Holi: ‘సహజ’ రంగులతో ఆదాయం!

హోలీ అంటేనే రంగుల పండగ. అయితే బయట మార్కెట్లో దొరికే రసాయనపూరిత రంగులు ఇటు ఆరోగ్యానికి, అటు చర్మానికి హానికరం. అందుకే ఈసారి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండగకు సరికొత్త హంగులద్దుతున్నారు ఛత్తీస్‌గఢ్‌ మహిళలు. కాయగూరలు, ఆకుకూరలు, పువ్వులే ప్రధాన ముడిసరుకులుగా....

Updated : 06 Mar 2023 20:10 IST

(Photos: Twitter)

హోలీ అంటేనే రంగుల పండగ. అయితే బయట మార్కెట్లో దొరికే రసాయనపూరిత రంగులు ఇటు ఆరోగ్యానికి, అటు చర్మానికి హానికరం. అందుకే ఈసారి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండగకు సరికొత్త హంగులద్దుతున్నారు ఛత్తీస్‌గఢ్‌ మహిళలు. కాయగూరలు, ఆకుకూరలు, పువ్వులే ప్రధాన ముడిసరుకులుగా సహజ రంగుల్ని తయారుచేస్తున్నారు. తద్వారా ఓవైపు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తూనే, మరోవైపు ఆదాయాన్నీ ఆర్జిస్తున్నారు.

హోలీ పండగ రాగానే మార్కెట్లో ఎటు చూసినా రంగులే దర్శనమిస్తాయి. అయితే రసాయనాలు కలగలిసిన ఈ రంగుల్ని చల్లుకోవడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలు, చర్మ క్యాన్సర్‌, కంటి సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినడం.. వంటి అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి రంగులకు బదులు సహజసిద్ధమైన రంగుల్ని తయారుచేస్తున్నారు ఛత్తీస్‌గఢ్‌ మహిళలు. ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ప్రాంతాలకు చెందిన మహిళా స్వయం సహాయక బృందాలు గత కొన్ని రోజులుగా ఈ పనిలోనే నిమగ్నమయ్యాయి.

ఏ రంగు.. ఎలా?

రాయ్‌పూర్‌కు చెందిన ‘విమెన్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ మల్టీపర్పస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ’కి చెందిన మహిళలు, బలరాంపూర్‌ జిల్లాకు చెందిన మహిళా స్వయం సహాయక బృందాలు, నారాయణ్‌పూర్‌ జిల్లా అభుజ్‌మాద్‌ గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక బృందాలు.. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది మహిళలు.. ఈ సహజ రంగుల తయారీలో భాగమయ్యారు. ఈ క్రమంలో వివిధ రకాల కాయగూరలు, పూలతో సహజ రంగుల్ని తయారుచేస్తున్నారు. ఆకుకూరలు-ఆకుపచ్చ రంగు కాయగూరలతో ఆకుపచ్చ, బీట్‌రూట్‌తో గులాబీ, పసుపు కొమ్ములు-బంతిపూలతో పసుపు, మోదుగ పూలతో ఆరెంజ్‌-ఎరుపు.. వంటి రంగులు వారి చేతుల్లో తయారవుతున్నాయి. ఇక వీటి తయారీలో భాగంగా.. ముందుగా ఆయా ఆకుకూరలు, కాయగూరలు, పువ్వుల్ని రెండుమూడు రోజుల పాటు ఎండలో ఎండబెట్టి.. ఆపై వాటిని పొడి చేస్తున్నారు. ఈ రంగుల్ని సువాసనభరితం చేయడానికి రోజ్‌వాటర్‌, పరిమళభరితమైన పూరేకల్ని జత చేస్తున్నారు. ఇలా రోజుకు క్వింటాళ్ల కొద్దీ సహజ రంగుల్ని తయారుచేసి.. ‘హెర్బల్‌ గులాల్‌’ పేరుతో అక్కడి మార్కెట్లతో పాటు.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు.

యూట్యూబ్‌ వీడియోలు చూసి..!

స్వచ్ఛమైన రీతిలో ఈ సహజసిద్ధ రంగుల్ని తయారుచేయడానికి కొన్ని మహిళా బృందాలు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటే.. మరికొంతమంది యూట్యూబ్‌ వీడియోలు చూసి మరీ నేర్చుకున్నామని చెబుతున్నారు.

‘బయట దొరికే రంగుల్లో హానికారక రసాయనాలు నిండి ఉంటాయి. కానీ మేం తయారుచేసే రంగుల్లో ఇలాంటివేవీ ఉండవు. ముడిసరుకు దగ్గర్నుంచి దాని సువాసనను పెంచే పదార్థాల దాకా ప్రతిదీ సహజసిద్ధమైనవే ఉపయోగిస్తున్నాం. వీటిని ముఖానికి రాసుకుంటే.. అందులోని సుగుణాలు చర్మానికి మేలు చేస్తాయి.. ఒక రకమైన చల్లదనాన్నిస్తాయి. అందుకే రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. దేశంలోని వివిధ ప్రధాన నగరాల నుంచీ మాకు ఆర్డర్లొస్తున్నాయి. ఇలా సహజ రంగుల్ని తయారుచేస్తున్నామన్న సంతృప్తితో పాటు వేలాది రూపాయల ఆదాయాన్నీ ఆర్జిస్తున్నాం..’ అంటున్నారీ మహిళలు.


ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినులూ..!

ఛత్తీస్‌గఢ్‌ మహిళలే కాదు.. జార్ఖండ్‌ హజారీబాగ్‌లోని కేబీ విమెన్స్ కాలేజీకి చెందిన మహిళా విద్యార్థులు కూడా ఈ ఏడాది హోలీ రంగుల తయారీలో పాలుపంచుకున్నారు. ఈ కాలేజీలోని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థినులు వివిధ రకాల కాయగూరలు, పూలతో సహజసిద్ధమైన రంగుల తయారీలో భాగమయ్యారు. పాలకూర ఆకులతో ఆకుపచ్చ, గులాబీ పూరేకలతో బేబీ పింక్‌, వెల్వెట్‌ పూలతో ముదురు గులాబీ, బీట్‌రూట్‌తో ఎరుపు, మోదుగ, నారింజ రంగు బంతిపూలతో ఆరెంజ్‌, పసుపు రంగు బంతిపూలతో పసుపు.. వంటి రంగుల్ని తయారుచేస్తున్నారు. ఇలా ఈ హోలీ సంబరాల్లో పాలుపంచుకుంటోన్న తమ విద్యార్థినులకు సంబంధించిన ఫొటోలు ఆ కళాశాల యాజమాన్యం తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్ట్‌ చేస్తూ.. వాళ్ల నైపుణ్యాల్ని ప్రశంసించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్