Updated : 23/01/2022 07:33 IST

ఓ చిట్కా..సెలబ్రిటీల్ని చేసింది!

యూట్యూబ్‌ అంటే యువతకే అన్న నిర్వచనం మార్చారు వీళ్లు. వాళ్లతో పోటీ పడుతూ తక్కువ వ్యవధిలోనే  గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమందికి బంధువులయ్యారు. అంత వరకూ ఇల్లే ప్రపంచంగా ఉన్న ఈ గృహిణులు తమ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో  సెలబ్రిటీలై పోయారు.. కనకదుర్గ, విజయలక్ష్మి. ఇలా చెబితే ఎవరబ్బా అనుకోవచ్చేమో. పెరవలి సిస్టర్స్‌ అనండి ఠక్కున గుర్తుపట్టేస్తారు. వసుంధర పలకరించగా.. తమ ప్రయాణాన్ని పంచుకున్నారిలా!

నేను కనకదుర్గ. అక్క విజయకీ నాకూ అనుబంధమెక్కువ. వయసు తేడా తక్కువే. దీంతో పేరుతోనే పిలుస్తా. మాది గుంటూరు. మాకు ఇద్దరమ్మాయిలు. మా వారు దాసరి శ్రీనివాసరావు వ్యాపారి. అక్కకి బాబు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఓసారి బెంగళూరు వెళ్లినప్పుడు ఓ అమ్మాయిని చూశా. చాలా బాగుంది కానీ ముఖమంతా మొటిమలు. మా అమ్మాయికి అలా వచ్చినపుడు ఓ చిట్కా బాగా పనిచేసింది. దాన్ని చెబుతానంటాన్నేను. మా అమ్మాయేమో ‘అలా చెప్పకూడదు. ఏమైనా అనుకుంటార’ని. నాకేమో తెలిసీ చెప్పలేకపోయాననే బాధ. అదిచూసి తను ‘నీకంతలా చెప్పాలనుంటే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ చేసిస్తా. దానిలో అయితే చాలామంది తెలుసుకుంటార’ంది. అది నా మనసులో అలా ఉండిపోయింది. తిరిగొచ్చాక విజయ చేతిలో ఫోన్‌ పెట్టి వీడియో తీయమన్నా. తనేమో ‘నాకు ఫొటోలు తీయడమే రాదు, వీడియో ఎలా తీయను?’ అంది. ఎలా తీయాలో చెప్పి చేతిలో పెట్టా. నిజానికి నాకు తెలియని వాళ్లతో మాట్లాడాలంటే బెరుకు. తనే ఎవరితోనైనా బాగా కలిసిపోతుంది. అలాంటి నేను తనని ప్రోత్సహించా. ‘నన్ను వీడియోల్లో కనిపించమని బలవంతపెట్టొద్దు’ అన్న షరతుకు ఒప్పుకున్నాకే తీసింది. మా నాయనమ్మ చెప్పిన ఆ మొటిమలకు చిట్కానే మొదటి వీడియో. తీశాక మా చిన్నమ్మాయికి పంపి, పెట్టమన్నా. అలా 2020 ఫిబ్రవరిలో ‘పెరవలి సిస్టర్స్‌’ మొదలైంది. పెళ్లయిన కొత్తల్లో మా పిల్లలు వంటల దగ్గర్నుంచి ఇంటి పని వరకు ఏ సందేహమొచ్చినా ఫోన్‌ చేసి అడిగేవాళ్లు. ఇప్పుడెంతోమంది అమ్మాయిలు ఓ పక్క ఉద్యోగం, ఇల్లూ రెంటినీ సమన్వయం చేసుకుంటున్నారు. వాళ్లకి ఉపయోగపడేలా సులువుగా చేసుకునే వంటలు, పనులవి పెట్టేవాళ్లం. మూణ్ణెళ్లలోనే వీక్షణలు పెరిగాయి. సిల్వర్‌ బటన్‌, క్రియేటర్‌ ఆఫ్‌ ద రైజ్‌ వచ్చాయి. వాటితోపాటే ఆదాయమూ. అరిసెల తయారీ, జుట్టుకి ఉల్లినూనె వంటివాటిని ఎక్కువమంది ఆదరించారు. మొదట్లో కొంత కంగారు పడ్డా. ఆ బిడియం వీడియోల్లోనూ కనిపించేది. కానీ అందరూ కామెంట్లలో ఆప్యాయంగా పలకరించడం, నచ్చాయని చెప్పడం చూశాక సులువుగా మాట్లాడేస్తున్నా. ఏడాదిగా పచ్చళ్లు, పిండివంటలు, పొడులు చేసిస్తున్నాం. నిజానికి ఈ ఆలోచన మాకు లేదు. మా పిల్లలకు చేసి పంపుతాం కదా. ఒకమ్మాయి తనకూ తెప్పించమని మా అమ్మాయిని అడిగిందట. పాపం ఇంటికి దూరంగా ఉంటోందని చేసిచ్చా. అలా ఒకర్నుంచి మరొకరు అడుగుతుండేవారు. అలా చిన్న వ్యాపారమైంది. విదేశాలకీ పంపుతున్నాం. ఇలా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నామనే సంతృప్తి.

చాలామంది బాధ్యతలు అయిపోయి, విశ్రాంతి సమయంలో చేస్తున్నామనుకుంటారు. కానీ ఇప్పుడే మాకు ఎక్కువ బాధ్యతలు. పిల్లలకి ఉద్యోగాలు. దాంతో వాళ్ల పిల్లల్ని మేమే చూసుకుంటాం. ఉదయం 4 గం.లకే మా రోజు ప్రారంభమవుతుంది. వాళ్లు పడుకున్నాక వీడియోలు చేస్తుంటాం. ఒక్కోసారి అర్ధరాత్రిళ్లూ చేసిన సందర్భాలున్నాయి. మొదట్లో ఈ వయసులో అవసరమా అన్నవాళ్లున్నారు. ఇప్పుడే వాళ్లే దేశవిదేశాల్లో భలే పేరు తెచ్చుకున్నారు అంటున్నారు. ఎక్కడికివెళ్లినా పిన్ని, పెద్దమ్మా అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. విజయ వీడియోల్లో కనిపించింది ఒకట్రెండే. తననీ ముఖానికి మాస్క్‌ ఉన్నా గుర్తుపట్టేస్తున్నారు. ఇక్కడేకాదు ఓసారి బెంగళూరులోనూ ఇదే పరిస్థితి. దీన్ని చూసి మా అల్లుడు ‘ఇక మీతో బయటికి రాలేం అత్తయ్యా’ అని నవ్వేశారు. విజయ ఆపరేషన్‌, అమ్మ చనిపోయినప్పుడు వాళ్లు మా పట్ల చూపిన ప్రేమ మర్చిపోలేం. ఇప్పటివరకూ 393 వీడియోలు చేశాం. వాటికి ఏడుకోట్లకుపైగా వీక్షణలున్నాయి. నాలుగు లక్షల ముప్ఫైవేలకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారు. వాళ్లందర్నీ కుటుంబంగానే భావిస్తాం. మా పిల్లలూ మమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. మా స్ఫూర్తితో, సలహా పొంది యూట్యూబ్‌లోకి వచ్చినవాళ్లూ ఉన్నారు. ఇవన్నీ చూసినపుడు కొంత గర్వంగా అనిపిస్తుంది. ఈ వయసులో యువతతో పోటీపడుతూ వాళ్ల ఆదరణ పొందడం గొప్పేగా మరి!Advertisement

మరిన్ని