Published : 12/02/2022 06:16 IST

స్కూల్‌ పిల్లలకీ వ్యాపార పాఠాలు!

ఆరువేల కోట్ల రూపాయల ‘ఎమ్‌క్యూర్‌’ అంతర్జాతీయ ఫార్మా సంస్థని నిర్వహిస్తూనే... మరోవైపు ప్రతిభ ఉన్న యువతని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే పనిలో పడింది నమితా థాపర్‌.. షార్క్‌టాంక్‌ ఇండియా రియాలిటీ షోలో పెట్టుబడి పెట్టే ‘షార్క్‌’గా దేశవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకుంటోన్న ఆమె మరోవైపు మహిళా సాధికారత కోసమూ కృషి చేస్తోంది..

‘వడ్డించిన విస్తరి..’ అనే పదాన్ని నమిత ఇష్టపడదు. ‘తండ్రి ప్రారంభించిన సంస్థ. ఇక చేయడానికి ఏముంటుంది?’ అనే ముద్ర తనపై పడాలనుకోలేదు. తన ప్రత్యేకత చూపించాలనుకుంది. అందుకే సంస్థ స్వభావాన్ని కూలంకషంగా తెలుసుకున్న తర్వాతే ఈ వ్యాపార బాధ్యతలు తీసుకుంది. మహారాష్ట్రలోని పుణెలో పుట్టిన నమిత సావిత్రీబాయిఫులే విశ్వవిద్యాలయం నుంచి బీకాం, సీఏ పూర్తిచేసింది. ఆ తర్వాత డ్యూక్‌ విశ్వవిద్యాలయంలోని ఫ్యుక్యువా బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీయే చదివింది. అమెరికాలో వైద్య పరికరాలు చేసే గైడెంట్‌ కార్పొరేషన్‌లో ఆరేళ్లు పని చేసింది. ఆ తర్వాతే 2007లో కుటుంబ వ్యాపారం అయిన ఎమ్‌క్యూర్‌ ఫార్మాసూటికల్స్‌ సీఎఫ్‌వోగా చేరింది. తన నేతృత్వంలో ఎమ్‌క్యూర్‌ని అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దింది. మన దేశంలో అగ్రగామి పది సంస్థల్లో ఒకటిగా నిలిపింది. ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోన్న ఈ సంస్థ... 70 దేశాల్లో విస్తరించింది. పదివేల మంది ఉద్యోగులు, 800 మంది శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. నమితకు వ్యాపారదక్షతతో పాటు సామాజికస్పృహా ఎక్కువే. యువతను వ్యాపార రంగంలోకి తీసుకొచ్చేందుకు ‘ఇంక్రెడిబుల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ సంస్థని ప్రారంభించింది. ఇదో పాఠశాల. 11 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాపార పాఠాలు బోధించడం ఈ స్కూల్‌ లక్ష్యం. దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, చెన్నై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇది నడుస్తోంది. ‘మెడిసిన్‌, ఇంజినీరింగ్‌లానే యువత వ్యాపారాన్ని ఓ వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు? ఈ స్కూల్‌ని ఆవిర్భావానికి మా పెద్దబ్బాయి వీర్‌ కారణం. చిన్న వయసులోనూ వ్యాపార మెలకువలు నేర్చుకోవాలని తను చూపిన ఉత్సాహమే దీనికి ప్రేరణ. పిల్లలు అద్భుత ఆలోచనలు చేస్తున్నారు. వాళ్లని ప్రోత్సహించి, ముందుకు నడిపించడమే మన వంతు’ అంటోంది నమిత.  

కొత్త ఆలోచనలకు కొండంత అండ....

హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌, ఐఐఎమ్‌లో వ్యాపార పాఠాలు బోధించే నమిత...  కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వాలే కానీ సామాన్యులూ వ్యాపారవేత్తలు కాగలరు అంటోంది. అనడమే కాదు కొత్త ఆలోచనలతో వచ్చే యువతకు పెట్టుబడులు అందించి వారిని ముందుకు నడిపిస్తోంది. బిజినెస్‌ రియాల్టీషో ‘షార్క్‌టాంక్‌ ఇండియా’లో పాతిక వరకూ కొత్త ఆలోచనలని ప్రోత్సహించి 10 కోట్ల రూపాయల్ని పెట్టుబడులుగా అందించింది. కబడ్డీఅడ్డా, వాకావో ఫుడ్స్‌, రేర్‌ప్లానెట్‌ వంటి ఆలోచనలకు పెట్టుబడులు సమకూర్చింది.

ప్రభుత్వ కార్యక్రమాలకు తోడుగా...

మహిళా సాధికారతకు పెద్దపీట వేసే నమిత ‘అన్‌కన్డిషనల్‌ యువర్‌సెల్ఫ్‌ విత్‌ నమిత’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నిర్వహిస్తోంది. సురక్షిత గర్భస్రావాలు, ఎండోమెట్రియోసిస్‌, గర్భాశయముఖద్వార క్యాన్సర్‌, రక్తహీనత, బాడీషేమింగ్‌ వంటి అంశాలపై సెలబ్రిటీలు, నిపుణులని ఆహ్వానించి ప్రత్యేకంగా కొన్ని వీడియోలు రూపొందించింది. మిలియన్లలో లైక్స్‌, వ్యూస్‌ అందుకున్న ఈ వీడియోలు అవగాహన తీసుకొచ్చేలా ఉంటాయి. నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో ప్రధాని ప్రారంభించిన ‘విమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌’, ‘డిజిటల్‌ హెల్త్‌ టాస్క్‌ఫోర్స్‌’, ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

ఏం చేయొద్దంటే...

‘నాకు తెలిసినంత వరకూ మహిళలు టైం మేనేజ్‌మెంట్‌ని పక్కాగా అనుసరిస్తారు. ఎంత చేసినా కానీ ఇంకా ఏదో చేయలేకపోయామనే ఆత్మ న్యూనతలోనూ ఉంటారు. వాళ్లకి నేను చెప్పేదొకటే. చాలామంది రేపు చేయాల్సిన పనులతో ‘టుడు లిస్ట్‌’ రాసుకుంటారు కదా! దానికి బదులు ‘నాట్‌ టుడు లిస్ట్‌’గా రాసి పెట్టుకోండి. అనవసర పనులను వదిలించుకుంటేనే ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. నా విషయానికి వస్తే వ్యాపారం అనేది 24 గంటల ఉద్యోగం అని ఒప్పుకొంటాను. నేనూ నా పిల్లల స్కూల్‌ కార్యక్రమాలు, ఇంట్లో శుభకార్యాలను తరచూ మిస్‌ అయిపోతూ ఉంటా. ఆ లోటుని భర్తీ చేయడం కోసం సమయం దొరికినప్పుడు వాళ్లతో ప్రత్యేకంగా గడుపుతాను’ అంటోంది నమిత.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని