘కన్జర్వ్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని అంతమొందించే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ సంస్థ పనితీరు చిన్నారి కనికపైనా చాలానే ప్రభావం చూపింది. పెద్దయ్యాక అమ్మానాన్నల బాటలో నడుస్తూ.. తానూ పర్యావరణహితం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుందామె. అయితే ఆమె తల్లిదండ్రులకు ఇది నచ్చలేదు. దాంతో అయిష్టంగానే ఇంజినీరింగ్ కోర్సులో చేరింది కనిక.
ఉద్యోగం వదులుకొని..!
తల్లిదండ్రుల ఒత్తిడితో కర్ణాటకలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ కోర్సులో చేరిన కనిక.. ఆపై దిల్లీ ఎస్‌ఆర్‌సీసీలో ఎంబీఏ పూర్తిచేసింది. ఆపై ఓ మార్కెట్ రీసెర్చ్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అయితే ఆ ఉద్యోగం తనకు సంతృప్తినివ్వలేదు. దాంతో అందులో నుంచి బయటికొచ్చేసి.. తన తల్లిదండ్రులను ఒప్పించి తమ సంస్థలోనే చేరానంటోందీ యంగ్ ఆంత్రప్రెన్యూర్.
‘చిన్నతనంలో అమ్మానాన్నలతో కలిసి ఓసారి దిల్లీలో ఓ డంప్‌యార్డ్‌కు వెళ్లా. కొండలా పేరుకుపోయిన చెత్తకుప్పలపై పిల్లలు ఆడుకోవడం చూసి చలించిపోయా. ఇది పర్యావరణానికే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో నష్టం చేకూర్చుతుందన్న విషయం తెలుసుకున్నా. అంతే.. ఇక అప్పట్నుంచి ఎలాగైనా ప్లాస్టిక్‌కు చరమగీతం పాడాలన్న ఆలోచన నా మనసులో పడిపోయింది. కానీ అమ్మానాన్నలకు నా నిర్ణయం నచ్చలేదు. అయినా చదువు పూర్తయ్యాక చేసే ఉద్యోగానికి రాజీనామా చేసి.. మా ఎన్జీవోలోనే చేరాను. నిజానికి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన కోసం మేం చేస్తోన్న ప్రయత్నాన్ని ఇంకాస్త ఫలవంతంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నా. ఇందుకోసం మరింత లోతుగా అధ్యయనం చేశా. ఈ క్రమంలోనే రీసైక్లింగ్ ఆలోచన వచ్చింది. ‘లిఫాఫా’ పేరుతో ఇది 2017లో కార్యరూపం దాల్చింది..’ అంటూ చెప్పుకొచ్చింది కనిక.
వ్యర్థాలకు ఫ్యాషన్ హంగులు!
ప్లాస్టిక్ వ్యర్థాల్ని రీసైక్లింగ్ చేసి.. విభిన్న ఫ్యాషనబుల్ వస్తువుల్ని, నిత్యావసర వస్తువుల్ని తయారుచేయడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు 12 టన్నుల ప్లాస్టిక్/సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని సేకరించి.. వ్యాలెట్స్, బ్యాగ్స్, ల్యాప్‌టాప్ స్లీవ్స్, టేబుల్ మ్యాట్స్, చెప్పులు.. వంటి ఎన్నెన్నో ఉత్పత్తుల్ని తయారుచేసింది లిఫాఫా సంస్థ. తద్వారా కోటికి పైగా లాభాల్ని సైతం రాబట్టింది. ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని ఫ్యాబ్రిక్‌లా మార్చడానికి ఓ టెక్నాలజీని రూపొందించాం. ఆపై కొంతమందికి దీనిపై శిక్షణనిచ్చాం. కరోనా సమయంలో మా వ్యాపారం కాస్త నెమ్మదించినా.. ఆపై పుంజుకోగలిగాం. ప్రస్తుతం మా వద్ద తయారవుతోన్న రీసైక్లింగ్ ఉత్పత్తులు దేశీయంగానే కాదు.. యూఎస్‌ఏ, యూరప్.. వంటి ఇతర దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. తాప్సీ, సుహానా ఖాన్.. వంటి తారలు కూడా వీటిని ఇష్టపడుతున్నారు.. ఆయా అకేషన్స్ కోసం వాటిని ఎంచుకుంటున్నారు. ఇప్పటికీ కొంతమంది అడుగుతుంటారు.. వ్యర్థాలతో తయారయ్యే వస్తువులపైనా డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలని! అదే సమయంలో మా ఉత్పత్తుల్లోని నాణ్యతను గమనించి.. ప్రశంసిస్తోన్న వారూ లేకపోలేదు..’ అంటూ తన జర్నీ గురించి చెబుతోంది కనిక. పర్యావరణహితం కోసం ఇలా తాను చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ఎంతోమంది కడుపు నింపుతోంది.
2019లో ‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో తన ఉత్పత్తుల్ని ప్రదర్శించిన కనిక.. ఇందులో భాగంగా ‘సర్క్యులర్ డిజైన్ ఛాలెంజ్’ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన ఎనిమిది మంది డిజైనర్లలో ఒకరిగా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.