ఇది శివుడిచ్చిన వరం
close
Updated : 27/01/2022 03:26 IST

ఇది శివుడిచ్చిన వరం!

కళ మనసుని నింపుతుందంటారు... కానీ పదునైంది కూడా అని నిరూపించారామె.. ‘కాకతీయం’ పేరుతో తెలుగువారి చరితను అందమైన నృత్యరూపకంగా మలిచి అందరి మన్ననలు అందుకున్న పద్మజారెడ్డి.. మరోవైపు అదే కళని ఆయుధంగా వాడి సాంఘిక దురాచారాలని నిలువరించే ప్రయత్నం చేశారు. పద్మశ్రీ అవార్డు వరించిన సందర్భంగా కూచిపూడి నాట్యకారిణి డాక్టర్‌ పద్మజారెడ్డి వసుంధరతో ప్రత్యేకంగా ముచ్చటించారు..

కృష్ణా జిల్లా పామర్రు పద్మజారెడ్డి స్వస్థలం. తండ్రి జీవీ రెడ్డి వైద్యుడు, తల్లి స్వరాజ్యలక్ష్మి గృహిణి. ఉద్యోగరీత్యా తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డా ఆమె మాత్రం పామర్రులో తాత దొంతిరెడ్డి, అమ్మమ్మ శారదాంబ వద్దే పెరిగారు. ‘మా తాతగారికి కళల పట్ల ఉన్న ఆసక్తే నాకూ వచ్చింది. తాతయ్యతో చెబితే మా ఊరికి దగ్గర్లో ఉండే కూచిపూడి గ్రామంలోని గురువులను పిలిపించి నాలుగేళ్ల వయసులో నాకు శిక్షణ ఇప్పించారు’ అనే పద్మజారెడ్డి అక్కడ నుంచి అనతికాలంలోనే చక్కటి అభినయంతో పాఠశాలల్లో ప్రదర్శనలివ్వటం మొదలుపెట్టారు. వాటిని చూసిన ఊరి పెద్దలు.. బడిలో మాస్టార్లు ఆమెను ప్రత్యేకంగా అభినందించటంతో నాట్యంపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు. ఐదో తరగతి చదువుతున్నప్పుడు హైదరాబాద్‌కు వచ్చేసి.. వెంపటి చినసత్యం, ప్రముఖ నృత్యకారిణి శోభానాయుడు నిర్వహిస్తున్న కేంద్రంలో శిక్షణ తీసుకున్నారు. వారి పర్యవేక్షణలో దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చి గుర్తింపు పొందారు. నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యే గడ్డం గంగారెడ్డి చిన్నకుమారుడు శ్రీనివాస్‌రెడ్డితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నృత్య ప్రదర్శనలు కొనసాగించారు. భారత సాంస్కృతిక మండలి, భారత పర్యాటక సలహామండలి సభ్యులుగా ఆమె పనిచేశారు. కుమారుడు ప్రణవ్‌ పేరుతో హైదరాబాద్‌లో మూడుచోట్ల నాట్య అకాడమీలు నిర్వహిస్తున్నారు.

కాకతీయుల కథని.... పౌరాణిక అంశాలపై ప్రదర్శనలు అందరూ ఇస్తున్నవే. కానీ తనకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకున్నారు పద్మజారెడ్డి. ఈ నేపథ్యంలోనే రామప్ప దేవస్థానం ఇతివృత్తాంతం, కాకతీయుల కాలం నాటి శిల్పకళ, నాట్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక నృత్యరూపకాన్ని రూపొందించారు. దానికి ‘‘కాకతీయం’’ అని పేరుపెట్టారు. ఇందుకోసం ఆమె దశాబ్దకాలం పాటు పరిశోధన చేశారు. ‘రుద్రమదేవి మామ... కాకతీయ రాజ్యంలో గజసేనాని అయిన జయప్పసేనాని ‘నృత్య రత్నావళి’ పుస్తకాన్ని సంస్కృతంలో రచించారు. దీన్ని తమిళనాడులోని పప్పు వేణుగోపాల్‌ ఆంగ్లంలో అనువదించి.... నాకు ఇచ్చారు. ఈ పుస్తకంలో పేర్కొన్న విషయాలనే నృత్య రూపంగా మలిచాను. దీనికోసం ఎంతో శ్రమ పడ్డా. కానీ ఆ శ్రమకు ఫలితంగా ఇది తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్య రూపకంగా ప్రజల మనసులో నిలిచిపోవడం సంతోషంగా ఉందని’ చెబుతున్నారు పద్మజారెడ్డి.

ప్రదర్శనలకు గుర్తింపు.. సామాజిక అంశాలపై ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఆలోచన చేశారు. తల్లి గర్భంలోనే ఆడశిశువులను చంపేస్తున్న ఉదంతాలపై తనదైన శైలిలో పోరాటం చేయాలనుకున్నారు. ఇందుకోసం సొంతంగా నృత్యరీతులు రూపొందించి ప్రదర్శనలిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ‘హంస’ పురస్కారం, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందాయి. సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని సైతం 2015లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి చేతుల మీదుగా అందుకున్నారు. నాట్య విశారద, కల్కి కళాకార్‌ తదితర పురస్కారాలు అందుకున్నారు. ఆమె ప్రతిభకు అమెరికా తెలుగు అసోసియేషన్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, నార్త్‌ అమెరికా, యూరోపియన్‌ తెలుగు అసోషియేషన్‌ పురస్కారమూ లభించాయి. ‘పద్మశ్రీ నాకు శివుడు అందించిన వరమే. నాతో పాటు నా శిష్యులూ ఇలాంటి పురస్కారాలు అందుకోవాలన్నది నా కోరిక’ అంటారామె.

- రేవళ్ల వెంకటేశ్వర్లు, నిజామాబాద్‌


Advertisement

మరిన్ని