Updated : 05 Sep 2021 06:05 IST

దోమల్ని తరిమి కొడదామిలా!

దోమ... అల్ప ప్రాణేగానీ అది తెచ్చే అనర్థాలు ఎన్నో. ముఖ్యంగా వర్షాకాలంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగే వాటి సంఖ్య మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, ఎల్లో ఫీవర్‌... వంటి ప్రాణాంతక జ్వరాల బారినపడేలా చేస్తూ మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది.  దాంతో దోమ పేరు వింటేనే వణికిపోతున్నారు ప్రజలు. ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్ల మంది దోమకాటు వల్ల వ్యాధులకు గురవుతుంటే, వాళ్లలో పది లక్షల మందికి పైగా చనిపోతున్నారట. పది నుంచి నలభై కోట్ల మంది డెంగీ బారినపడుతున్నారట. అందుకే దోమకాటుని తీవ్ర సమస్యగా గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దోమల్ని చంపేందుకు ఆధునిక పరిజ్ఞానంతో వస్తోన్న రకరకాల గ్యాడ్జెట్ల తయారీని ప్రోత్సహిస్తోంది. అలాంటి వాటిల్లో కొన్ని..!


బ్యాట్‌... రెండు విధాలుగా..!

దోమల్ని వేటాడి చంపాలనుకునేవాళ్లకి బ్యాట్‌ను పోలిన మస్కిటో స్వాటర్‌ని మించిన గ్యాడ్జెట్‌ లేదనే చెప్పాలి. ఇంట్లోకి దోమ రాగానే దగ్గరకు వెళ్లి దాన్ని తాకిస్తే చాలు, అది వెంటనే చనిపోతుంది. అయితే ఇప్పుడు పనిగట్టుకుని చంపేవే కాదు, ఆ బ్యాట్‌ని ఆటోమేటిక్‌ మోడ్‌లో పెట్టి వదిలేసినా చాలు... దాన్నుంచి వచ్చే ఊదా రంగు కాంతి మస్కిటో రిపెల్లంట్‌ ల్యాంప్‌లా పనిచేస్తూ వాటిని ఆకర్షించి ఇట్టే చంపేస్తుంది. కాబట్టి గదిలో ఈ టూ ఇన్‌ వన్‌ స్వాటర్‌ని పెట్టుకుని హాయిగా నిద్రపోవచ్చు. లిథియం బ్యాటరీతో పనిచేసే ఈ రకం బ్యాట్‌లో మూడు పొరలు ఉండటం వల్ల షాక్‌ కొట్టడం లాంటివేమీ లేకుండా సురక్షితంగానూ ఉంటుంది. పైగా వీటికి ఉన్న లైట్‌ బెడ్‌ల్యాంప్‌లానూ పనిచేస్తుంది. కొన్నింటిని పోర్టబుల్‌ సైజులోకి మడిచి పెట్టుకునేలానూ డిజైన్‌ చేస్తున్నారు.


ఇండోర్‌ మస్కిటో కిల్లర్‌ ట్రాప్‌

దోమలే కాదు, టేబుల్‌మీద పండ్లు పెడితే చాలు... చిన్న చిన్న నుసుముల్లాంటివి ముసిరి చికాకుపెడతాయి. వాటన్నింటినీ ఆకర్షించి పట్టి చంపే క్యాచీ, ఫ్లోట్రన్‌, లిబా జాపర్‌, బగ్‌ జాపర్‌, వైట్‌ కెయ్‌మ్యాన్‌... వంటి ఎలక్ట్రానిక్‌ ల్యాంప్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. క్యాచీ ల్యాంప్‌నే తీసుకుంటే- అందులోని యూవీకాంతి దోమల్నీ నుసుముల్లాంటివాటినీ ఆకర్షించి లోపలకు వచ్చేలా చేస్తుంది. ఆ కాంతికి అవి దాదాపుగా చనిపోయి కిందపడి పోతాయి. అయితే కొన్ని మళ్లీ లేచి ఎగిరే ప్రయత్నం చేస్తుంటాయి. అలా చేయకుండా అడుగుభాగంలో జిగురుపూసిన కార్డుబోర్డు ముక్క ఉంటుంది. దాంతో అవి లోపలికొచ్చాక చనిపోయి కిందపడి అక్కడే అతుక్కుపోతాయి. కాబట్టి ఉదయాన్నే దాన్ని తెరిచి ఆ కార్డు బోర్డు తీసేసి మరొకటి పెట్టుకోవచ్చు. దీపంతోపాటు ఈ కార్డు ముక్కలూ ప్యాక్‌లో ఉంటాయి. ఇదే తరహాలో అనేక కంపెనీలు బ్యాటరీలతోనూ యూఎస్‌బీతోనూ ఛార్జింగ్‌తోనూ పనిచేసే లైట్లని తయారుచేస్తున్నాయి. వీటిని రాత్రిపూట పడకగదిలో పెట్టుకుంటే దోమల బాధ లేకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు. పగటివేళ కిచెన్‌లోగానీ డైనింగ్‌ దగ్గరగానీ ఆన్‌చేసి ఉంచితే నుసుముల్లాంటివి ఆ దరిదాపుల్లోకి రావు.


