ఐక్యరాజ్య సమితిని మెప్పించారు!

స్పందించే హృదయం.. మార్పు తేవాలన్న బలమైన కోరిక.. ఇవే వీళ్ల ఆయుధాలు! ఆ స్ఫూర్తినే తోటి మహిళల్లో నింపుతూ మార్పునకు కారణమయ్యారు. ఒకరు అమ్మాయిల సంరక్షణకు ప్రాధాన్యమిస్తే.. ఇంకొకరు ఈ ప్రకృతిలో పక్షులకీ జీవించే హక్కుందని పోరాడారు.

Updated : 24 Nov 2022 00:54 IST

స్పందించే హృదయం.. మార్పు తేవాలన్న బలమైన కోరిక.. ఇవే వీళ్ల ఆయుధాలు! ఆ స్ఫూర్తినే తోటి మహిళల్లో నింపుతూ మార్పునకు కారణమయ్యారు. ఒకరు అమ్మాయిల సంరక్షణకు ప్రాధాన్యమిస్తే.. ఇంకొకరు ఈ ప్రకృతిలో పక్షులకీ జీవించే హక్కుందని పోరాడారు. ఆలోచన మొదలైంది ఒక్కరితోనే.. కానీ అది ఎన్నో జీవితాల్లో వెలుగులకు కారణమైంది! అందుకే ఇద్దరూ ఐక్యరాజ్యసమితి చేత శభాష్‌ అనిపించుకోగలిగారు. ఎల్సామేరీ, డాక్టర్‌ పూర్ణిమల స్ఫూర్తి ప్రయాణాన్ని మీరూ చదవండి.

పక్షుల కోసం.. పదివేల సైన్యం!

అసోంలో అంతరిస్తున్న హర్గిలా జాతి పక్షుల్ని రక్షిస్తూనే... వేల మంది మహిళలకు ఉపాధినీ కల్పిస్తున్నారు డాక్టర్‌ పూర్ణిమా దేవి బర్మన్‌.

చిన్నప్పుడు పూర్ణిమను వాళ్లమ్మా నాన్న అసోంలో బ్రహ్మ పుత్ర నదీతీరం ‘గోన్‌’లో ఉంచారు. ఇంటికి, తోబుట్టువులకు దూరంగా ఉంటూ బాధ పడుతోన్న తన మనసు మళ్లించడానికి నానమ్మ పొలాలకు తీసుకెళ్లేది. రకరకాల పక్షుల కథలు చెప్పేది. వాటిపై పాటలూ కట్టేది. తననూ పాడమని ప్రోత్సహించేది. అలా పూర్ణిమకి పక్షులపై ప్రేమ ఏర్పడింది. అదే జీవావరణ శాస్త్రం వైపు నడిపించింది. జీవ శాస్త్రంలో మాస్టర్స్‌ చేసి, పీహెచ్‌డీలో చేరారీమె. ఓసారి ఓ వ్యక్తి పెద్ద వృక్షాన్ని కొట్టేయడం.. దానిమీది కొంగ గూడు జారి అందులోని పిల్లలు చనిపోవడం చూశారు. ఆ సంఘటన ఆమెను ఎంతగానో కదిలించింది. ఆ పక్షులు అంతరించి పోతున్నాయని తెలిసి వాటి సంరక్షణకు కంకణం కట్టుకున్నారు.

పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి వీటిపై అవగాహన కలిగించేవారు. స్థానిక మహిళల్నీ పోగు చేసి.. 2015లో ‘హర్గిలా ఆర్మీ’ని ప్రారంభించారు. కేవలం సేవ అంటే ఎంతమంది కలుస్తారు. అందుకే వీళ్లతో పక్షుల ఆకారపు మోటిఫ్‌లున్న వస్త్రాలను చేయించి, అమ్మేది. అలా వాళ్లకు ఉపాధీ కల్పించింది. వంద మందితో మొదలైన ఆ ఆర్మీలో ఇప్పుడు పదివేల మంది మహిళలు ఉన్నారు. గూళ్ల ఏర్పాటు, రక్షణ, గాయపడిన పక్షులకు పునరావాసంతో పాటు గుడ్లు పెట్టే సమయంలో సీమంతం లాంటివీ చేస్తుంటారు. ఈ జాతి మన సంప్రదాయం అంటూ పాటలు, నాటకాల ద్వారా ప్రజల్లో అవగాహన తెచ్చారు. వీటి ఆకారంలో ఉన్న బొమ్మలను టోపీలుగా ధరించి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఏటా అక్టోబరు 7న ‘హర్గిలా డే’ను నిర్వహిస్తున్నారు. పూర్ణిమ అవిఫానా రిసెర్చ్‌ అండ్‌ కన్జర్వేషన్‌ డివిజన్‌లో సీనియర్‌ ప్రాజెక్టు మేనేజర్‌. బయాలజిస్టుగా పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు పూర్తి చేశారు. విమెన్‌ ఇన్‌ నేచర్‌ నెట్‌వర్క్‌ ఇండియాకి డైరెక్టర్‌ కూడా.
తనను ఎన్నో అవార్డులూ వరించాయి. ‘వరల్డ్‌ ఫిమేల్‌ రేంజర్‌’ అవార్డును ఇటీవల దక్కించుకున్నారు పూర్ణిమ. కేంద్రప్రభుత్వం నుంచి నారీశక్తి, లండన్‌లో ‘వైట్లీ అవార్డు’.. ఇలా బోలెడు. వివిధ దేశాల్లో పర్యటించి, అంతరిస్తున్న పక్షి జాతులపై ప్రసంగాలిచ్చారు. తన సేవలకు గుర్తుగా ఐక్య రాజ్యసమితి తాజాగా ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ద ఎర్త్‌’ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ రంగంలో ఇదే అత్యున్నత గౌరవం.

‘పురుషాధిక్య రంగంలో కన్జర్వేటర్‌గా సాగడం సవాలని తెలుసు. హర్గిలా ఆర్మీ విజయం.. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరన్న ధైర్యాన్నిచ్చింది’ అంటారీవిడ.


లైంగిక వేధింపులపై పోరాటం

‘ఎల్సా మేరీ లాంటి వాళ్లను చూసినప్పుడు గర్వంగా ఉంటుంది’.. ఈ మాటలు అన్నది  ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌! అంతలా ఆమె చేసిందేంటి?

ఎల్సా మేరీ డిసిల్వాకి ఎయిర్‌లైన్స్‌లో 20 ఏళ్ల ఉద్యోగానుభవం ఉంది. నెట్‌వర్క్‌ ప్లానింగ్‌లో వైస్‌ప్రెసిడెంట్‌గా చేశారు. 2012 దిల్లీ అత్యాచార ఘటన ఆవిడని కలచి వేసింది. ఆ తర్వాతా ఇలాంటి వార్తలే! వీటికి పరిష్కారం కనుక్కోవాలని ఉద్యోగానికి రాజీనామా చేసి ‘రెడ్‌ డాట్‌ ఫౌండేషన్‌’ ప్రారంభించారు. ఈవిడది ముంబయి. మురికివాడల మొదలు పాఠశాలలు, కళాశాలలు.. కార్పొరేట్‌ కార్యాలయాల దాకా అన్నింట్లో లైంగిక వేధింపులు, వాటిని ఎదుర్కోవడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అసలు అవి ఎదురవ్వకుండా చేయడమెలా? ఈ ఆలోచనకు ప్రతి రూపంగా సేఫ్‌సిటీ అనే ఆన్‌లైన్‌ వేదికను రూపొందించారు. దీనిలో ఎవరైనా తమ అనుభవాలను పేరు చెప్పకుండానే ప్రదేశంతో సహా పంచుకోవచ్చు. ‘పిన్నింగ్‌ ద క్రీప్‌’గా చెప్పే దీనిలో ఆ స్థలానికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువుంటే అది రెడ్‌మార్క్‌లో కనిపిస్తుంది. దీంతో అటుగా వెళ్లేవాళ్లు జాగ్రత్త పడొచ్చు.

తప్పించుకొని తిరగడం వల్ల సమస్య తీరదని ఆవిడకీ తెలుసు. తనకందిన డేటాతో పోలీసులను కలిసి ప్రమాదకర ప్రదేశాల్లో పెట్రోలింగ్‌, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, కానిస్టేబుల్‌ను ఉంచేలా చూడటం లాంటివి చేసేది. తర్వాత పోలీసులే ఆమెతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. ముంబయిలో మొదలైన ఈ సేవలు క్రమంగా ఇతర నగరాలకూ విస్తరించాయి... యాప్‌నూ తీసుకొచ్చాక విదేశాలకీ చేరాయి. 2017లో రెడ్‌ డాట్‌ ఫౌండేషన్‌ గ్లోబల్‌ను అమెరికాలో ప్రారంభించారు. మలేసియా, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, నైజీరియా, కామెరూన్‌, నేపాల్‌లలో ప్రభుత్వాలు, ఎన్‌జీఓలకు యాప్‌ రూపకల్పన, లైంగిక వేధింపుల సమస్యల పరిష్కారంలో సాయం చేస్తున్నారు. యూఎస్‌, యూకే సహా మరెన్నో దేశాల్లో సేఫ్‌సిటీ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ను ఉపయోగిస్తున్న వారెందరో. హిందీ సహా అనేక భాషల్లో ఈ సేవలు అందుతున్నాయి.

అంతర్జాతీయ పురస్కారాలూ... తన సేవలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలూ దక్కాయి. హిలరీ క్లింటన్‌తో కలిసి గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు, నీతి ఆయోగ్‌తో పాటు ఆక్స్‌ఫర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌ల నుంచీ అవార్డులు అందుకున్నారు. వరల్డ్‌ జస్టిస్‌ ఛాలెంజ్‌-22 నుంచి ‘ఈక్వల్‌ రైట్స్‌ అండ్‌ నాన్‌ డిస్క్రిమినేషన్‌’ అవార్డ్‌, భారత ప్రభుత్వం నుంచి స్త్రీ శక్తి, ఐక్యరాజ్యసమితి నుంచి ట్రస్ట్‌ లా ఇంపాక్ట్‌ సహా మరెన్నో అవార్డులు వరించాయి! ఫౌండేషన్‌ ఖర్చంతా ఆవిడదే! పురస్కారాలతో వచ్చిన మొత్తాన్నీ దీనికే వినియోగిస్తారావిడ. ఇప్పుడు టాటా ట్రస్ట్‌ సహా మరెన్నో సంస్థలు విరాళాలిస్తున్నాయి. ‘ప్రపంచ యువతను ఒకతాటి మీదకి తెచ్చి, లింగ ఆధారిత వివక్ష, వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పేలా చేస్తోన్న ఆమె సేవలు అభినందనీయం. ఇలాంటి వారిని చూసినప్పుడే భవిష్యత్‌పై సానుకూల అభిప్రాయం కలుగుతుంటుంద’ని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఓ సదస్సులో ఆమెను ప్రశంసించారు.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని