‘లక్షల జీతం వదులుకుని.. ఎండలో ఎందుకీ పని’ అన్నారు..!

ఉదయాన్నే ఆఫీసుకెళ్లే హడావిడి. ఒక్కోసారి బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి కూడా సమయముండదు. నిమిషాల్లో తయారయ్యే ఏ మ్యాగీనో, పాస్తాతోనో సరిపెట్టుకుందామంటే.. వాటితో ఎలాంటి పోషకాలు అందవు. ఇది క్రమంగా రక్తహీనత, ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో ‘ఇటు సులభంగా, అటు ఆరోగ్యకరంగా తయారుచేసుకునే ఫుడ్‌ ఆప్షన్లు ఉంటే....

Updated : 20 Dec 2022 13:12 IST

ఉదయాన్నే ఆఫీసుకెళ్లే హడావిడి. ఒక్కోసారి బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి కూడా సమయముండదు. నిమిషాల్లో తయారయ్యే ఏ మ్యాగీనో, పాస్తాతోనో సరిపెట్టుకుందామంటే.. వాటితో ఎలాంటి పోషకాలు అందవు. ఇది క్రమంగా రక్తహీనత, ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో ‘ఇటు సులభంగా, అటు ఆరోగ్యకరంగా తయారుచేసుకునే ఫుడ్‌ ఆప్షన్లు ఉంటే ఎంత బాగుంటుందో..’ అనుకునే సందర్భాలు లెక్కకు మిక్కిలే ఉంటాయి. ఈ ఆలోచననే వ్యాపార మార్గంగా మార్చుకుంది సూర్యాపేటకు చెందిన ఓడపల్లి కీర్తి ప్రియ. పోషకాల విషయంలో రాజీ పడకుండా, ఉపయోగించడానికి సులభంగా, ప్రిజర్వేటివ్స్‌తో పనిలేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా డీహైడ్రేటెడ్‌ ఆహార ఉత్పత్తుల్ని తయారుచేస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోందామె. అందరి ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానంటోన్న కీర్తి ‘మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం’ సందర్భంగా తన వ్యాపార ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకుంది.

‘మనతో పాటు మన చుట్టూ ఉండే వాళ్లు కూడా ఎదిగేలా చేయాలి..’ చిన్నతనం నుంచీ నా మనసులో ఉన్న ఆలోచన ఇది! వ్యాపారంతోనే దీనికి కార్యరూపం ఇవ్వాలనుకున్నా.  మాది సూర్యాపేట. నాన్నది పోలీస్‌ ఉద్యోగం, అమ్మ గృహిణి. బిట్స్‌ పిలానీలో బీ-ఫార్మసీ చేశాక.. ఐఐఎం కోల్‌కతా నుంచి ఎంబీఏ పూర్తి చేశాను. ఆ తర్వాత పలు సంస్థల్లో ఉద్యోగం చేశాను. వ్యాపారం చేయాలన్న ఆలోచనైతే ఉంది కానీ.. ఏది చేయాలన్న విషయంలో స్పష్టత వచ్చింది మాత్రం మా నానమ్మ వాళ్ల ఊరు తొండ తిరుమలగిరికి వెళ్లాకే!

ఒరుగుల నుంచి పుట్టిన ఆలోచన!

సెలవల్లో ఎక్కువగా మేము ఆ ఊరు వెళ్లేవాళ్లం. మా పెద్దనాన్న వాళ్లంతా వ్యవసాయంలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే రైతుల సమస్యలు నాకు అర్థమయ్యాయి. పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక వాళ్లు నష్టపోవడం దగ్గర్నుంచి గమనించాను. ఇలా ఇంత కష్టపడి పండించిన వివిధ ఉత్పత్తులను వృథాగా పడేసే బదులు వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉండే పదార్థాల్లా ఎందుకు మార్చుకోకూడదు? అనిపించింది. మరోవైపు.. నేను బెంగళూరులో ఉద్యోగం చేసేటప్పుడు మా అమ్మ నాకు సులభంగా వండుకొని తినేందుకు వీలుగా వివిధ కాయగూరల ఒరుగులు చేసి పంపించేది. వీటితో తయారుచేసిన వంటలు మా స్నేహితులకూ నచ్చేవి. ఈ క్రమంలో రైతులు పండించే వివిధ ఉత్పత్తులకు ఈ డీహైడ్రేషన్‌ సూత్రాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. ఫలితంగా రైతులూ లాభపడతారు.. పైగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్‌ వాడకుండా పూర్తి సహజసిద్ధమైన పద్ధతుల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండే, సులభంగా వండుకోగలిగేలా ఆహార పదార్థాల్ని తయారుచేస్తే.. సంపూర్ణ పోషకాలూ శరీరానికి అందించచ్చు.. అనిపించింది. ఈ దిశగా చేసిన మథనమే ‘నర్చర్ ఫీల్డ్స్ ఇండస్ట్రీస్’ అనే సంస్థకు ప్రాణం పోసింది.

ఆ నైపుణ్యాలు పనికొచ్చాయి!

దీన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఐఐఎం కోల్‌కతాలో నేను నేర్చుకున్న వ్యాపార మెలకువలు నాకు బాగా ఉపయోగపడ్డాయి. వ్యాపారాభివృద్ధి, బిజినెస్‌ను ఎక్కువ రోజులు నడిపేందుకు ఎలాంటి వ్యాపార వ్యూహాలు రచించాలి, దీన్ని మహిళా సాధికారత దిశగా ఎలా మలచచ్చు.. వంటి అంశాల్లో సమగ్ర నైపుణ్యాలు సంపాదించగలిగాను. ఇక పలు సంస్థల్లో పనిచేయడం వల్ల వ్యాపార నైపుణ్యాలపై మరింత పట్టు పెంచుకోగలిగాను. అయితే పొలాలకు దగ్గర్లోనే ఈ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెడితే మరింత ఉపయుక్తంగా ఉంటుందనిపించింది. అందుకే తొండ తిరుమలగిరిలోనే 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ని నెలకొల్పాం. ఇక్కడి రైతులతో మమేకమయ్యాం. పంటకు అణువుగా మట్టిని సిద్ధం చేయడం దగ్గర్నుంచి, ఏ పంట వేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి.. వంటి విషయాలన్నింటిలో రైతులకు శిక్షణ ఇవ్వడానికి మా వద్ద ప్రత్యేకమైన నిపుణుల బృందం ఉంది. అలాగే హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌తోనూ టై-అప్‌ అయ్యాం. ప్రస్తుతం 20 ఎకరాల్లో 15 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వారు పండించే వివిధ పండ్లు, కూరగాయలను నేరుగా ప్రాసెసింగ్‌ యూనిట్‌కు తీసుకొచ్చి వాటిని డీహైడ్రేట్‌ చేస్తాం.

పొడుల దగ్గర్నుంచి క్యాండీల దాకా..!

ప్రస్తుతం మా వద్ద 15 రకాల కాయగూరలు-పండ్లతో.. 12 రకాల డీహైడ్రేటెడ్‌ ఆహార ఉత్పత్తులు తయారవుతున్నాయి. మరో 7 రకాల ఉత్పత్తుల్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆకుకూరలు, క్యారట్‌, బీట్‌రూట్‌, అల్లం, పచ్చిమిర్చి.. వంటి పదార్థాలతో పొడులు, ఒరుగులు తయారు చేస్తున్నాం. మరోవైపు అరటి పువ్వును ఎండబెట్టి హెర్బల్‌ టీగా మారుస్తున్నాం. ఇక సపోటా, మామిడి.. వంటి పండ్లతో.. క్యాండీలూ మా వద్ద తయారవుతున్నాయి. ఈ పొడులను ఇడ్లీ, దోసె, ఆమ్లెట్‌, రోటీ, మిల్క్‌షేక్‌.. వంటి వాటిలో కలుపుకొంటే అటు రుచితో పాటు ఇటు పోషకాలూ శరీరానికి అందుతాయి. పదేళ్ల క్రితం నేను శాకాహారిగా మారిన సమయంలో రక్తహీనతతో బాధపడ్డాను. నేనే కాదు.. ప్రస్తుతం మన దేశంలో 55 శాతానికి పైగా మహిళలు, చిన్నారుల్ని ఈ సమస్య వేధిస్తోంది. ఐరన్‌ ఎక్కువగా ఉండే మా ఉత్పత్తులు ఈ సమస్యకు ఇట్టే చెక్‌ పెట్టేస్తాయి.

తేడా అదే!

ప్రస్తుతం డీహైడ్రేషన్‌ పద్ధతిలో తయారైన ఆహార ఉత్పత్తులు మార్కెట్లో చాలానే ఉన్నాయి. కానీ వాటిలో వృథాగా పడేసే పదార్థాలతో తయారైనవే ఎక్కువ! అలాగే వేరే వాళ్లతో తయారుచేయించుకొని సొంత బ్రాండ్ పేరిట విక్రయించేవారూ లేకపోలేదు. కానీ మా ఉత్పత్తులు ఇందుకు భిన్నం. ఎందుకంటే రైతులు పండించే పంట దగ్గర్నుంచి, ఉత్పత్తి బయటికొచ్చేదాకా ప్రతి విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. పైగా మేం పంటలు పండించే విషయంలో పూర్తిగా సేంద్రియ, బయో ఎరువులే వాడతాం. ఇక నాణ్యత, పరిశుభ్రత విషయాల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. అలాగే మా ప్రతి ఉత్పత్తి విషయంలో ఆ పంట పండించిన రైతు పేరు మా వెబ్‌సైట్లో పొందుపరుస్తాం. మా బ్రాండ్‌కి (Koh), ఇతర బ్రాండ్లకు ఉన్న ప్రధాన తేడా ఇదే! మా ఉత్పత్తుల్ని FSSAI కూడా ఆమోదించింది.


‘వీ-హబ్‌’ సహకారం మరువలేనిది!

ఇక మా వ్యాపారాభివృద్ధి కోసం వీ-హబ్‌లో సభ్యత్వం తీసుకున్నాం. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు ఓ జర్మన్‌ ప్రోగ్రామ్‌లో ఇంక్యుబేట్‌ అయ్యాం. వ్యాపార అభివృద్ధికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవడానికి, ఈ క్రమంలో పలు సందేహాలను తీర్చుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది. తద్వారా ఆత్మవిశ్వాసమూ పెరిగింది. స్టార్టప్‌ ఇండియాను చేరుకోవడంలోనూ ఈ సంస్థ తోడ్పాటునందించింది. అలాగే ఫ్యాక్టరీ నిర్మాణంలో, నిధులు సమకూర్చుకోవడంలోనూ ఈ సంస్థ మాకు సహకారం అందించింది. ఈ క్రమంలో వీ-హబ్ నిర్వహించే బిజినెస్ సెషన్స్, మీటింగ్స్‌లో పాల్గొంటున్నాం. దీంతో పాటు వ్యాపార అభివృద్ధి కోసం బ్యాంకులు మొదలైన సంస్థల ద్వారా కూడా నిధులు సమీకరించాను.


‘ఎండలో ఎందుకీ పని?’ అన్నారు!

మహిళలు ఏదైనా కొత్తగా చేద్దామంటే ఎందుకో ఈ సమాజం ఎప్పుడూ ఒప్పుకోదు. ఉద్యోగం వదులుకొని వ్యాపారం వైపు వచ్చినప్పుడు నాకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి.

‘లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదులుకొని.. ఎండలో ఎందుకీ పని?’ అన్నవారూ లేకపోలేదు. ఇక ఊర్లో ఫ్యాక్టరీ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ‘ఒక అమ్మాయికి ఇక్కడేం పని’ అన్నట్లుగా చూసేవారు. అయినా నేను వారి మాటలు పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోయా. అప్పుడలా అన్న వారే ఇప్పుడు నా వ్యాపారాన్ని ప్రశంసిస్తుంటే గర్వంగా ఉంది. ఇక చాలామంది నాణ్యత విషయంలో రాజీ పడితేనే లాభాలు ఆర్జించగలమని ఉచిత సలహాలిచ్చే వారు. అందుకూ నేను ససేమిరా అన్నా. ఎవరేమనుకున్నా.. ఆత్మ విశ్వాసంతో లక్ష్యం దిశగా అడుగేస్తేనే విజయం సాధించగలం.


అమ్మ కల నెరవేరింది!

అమ్మకు కొత్త కొత్త ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. మా చిన్న వయసులో పలు వ్యాపార ప్రయత్నాలు చేసినా అవి విఫలమవడంతో కాస్త బాధపడింది. కానీ ఇప్పుడు తన కళ్లలో ఆ ఆనందం, ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. ప్రస్తుతం మా సంస్థలో మహిళా ఉద్యోగుల నిర్వహణ, కొత్త ఉత్పత్తులకు సంబంధించిన ఆలోచనలు.. వంటివన్నీ తనే చూసుకుంటుంది. ఇక మా సంస్థలో ప్రొడక్షన్‌ విభాగంలో పనిచేసే వాళ్లలో 75 శాతం మంది మహిళలే! ఇలా వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం సంతృప్తికరంగా అనిపిస్తోంది. ప్రస్తుతం మా ఉత్పత్తులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కేరళ, తమిళనాడు.. వంటి రాష్ట్రాల నుంచే కాక.. ఇతర దేశాల నుంచి కూడా మాకు ఆర్డర్లు వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రాసెసింగ్‌ యూనిట్ల సంఖ్యను పెంచి, మరిన్ని ఉత్పత్తులతో మరింతమందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అలాగే ఇతర రాష్ట్రాల్లో, ఆఫ్‌లైన్‌లో విస్తరించాలన్న దిశగా యోచన చేస్తున్నా.

ఆఖరుగా ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ఒక ఆలోచనను ఆచరణలో పెట్టే క్రమంలో దాని సాధ్యాసాధ్యాల్ని ముందుగా వాస్తవిక దృక్పథంతో విశ్లేషించుకోవాలి. వినియోగదారుల అవసరాల్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. అలాగే మన చుట్టూ మనల్ని ప్రోత్సహించే వ్యక్తులుండేలా చూసుకోవాలి. అలాంటి వారినే వ్యాపారంలో చేర్చుకుంటే విజయం సాధించగలుగుతాం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవమ’న్నారు పెద్దలు. అందుకే ముందు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారితే.. ఇంటిని-పనిని సమన్వయం చేసుకోగలుగుతాం. ప్రస్తుతం నేను చేస్తోంది కూడా అదే!

‘మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం’.. అసలెందుకు మొదలైందో తెలుసా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని