నా ప్రయత్నం 3సార్లు విఫలమైంది...
తన వయసు ఏడు పదులకు చేరుతోందనే విషయం పర్వతారోహణ చేసేటప్పుడు ఆమెకు జ్ఞాపకం ఉండదు. శిఖరాలతో ప్రేమలో పడిన ఈమె, బృందంతో, ఒంటరిగా 12కు పైగా సాహసయాత్రలను
తన వయసు ఏడు పదులకు చేరుతోందనే విషయం పర్వతారోహణ చేసేటప్పుడు ఆమెకు జ్ఞాపకం ఉండదు. శిఖరాలతో ప్రేమలో పడిన ఈమె, బృందంతో, ఒంటరిగా 12కు పైగా సాహసయాత్రలను చేశారు. ఎన్నోసార్లు ఎత్తైన పర్వతాలకు ట్రెక్కింగ్, బేస్‌క్యాంప్‌లో నిర్వహించే మారథాన్‌లలో పాల్గొన్నారు. సొంతంగా ‘మహో అడ్వంచర్స్’ నిర్వహిస్తూ.. పర్వతారోహకులకు మార్గదర్శనం చేస్తున్నారు. మనసుకు నచ్చింది చేయడంలో వయసు అడ్డుకాదంటూ నిరూపిస్తున్నారు.
మాలా హొన్నాట్టి.
అది 2015, ఏప్రిల్ 25. అప్పటికి మాలాకు 55 ఏళ్లు. ఆ వయసులో ఎవరెస్టు బేస్ క్యాంప్‌కి చేరుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచారావిడ. కర్నాటకకు చెందిన మాల గుడ్‌గావ్‌లోని ఓ జాతీయ బ్యాంకులో మేనేజర్‌గా 31 ఏళ్లు విధులు నిర్వహించి, చీఫ్ మేనేజర్‌గా పదోన్నతిపై దిల్లీ వెళ్లారు. ఫిట్‌నెస్‌పై అవగాహన ఉన్న మాలా 30 ఏళ్ల వయసులో కరాటేలో చేరారు. యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యక్రమాల్లో పాల్గొంటూ, హిమాలయాలకు రెండు సార్లు ట్రెక్కింగ్ చేయడంతో పర్వాతారోహణపై ఆసక్తి మొదలైంది.
మారథాన్‌లో..
ఎవరెస్టుకెక్కాలనే లక్ష్యం తీరకపోవడంతో మారథాన్‌లవైపు అడుగులేశారీమె. పర్వతాల బేస్‌క్యాంపుల్లో మంచులో జరిగే మారథాన్‌లలో పాల్గొంటూ, ఎవరెస్టు, అన్నపూర్ణ, అంటార్కిటికా మారథాన్ తదితర 11 మారథాన్‌లలో పాల్గొన్నారు. ‘అప్పటికీ ఎవరెస్టునెక్కాలనే కల మాత్రం వదల్లేదు. 16 కేజీల బరువును వీపుపై మోస్తూ లడఖ్‌లో మౌంట్ స్టాక్ కాంగ్రీకి వారం రోజుల్లో చేరుకొని, ఎవరెస్టు పర్వతారోహణకు ఫిట్‌నెస్ పెంచుకున్నా. అలా 2014లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి అన్నీ సిద్ధం అనుకున్నప్పుడు స్పాన్సర్స్ వెనుకడుగు వేశారు. అలా రెండోసారి నా కల తీరలేదు. తర్వాతి ఏడాది బ్యాంకు రుణం తీసుకుని మరీ ప్రయాణమయ్యా. చైనా నుంచి బేస్‌క్యాంపు చేరుకొని అక్కడ వారం ఉన్నాం. సరిగ్గా అప్పుడే గోర్ఖా భూకంపం వచ్చింది. మా క్యాంపు చుట్టూ ఉన్న పర్వతాల పైనుంచి రాళ్లు కిందకు దొర్లాయి. ఖాట్మండులో తీవ్ర భూకంపం వచ్చి, 9వేలమంది ప్రాణాలు కోల్పోయారని, 21వేల మంది గాయపడ్డారని నేపాల్ బేస్‌క్యాంపు నుంచి సమాచారం. మేం చైనా వైపు ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాం. అలా మూడోసారి నా ఎవరెస్టు శిఖరారోహణ యాత్ర రద్దయ్యింది. దీని కోసం రూ.23 లక్షలు ఖర్చు పెట్టా. ఆ తర్వాత నిత్యావసరాలకూ ఇబ్బందులెదుర్కొన్నా’ అని వివరించే మాలకు ఎవరెస్టునెక్కాలనే లక్ష్యం తీరకపోయేసరికి 2016లో ‘మహో అడ్వంచర్స్’ ప్రారంభించారు. అమెరికా, దుబాయి సహా మన దేశం నుంచీ సంప్రదించే పర్యాటకులను కాంగ్రీ, కిలిమంజారో, నేపాల్‌లోని మేరాపీక్, అన్నపూర్ణ బేస్ క్యాంప్స్ వంటి ప్రాంతాలకు సాహసయాత్రలకు తీసుకెళుతుంటారు. త్వరలో హిమాలయాల్లోని గర్వాల్ శిఖరాగ్రాన్ని చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్న 69ఏళ్ల మాలా ప్రస్థానం స్ఫూర్తిదాయకం కదూ..
12కు పైగా..
ట్రెక్కింగ్‌లో గుట్టలు, నదులు దాటడం మరవలేని జ్ఞాపకాలు అంటారు మాలా. ‘ఒకసారి ట్రెక్కింగ్‌కు వెళ్లితే చాలు, మరోసారి చేయాలని మనసు కోరుకుంటుంది. అలా ఎత్తైనప్రాంతాలపై ఆసక్తితో 1986లో హిమాలయాన్ మౌంటనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి శిక్షణ పొందా. పర్వతారోహణ కోసం ఫిట్‌నెస్ పెంచుకొన్నా. తర్వాత మౌంట్ కిలిమంజారో, స్టాక్ కంగ్రీ, లడఖీ, సితిధార్ వంటి 12కుపైగా పర్వతాలను ఒంటరిగా, బృందంతో కలిసి ఎక్కా. 1992లో ఎవరెస్టు ఎక్కడానికి ఆల్ వుమెన్ టీంను ఎంపిక కోసం లఢఖ్, మామోస్టాంగ్ కాంగ్రీ శిఖరాగ్ర యాత్రను ఏర్పాటు చేశారు. అలా మేం బయలు దేరేటప్పటికి వరుసగా మూడు రోజులు కురిసిన మంచువానతో ప్రయాణం ఆగిపోయింది’ అని గుర్తు చేసుకున్నారు మాలా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.