వాళ్ల మాటలు పట్టించుకోను.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నా!

అమ్మయ్యే క్రమంలో మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. బరువు పెరగడం, తద్వారా చర్మంపై ఏర్పడే స్ట్రెచ్‌ మార్క్స్‌, వక్షోజాల్లో పెరుగుదల.. ఇలా మన శరీరం రాబోయే పాపాయికి పాలివ్వడానికి అనువుగా సిద్ధమవుతుంది. అయితే ఒక దశలో ఈ మార్పులన్నీ కాస్త అసౌకర్యానికి గురిచేసినా.. అమ్మవుతున్నానన్న ఆనందం ముందు ఇవి నిలవలేవు.

Published : 14 Feb 2022 01:22 IST

అమ్మయ్యే క్రమంలో మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. బరువు పెరగడం, తద్వారా చర్మంపై ఏర్పడే స్ట్రెచ్‌ మార్క్స్‌, వక్షోజాల్లో పెరుగుదల.. ఇలా మన శరీరం రాబోయే పాపాయికి పాలివ్వడానికి అనువుగా సిద్ధమవుతుంది. అయితే ఒక దశలో ఈ మార్పులన్నీ కాస్త అసౌకర్యానికి గురిచేసినా.. అమ్మవుతున్నానన్న ఆనందం ముందు ఇవి నిలవలేవు. ఇలాంటి ప్రాథమిక విషయాల్ని కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది మిడిమిడి జ్ఞానంతో గర్భం ధరించిన మహిళల్ని విమర్శిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేస్తోంది అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌. త్వరలో అమ్మ కాబోతోన్న ఈ ముద్దుగుమ్మ.. తానూ ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నానని, కానీ వాటిని పట్టించుకొని ఈ విలువైన సమయాన్ని వృథా చేసుకోదల్చుకోలేదని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. అంతేనా.. ఓ గర్భిణిగా తాను పాటిస్తోన్న కొన్ని చిట్కాలు, జాగ్రత్తల్నీ పంచుకుంటూ ఎంతోమంది కాబోయే అమ్మల్లో స్ఫూర్తి నింపింది కాజల్.

2020లో తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూతో ఏడడుగులు నడిచింది కాజల్‌ అగర్వాల్‌. పెళ్లి తర్వాత కూడా వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలో తన తొలి పాపాయికి జన్మనివ్వబోతోంది. గర్భం ధరించాక సినిమాలకు కాస్త విరామమిచ్చిన ఈ అందాల తార.. ప్రస్తుతం దుబాయ్‌లో బేబీమూన్‌ని ఆస్వాదిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటోంది కూడా!

అందుకే వాటిని పట్టించుకోను!

ఈ నేపథ్యంలోనే గర్భం ధరించాక పెరిగిన తన శారీరక బరువుపై కొంతమంది విమర్శలు చేశారని, అయినా వాటి గురించి ఆలోచిస్తూ ప్రస్తుతమున్న హ్యాపీ మూడ్‌ని దూరం చేసుకోలేనని చెబుతోందీ టాలీవుడ్‌ అందం. అయితే గర్భం ధరించిన ప్రతి మహిళకూ ఇలాంటి విమర్శలు సహజమని.. వాటిని పట్టించుకోకుండా ఎవరికి వారు తమ శరీరంలో జరిగే ఈ మార్పుల్ని అంగీకరించగలిగితే ఈ సమయంలో సానుకూల దృక్పథంతో అడుగు ముందుకేయచ్చంటోందీ చక్కనమ్మ.

‘ప్రస్తుతం నా వ్యక్తిగత జీవితంలో, వృత్తిలో, శారీరక పరంగా.. ఎన్నో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో బాడీ షేమింగ్‌ కామెంట్స్‌/మీమ్స్‌.. వంటివీ నా సహనాన్ని పరీక్షిస్తున్నాయి. నిజానికి ఇవి నాకు ఏ విధంగానూ ఉపయోగపడవు. అందుకే వాటిని పట్టించుకొని ఈ విలువైన, ఆనందకరమైన సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవట్లేదు. ఇలాంటి సందేశాలు పంపుతున్న వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. కాస్త దయతో ఉండండి.. అది కూడా కష్టంగా అనిపిస్తే.. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ జీవితాన్ని మీరు జీవించండి.

అందమైన ‘వేడుక’ చేసుకుందాం!

ఇలాంటి విమర్శలు నాకే కాదు.. ప్రస్తుతం ఎంతోమంది కాబోయే అమ్మలు ఎదుర్కొంటున్నారు. అలాంటి మహిళలతో నా మనసులోని మాటలు చెప్పాలనుకుంటున్నా. గర్భం ధరించినప్పుడు మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పుల వల్ల బరువు పెరుగుతాం.. వక్షోజాల్లో పెరుగుదల కనిపిస్తుంది.. శరీరంపై స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడతాయి.. అలాగే నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట కూడా క్రమంగా పెరుగుతుంది. ఇలా బిడ్డ పుట్టే సమయానికి మన శరీరం పాపాయికి పాలివ్వడానికి సన్నద్ధమవుతుంది. కొన్ని సమయాల్లో మొటిమల సమస్య తలెత్తి అందం తగ్గుతున్నట్లుగా అనిపించచ్చు.. అలసట, మానసిక ప్రశాంతతను కోల్పోయిన భావన కలుగుతుంది. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు మన ఆరోగ్యం, శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అలాగే ప్రసవం తర్వాత తిరిగి పూర్వపు స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పట్టచ్చు.. కానీ పూర్తిగా మునుపటి దశకు చేరుకోవచ్చు.. చేరుకోకపోవచ్చు. అయితే అమ్మయ్యే క్రమంలో ఈ మార్పులన్నీ సహజమే అయినప్పుడు.. మన జీవితాల్లోకి ఓ బుజ్జాయిని ఆహ్వానించడానికి మనం ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు వీటిని అసాధారణంగా భావించాల్సిన పనిలేదు. అలాగే ఇతరుల మాటలు పట్టించుకొని ఇంత అందమైన ప్రయాణాన్ని అసౌకర్యంగా, ఒత్తిడిగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. అమ్మతనం ఓ వేడుక లాంటిది. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం..’ అంటోందీ కాబోయే అమ్మ.

ఇవి నాకు ఊరటనిస్తున్నాయి!

అయితే గర్భిణిగా ఉన్న సమయంలో అప్రయత్నంగానే పలు ప్రతికూలతలు, ఇతర సమస్యలు మనసును తొలిచేస్తుంటాయి. అలాంటి వాటిని ఎదుర్కోవడానికి తాను కొన్ని చిట్కాలు పాటిస్తున్నానంటూ మరో పోస్ట్‌ పెట్టింది కాజల్.

‘గర్భం ధరించినప్పట్నుంచి బిడ్డ పుట్టే దాకా మన శరీరంలో వచ్చే మార్పులన్నీ కడుపులో ఎదిగే బిడ్డ ఆరోగ్యం కోసమే! అలాగని ప్రెగ్నెన్సీ శాశ్వతమైనది కాదు. కాబట్టి ఈ నవమాసాలూ సానుకూల దృక్పథంతో ఉండడం ఇటు మనకు, అటు పుట్టబోయే బిడ్డకు చాలా అవసరం. ఇవి పరోక్షంగా బిడ్డ ఎదుగుదలకూ దోహదం చేస్తాయి. అయితే ఇందుకోసం ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం.

* మీ మనసులో కలిగే భావాల్ని మీలోనే దాచుకోకుండా మీ భాగస్వామితో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడం అలవాటు చేసుకోండి. తద్వారా మనసు తేలికపడుతుంది. అలాగే వాళ్ల నుంచీ విలువైన సలహాలు పొందచ్చు.

* రోజువారీ వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. ఈత లేదా నడక వల్ల శరీరం దృఢమవుతుంది. అలాగే మనసూ ప్రశాంతంగా ఉంటుంది.

* మీ డాక్టర్‌ సలహా మేరకు ప్రి-నాటల్‌ యోగా ప్రయత్నించచ్చు. నెలలు నిండుతున్న కొద్దీ మానసిక ప్రశాంతత పొందడానికి ఇదీ ఓ మార్గమే!

* మీ డాక్టర్‌ అనుమతిస్తే మసాజ్‌ కూడా చేయించుకోవచ్చు. ఈ ప్రక్రియ ఈ సమయంలో తలెత్తే మూడ్‌ స్వింగ్స్‌, కోపం, చిరాకు.. వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యానికీ ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.

* గర్భిణిగా ఉన్నప్పుడు ఏయే పనులు చేయాలి? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి? .. ఇలా ప్రెగ్నెన్సీ గురించి వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ సమయంలో ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవచ్చు.

* మానసిక సహాయం అవసరమైతే తీసుకోవడానికి వెనకాడకండి. మీ సమస్యను నిపుణులతో పంచుకొని వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోండి. వాటిని పాటిస్తూ ప్రెగ్నెన్సీని ఆస్వాదించండి.. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వండి..’ అంటూ తన సలహాలతో కాబోయే అమ్మలందరిలో స్ఫూర్తి నింపిందీ టాలీవుడ్‌ అందం.

ఇలా కాజల్‌ పెట్టిన పోస్ట్‌కు సామాన్యులే కాదు.. సమంత, మంచు లక్ష్మి, రాశీఖన్నా, హన్సిక, నిషా అగర్వాల్‌ (కాజల్‌ చెల్లెలు).. వంటి ముద్దుగుమ్మలు సైతం స్పందించారు.. పోస్ట్‌ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందంటూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్