సోలార్‌ బజ్‌ కిల్‌

దోమల్ని చంపడానికి వాడే రిపెల్లంట్స్‌ వాసన కొందరికి సరిపడదు. అలాంటివాళ్లు రసాయనాలతో సంబంధంలేని ఈ సోలార్‌ ల్యాంప్‌తో దోమల బారి నుంచి తప్పించుకోవచ్చు. గుండ్రంగా చిన్న ఫ్యాన్‌లా ఉండే దీన్ని ఎండ తగిలేచోట కిటికీ అద్దానికి తగిలిస్తే పగటిపూట సూర్యకాంతిని గ్రహించి, రాత్రిపూట అతినీలలోహిత కాంతిని వెలువరిస్తుంది. దాంతో దీపపు పురుగుల్లాగే ఆ కాంతికి దోమలు ఆకర్షితమై దగ్గరకు వెళ్లి, ఆ కిరణాల వేడికి చనిపోతాయట. పైగా ఇది కేవలం దోమల్ని మాత్రమే కాదు, ఇతరత్రా చిన్న చిన్న కీటకాల్నీ రెక్కల పురుగుల్నీ కూడా నాశనం చేస్తుంది.


ఉప్పు తుపాకీ!

హోలీ ఆడేందుకో లేదా మొక్కలమీద పిచికారీ చేసేందుకో వాడే బొమ్మ తుపాకీల్లానే ఉంటుందీ మస్కిటో గన్‌. అయితే దీనికి పై భాగంలో ఉన్న అరని తెరిచి అందులో టేబుల్‌ సాల్ట్‌ వేసి మూత పెట్టాలి. ఆ తరవాత దాన్ని పిచికారీ గన్‌ మాదిరిగానే పట్టుకుని దోమలూ ఈగలూ బొద్దింకలూ పురుగులూ కనిపించిన చోటల్లా వాటిమీద ఉప్పు పడేలా పేల్చితే ఆ తాకిడికి అవి కాస్తా చచ్చిపోతాయి. దీనికి బ్యాటరీలూ రసాయనాలతో ప్రమేయం లేదు. కాబట్టి పిల్లలూ సురక్షితంగా పట్టుకోవచ్చు. పైగా అందులో ఉప్పుని ఒకసారి నింపితే 50 సార్లు షూట్‌ చేయవచ్చట. కాలిఫోర్నియాకి చెందిన స్కల్‌ కంపెనీ చేసిన ఈ గన్‌ని పోలినవి ఇప్పుడు చాలానే వస్తున్నాయి. ఎక్కడైనా గోడమీద పురుగో దోమో కనిపిస్తే పట్టుకునే బగ్‌ వ్యాక్యూమ్‌లూ ఉన్నాయి.


బ్రేస్‌లెట్‌తో దూరం... దూరం...

ఇంట్లో అయితే ల్యాంపులో రిపెల్లంట్లో వాడుతుంటాం. కానీ వాటిని వెంటేసుకుని తిరగలేం కదా. అలాంటప్పుడు పనికొచ్చేవే ఈ యాంటీ మస్కిటో బ్రేస్‌లెట్‌ కమ్‌ వాచ్‌లు. ఇవి చేతికి ఉంటే వాటి నుంచి వచ్చే అల్ట్రాసోనిక్‌ వేవ్స్‌ వల్ల దోమలు దూరంగా వెళ్లిపోతాయట. వీటితోపాటు నిమ్మ, యూకలిప్టస్‌, జెరానియల్‌, సిట్రొనెల్లా గాఢతైలాల్ని నింపి రూపొందించిన బ్యాండులూ మార్కెట్లో ఉన్నాయి. ఆ బ్యాండుల్లోంచి వచ్చే వాసన కారణంగా అవి దగ్గరకు రావు. నిద్రపోయేటప్పుడూ వీటిని చేతికి పెట్టుకోవచ్చు.


థెర్మాసెల్‌  రిపెల్లర్‌

ఇంట్లో అయితే ల్యాంపుల్లాంటివి పెట్టుకుంటాం. కానీ బయటకు వెళ్లినప్పడు దోమల్ని ఎలా తప్పించుకోగలం. ఎక్కడికి అంటే అక్కడికి ల్యాంప్‌లూ బ్యాట్‌లూ తీసుకెళ్లలేం కదా. అదీగాక తరచూ పర్యటించేవాళ్లు ప్రకృతి దృశ్యాలు చూడ్డానికి అడవుల్లోకి వెళుతుంటారు. అక్కడ దోమల బాధ మరీ ఎక్కువ. ఒక్క దోమ కుట్టినా చాలు, డెంగీ రావడానికి. అలాంటప్పుడు-ఈ థెర్మాసెల్‌ ఎమ్‌ ఆర్‌ పోర్టబుల్‌ మస్కిటో రిపెల్లంట్‌ గానీ దగ్గర ఉంటే మన చుట్టూ సుమారు 15 అడుగుల వరకూ రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఇతర రిపెల్లంట్లలా దీనికి వాసన ఉండదు. రసాయనాలతో కూడిన లోషన్లు రాసుకోవడం కన్నా దీన్ని వెంట ఉంచుకుంటే నిశ్చింతగా పర్యటించవచ్చు. అలాగే ఇంట్లో వాడుకునేందుకు వీలుగా ఈ కంపెనీ తయారుచేస్తోన్న పేషియో షీల్డ్‌ రేడియస్‌ జోన్‌, పేషియో షీల్డ్‌ ల్యాంతర్‌... వంటి మరెన్నో ఉపకరణాలూ వస్తున్నాయి.


అల్ట్రాసోనిక్‌ పెస్ట్‌ రిపెల్లర్‌

దోమల్ని చంపేవాటితోపాటు వాటిని చంపకుండా మనదగ్గరకు రానివ్వని ఉపకరణాలూ చాలానే ఉన్నాయి. అవే అల్ట్రాసోనిక్‌ మస్కిటో రిపెల్లంట్స్‌. ఛార్జింగ్‌ లేదా బ్యాటరీతో పనిచేసే వీటినుంచి వెలువడే అల్ట్రా సోనిక్‌ శబ్దానికి అవి దరిదాపుల్లోకి రావట. వీటిల్లో రకరకాల ల్యాంప్‌లతోపాటు కీచెయిన్‌లూ వస్తున్నాయి. తోటలోనో పెరట్లోనో కాసేపు తిరగాలనుకున్నప్పుడు ఈ కీచెయిన్‌ని వేలుకి తగిలించుకుంటే, అందులోనుంచి వెలువడే శబ్దతరంగాల్ని విన్న దోమలు కనీసం ఆరు అడుగుల దూరం ఉంటాయట. ఎందుకంటే గబ్బిలాల మాదిరిగానే దోమలు కూడా సూక్ష్మ శబ్దాల్ని వినగలవు. పైగా ఈ కీచెయిన్‌లో చిన్నలైటు కూడా ఉంటుంది కాబట్టి అది టార్చ్‌లానూ ఉపయోగపడుతుంది.


దోమ కుట్టిందా... అయితే...

న్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు దోమ కాటు బారినపడుతూనే ఉంటాం. ఆ కాటు ప్రభావం శరీరంమీద లేకుండా ఉండేందుకు తోడ్పడేదే ఈ బైట్‌ ఎవే. అలర్జీలు ఉన్నవాళ్లకి దోమ కుట్టినచోట ఎర్రగా అయిపోవడం, వాపు రావడం జరుగుతుంది. అప్పుడు కుట్టినచోట ఈ పరికరం మూతి భాగాన్ని ఉంచి బటన్‌ ఆన్‌ చేస్తే దాన్నుంచి వచ్చే వేడి కంపనాల వల్ల నొప్పి తగ్గుతుంది. అదెలా అంటే- నొప్పీ, దురదకీ కారణమయ్యే ఎంజైమ్‌లు ఆ వేడికారణంగా విచ్ఛిన్నం అవుతాయి. కేవలం దోమ అనే కాదు, తేనెటీగ, కందిరీగ... వంటి కీటకాలు కుట్టినప్పుడు వచ్చే నొప్పినీ దురదనీ మంటనీ కూడా బైట్‌ ఎవే తగ్గిస్తుందట. పైగా ఇవి కుట్టినచోట వెంటనే దీన్ని పెడితే వాపు, దురద... వంటివి అసలే రాకుండా ఉంటాయట. బ్యాటరీతో పనిచేసే  దీన్ని బ్యాగులోనో జేబులోనో పెట్టుకుని వెంట తీసుకెళ్లొచ్చు.


ఇవే కాదు, గుమ్మాలకీ కిటికీలకీ తగిలించుకునే రోలింగ్‌ మస్కిటో స్క్రీన్‌లూ; ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ టెక్నాలజీతో పనిచేసే యాంటీ మస్కిటో ఆప్‌లూ; దోమలతోపాటు ఈగల్నీ పట్టుకునే రివాల్వింగ్‌ ఎలక్ట్రానిక్‌ ట్రాప్‌లూ... ఇలా మరెన్నో రకాల ఉపకరణాలు వస్తున్నాయి. ఇక, దోమతెరలతోపాటు నిమ్మ, యూకలిప్టస్‌, సిట్రొనెల్లా నూనెలతో చేసిన క్యాండిల్సూ లోషన్లూ స్ప్రేలూ, పైనుంచి కిందివరకూ వేసుకునే యాంటీ మస్కిటో వేరబుల్‌ సూట్‌లాంటివాటిని ఇప్పటికే చాలామంది వాడుతున్నారు. కాబట్టి వాటితోపాటు నచ్చిన గ్యాడ్జెట్లనీ వాడటం ద్వారా కొంతవరకైనా దోమకాటు నుంచి తప్పించుకోగలం... వైరల్‌ జ్వరాల బారిన పడకుండా ఉండగలం..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని