Updated : 14/01/2022 04:46 IST

చుక్కలతో మెరిపిస్తున్నారు!

సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ముగ్గులే. పల్లె అయినా పట్టణమైనా ప్రతి లోగిలీ రంగవల్లులతో నిండిపోతుంది. ఎవరి ఆసక్తి, స్థలాన్ని బట్టి నచ్చిన విధంగా వేసుకుంటారు. వీరు మాత్రం తమ ఇష్టాన్ని అందరి ముందుకీ తీసుకొచ్చారు. సులువుగా గీస్తూనే సృజనాత్మకతనీ జోడించేస్తున్నారు. రంగోలీ యూట్యూబర్లు.. దేశవ్యాప్తంగా లక్షలమంది మనసులు కొల్లగొడుతున్నారు. వారిలో కొందరు వీళ్లు.


అమ్మే గురువు: సునీత

వీడియోలు: 4400  

సబ్‌స్క్రైబర్లు: 20 లక్షలకుపైగా

వీక్షణలు: 74 కోట్లకు పైనే

జామెట్రీ, ఫిలాసఫీ, సైన్స్‌, చరిత్ర, ఆధ్యాత్మికత.. వీటన్నింటినీ ఒకటి చేయగలిగింది ముగ్గే అని నమ్ముతుందీమె. దీన్ని మన సంప్రదాయాన్ని వ్యక్తీకరించే కళారూపంగా భావిస్తుంది. పుట్టిపెరిగిందంతా పల్లెలోనే. చిన్నప్పట్నుంచీ అమ్మ వేసే ముగ్గుల్ని చూసి ప్రయత్నించేది. వాటిలో ఆవిడ మార్పులు, చేర్పులు, రంగుల ఎంపిక నేర్పేది. అందుకే అమ్మే తన గురువంటుంది. నేర్చుకున్నవి పుస్తకంలో గీసి పెట్టుకునేది. పెళ్లయ్యాక తనతోపాటు వాటినీ భద్రంగా తెచ్చుకుంది. అప్పటివరకూ ఫోన్‌, టెక్నాలజీపై అవగాహన లేదు. ఆమె ఆసక్తిని, నైపుణ్యాన్ని చూసి భర్త పాకాల సురేష్‌ ప్రోత్సహించారు. అలా 2016లో ‘ఈజీ రంగోలీ’ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది. పేరుకు తగ్గట్టుగా సులువుగా వేయగలిగే వాటికే ఈమె ప్రాధాన్యం. మొదట్లో వీడియో తీయడం, ఎడిటింగ్‌, అప్‌లోడింగ్‌ అన్నీ భర్తే చేసేవారు. ఇప్పటికీ రోజుకు 2-3 ముగ్గుల్ని ఉంచుతుంది. రెండేళ్లలోనే ఊహించనంత గుర్తింపొచ్చింది. ‘ముగ్గుపై ఇష్టం కంటే.. జీవితంలో భాగంగా భావిస్తా. ఎక్కడికెళ్లినా దానిపైనే మనసు. గుడికి వెళ్లినా వాటి పైభాగంలోని డిజైన్లను గమనిస్తుంటా’ అంటోందీమె. పరికరాలేమీ లేకుండా చేత్తోనే ముగ్గంతా వేసే ఆమెకు అభిమానులెక్కువ. రోజు, సందర్భాన్నిబట్టి ముగ్గును నిర్ణయిస్తుందట. తనను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతుండటం, సొంత ఛానెళ్లు ప్రారంభిస్తుండటం చూస్తే ఆనందంగా ఉంటుందంటుంది.


ఆసక్తే ఇటు నడిపింది: దీపికా సామ

వీడియోలు: 3800  

సబ్‌స్క్రైబర్లు: సుమారు 7 లక్షలు

వీక్షణలు: 21 కోట్లు

ఈమెది సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు దగ్గర పాటి ఘన్‌పూర్‌. ఇంటర్‌ అయ్యాక పెళ్లి అయింది. భర్త నాగేశ్‌ ప్రైవేటు ఉద్యోగి. చిన్నప్పటి నుంచీ దీపికకు ముగ్గులంటే ఆసక్తి. ఇంటి ముందు రకరకాల ముగ్గులేసి మురిసిపోయేది. తర్వాత వాటిని ఫేస్‌బుక్‌లో పెట్టడం మొదలుపెట్టింది. అవి చూసి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ వాళ్లడిగితే కొన్నాళ్లు వేసిచ్చింది. తర్వాత భర్త ప్రోత్సాహంతో 2017లో ‘దీపిక రంగోలీస్‌’ ఛానెల్‌ ప్రారంభించింది. వీడియో తీయడం, ఎడిటింగ్‌ నేర్చుకుంది. రెండు నెలల్లోనే వీక్షణలు పెరగడంతోపాటు ఆదాయమూ మొదలైంది. రోజూ 2 వీడియోలు పెడుతుంది. పండగల సమయంలో మాత్రం ఈ సంఖ్య పెరుగుతుంటుంది. సులువుగా, తక్కువ స్థలంలోనే సృజనాత్మకంగా వేసే వాటిపైనే తనెక్కువగా దృష్టి పెడుతుంది. ప్రేక్షకులు అడిగిన వాటి ఆధారంగా వేయడానికి ప్రాముఖ్యం ఇస్తానంటోంది.


సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి: పూనమ్‌ బోర్కర్‌

వీడియోలు: 1000

సబ్‌స్క్రైబర్లు: 10 లక్షలపైనే

వీక్షణలు: 29.5 కోట్లు

పూనమ్‌ది మహారాష్ట్ర. చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడం ఇష్టం. పండుగలేవైనా ఇంట్లో రంగోలీ ఉండాల్సిందే! అక్కడ తన ప్రతిభను ప్రదర్శించేది. రంగులతో ప్రయోగాలు చేసేది. చుట్టుపక్కల వాళ్లు మెచ్చుకుంటోంటే ఉత్సాహంగా ప్రయత్నించేది. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ అయ్యాక ఎంఎన్‌సీలో చేరింది. ఖాళీ దొరికితే ఆర్ట్స్‌, క్రాఫ్ట్‌ను ప్రయత్నించేది. వాటి ఫొటోలను స్నేహితులతో పంచుకునేది. అవి చూసి అందరూ అబ్బురపడేవారు. 2013లో తన పేరిటే యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది. సులువుగా వేసుకునే ముగ్గులు ఎక్కువ మందికి ఉపయోగపడతాయని వాటికే ప్రాధాన్యం ఇచ్చేది. క్రమంగా అనుసరించే వారి సంఖ్యా పెరిగింది. ఉద్యోగం, రంగవల్లులు రెండింటికీ సమయం కుదరలేదు. బాగా ఆలోచించి అభిరుచికే ప్రాధాన్యమిచ్చింది. రంగులతో 3డీలా కనిపించేలా వేయడం తన ప్రత్యేకత. చూస్తే కష్టమనిపించేలా ఉన్నా... సులువుగా, ఇంట్లో వస్తువులతోనే వేసుకునేలా ఉంటాయీమె రంగవల్లులన్నీ. అవే కాదు.. సులువుగా చేసుకోగలిగే ఆహారంపైనా వీడియోలుంచుతుంది. మొదటి ప్రాధాన్యం మాత్రం ముగ్గులకేనంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని