Published : 20/02/2022 00:43 IST

ఐక్యరాజ్యసమితిని... మెప్పించింది

మహిళలు వినియోగించిన శానిటరీ ప్యాడ్స్‌ను ఆరు బయట పడేయడం, దాని వల్ల కలిగే దుష్పరిణామాలు డాక్టర్‌ మధురితను కలచివేశాయి. పర్యావరణానికి హాని కలిగించే ఈ పద్ధతికి స్వస్తి పలికేలా చేయాలనుకుంది. దానికి తను చేసిన ఆలోచన సోలార్‌ ప్యాడ్‌ ఇన్సినరేటర్‌. సౌరశక్తితో పనిచేసే ఈ తరహా యంత్రం ప్రపంచంలోనే మొదటిది...

డాక్టర్‌ మధురిత గుప్తా మద్రాస్‌ వెటర్నరీ కాలేజీలో బీవీఎస్‌సీ పూర్తి చేసింది. అబికా టాప్‌ హాస్పిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు సీఈవో, కో ఫౌండర్‌. దీంతోపాటు సామాజిక కార్యకర్తగానూ సేవలు అందిస్తోంది. భర్త సహకారంతో ‘మైవెట్స్‌’ ఛారిటబుల్‌ ట్రస్టును నడుపుతోంది. వన్య మృగాల సంరక్షణపై దేశ వ్యాప్తంగా అటవీ ప్రాంతాలకు తన బృందంతో వెళ్లి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ సమయంలోనే అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్థానిక గిరిజన మహిళలు నెలసరి సమయంలో తాము సొంతంగా తయారుచేసి వినియోగించే ప్యాడ్స్‌ను దగ్గర్లోని అటవీ ప్రాంతాల్లో పారేస్తున్నారని తెలుసుకుంది. వాటి నుంచి వచ్చే రక్తపు వాసనకు అడవి జంతువులు గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి. ఇది ఉభయులకూ ప్రమాదకరమే. పైగా వాడేసిన ప్యాడ్స్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా. ఇవన్నీ వారికి చెప్పింది. సమస్యేంటో తెలుస్తోంది. దానికి పరిష్కారాన్నీ సూచించాలనుకుంది మధురిత.

పర్యావరణహితంగా..

‘ఇలా చేయద్దని చెప్పడం తేలికే. కానీ ఏం చేయాలి? సమస్యకు పరిష్కారమేంటి? ఇవన్నీ గ్రామీణులు ఆలోచించలేరు కదా. అందుకే ఆ దిశగా ఆలోచించి, తయారు చేసిందే ఈ సోలార్‌ యంత్రం. రోజుకి దీంట్లో 250 ప్యాడ్స్‌ను దగ్ధం చేయొచ్చు. ఇది 450 డిగ్రీల వరకు వేడెక్కుతుంది. ఎటువంటి పొగ బయటికి రాదు. దీంతో పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదు. ఇప్పటికైనా మహిళలకు ఈ సమస్యపై అవగాహన రావాలనే కారణంగా ఈ స్టార్టప్‌కు ‘సోలార్‌ లజ్జ’ అని పేరు పెట్టా. గతంలో ప్యాడ్స్‌ను కాల్చే పలురకాల యంత్రాలొచ్చాయి. అయితే సౌరశక్తి సహాయంతో పని చేసే దాన్ని ఇప్పటి వరకూ ఎవరూ రూపొందించలేదు. దాంతో ప్రపంచంలోనే ఇది మొదటిదైంది. మొదట రాజస్థాన్‌లో మారుమూల గ్రామాల్లో ఈ యంత్రాన్ని ఉంచి అక్కడి వారికి దీని వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కలిగించేదాన్ని. ఆ తర్వాత మహారాష్ట్ర సహా దాదాపు 200 గ్రామాలకు పైగా దీన్ని వినియోగించేలా చేశా. ఈ యంత్రం ఉపయోగాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి మహిళా బృందం ప్రపంచంలోనే అత్యంత ప్రయోజనకరమైన, ఉన్నతమైన 10 ఆవిష్కరణల్లో సోలార్‌ లజ్జనూ చేర్చడం సంతోషంగా అనిపించింది. పరిశుభ్రతతోపాటు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతున్న ఈ పరికరం గురించి దేశవ్యాప్తంగా అందరికీ అవగాహన కలిగించడానికి వలంటీర్ల సాయంతో కృషి చేస్తున్నా. త్వరలో ఈ యంత్ర వినియోగాన్ని దేశమంతా విస్తరించేలా చేస్తా’ అని చెబుతున్న మధురిత అందిస్తున్న సేవలకు గాను ‘స్ట్రెయిట్‌ ఆఫ్‌ మెగెల్లాన్‌ అవార్డు’ వంటి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలూ దక్కాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని