Published : 17/02/2022 00:34 IST

సాఫ్ట్‌వేర్‌ వదిలి.. టైలరింగ్‌ అందుకుంది!

‘మంచి ఉద్యోగం కాదని.. టైలరింగ్‌ షాప్‌ పెడతావా?’ తన ఆలోచనను పంచుకున్నప్పుడు సుస్మిత లకాకులకు ఎదురైన ప్రశ్న ఇది. కానీ తన ఆలోచనపై తనకు నమ్మకం ఎక్కువ. అందుకే.. టైలరింగ్‌కు సాంకేతిక సేవలు జోడిస్తూ క్లౌడ్‌ టైలర్‌ ప్రారంభించారు. ఏడాది తిరిగేటప్పటికది లక్షల వ్యాపారమవడమే కాక కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. ఈ యువ వ్యాపారవేత్త ఏం చెబుతున్నారో చదవండి...


జీవితంలో ఏదీ సులువుగా రాదు. పట్టుదల, చేసి చూపాలన్న తపన ఉంటే తప్ప ముందుకు సాగలేం. మహిళల విషయంలో వెనక్కిలాగే వాళ్లే ఎక్కువ. చిన్న తప్పు చేసినా నీకు చేతకాదు.. అనేవాళ్లే ఎక్కువ. కాబట్టి, తప్పు జరిగినా నిరుత్సాహపడొద్దు. ఎంచుకున్న దానిపై నమ్మకం ఉంటే వాటిని పాఠాలుగా చేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. అప్పుడే ఎంతోమంది మీ వెనక నిలబడతారు. నేను నమ్మి, ఆచరిస్తున్న సూత్రమిది.

మా కుటుంబంలో అందరూ ప్రభుత్వోద్యోగులే. అందుకే నా ఆలోచన వాళ్లని కొంత కంగారుపెట్టింది. అలాగని కాదనలేదు. ‘సరే ప్రయత్నించి చూడు.. మా వంతు మేమూ సాయంమందిస్తా’మన్నారు. నా ప్రయత్నానికి అదే పెద్ద బలం. అమ్మ సునంద, నాన్న లకాకుల బాలకృష్ణ, ఎస్‌బీహెచ్‌లో మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. నేను పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌. మావారు రుద్రప్రతాప్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. నేను బీసీఏ చదివాక, బిట్స్‌ పిలానీ నుంచి ఎం.ఎస్‌., ఐఐఎం కోల్‌కతా నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ పూర్తిచేశా. విప్రో, డెల్‌, క్వాంటమ్‌ సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గానూ చేశా. కానీ నాకెప్పుడూ సొంతంగా ఏదైనా చేయాలనే కోరిక. పార్ట్‌టైమ్‌గా ఓ ప్రొడక్షన్‌ సంస్థను ప్రారంభించి, టీవీ ప్రోగ్రామ్‌లూ చేశా. అటు ఉద్యోగం, ఇటు ప్రొడక్షన్‌తో కుదరక వదిలేశా. అలాగని ఆలోచనలు మానలేదు.

2020లాక్‌డౌన్‌ సమయానికి నాకు చిన్నపాప. మేముండేది కోకాపేటలో. రెడీమేడ్‌ కంటే సొంతంగా దుస్తుల్ని కుట్టించుకోవడం అలవాటు నాకు. కానీ కొవిడ్‌ సమయంలో చాలా ఇబ్బందైంది. పాపతో కుదిరేది కాదు. అప్పుడు ‘దీన్నీ ఎవరైనా ఆన్‌లైన్‌ చేయొచ్చుగా!’ అనుకున్నా. ఇంటికే వచ్చి కొలతలు తీసుకుని కుట్టిచ్చే ఏర్పాటేమైనా ఉందా అని నెట్‌లో వెతికా, ఏమీలేవు. అప్పుడు నేనే ప్రయత్నిస్తే! అన్న ఆలోచన వచ్చింది. మావారితో చెబితే, యాప్‌ అయితే బాగుంటుందన్నారు. టైలరింగ్‌ అంశాలతోపాటు కటింగ్‌, మాస్టర్స్‌ ఎంపిక అన్నింటినీ పరిశోధన చేశాక యాప్‌ ఆధారిత బొటిక్‌ ప్రారంభిద్దామనుకున్నాం. మా ఆలోచన నచ్చి మావారి స్నేహితుడొకరు పెట్టుబడితో ముందుకొచ్చారు. అలా 2020 డిసెంబరులో ‘క్లౌడ్‌ టైలర్‌’ మొదలైంది. ఒక డెవలపర్‌, ఇద్దరు కటింగ్‌, ఫిటింగ్‌ మాస్టర్లతో ప్రారంభిస్తే.. ఇప్పుడు 3డీ డిజైనింగ్‌, యూవీ, యూఎక్స్‌ డెవలపింగ్‌కు ఓ టీమ్‌, ఫ్యాషన్‌ డిజైనర్లు, టైలర్స్‌ మాస్టర్స్‌ మొత్తంగా 30 మందికిపైగా పనిచేస్తున్నారు.

కొవిడ్‌లో ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని స్థితి. దీంతో చాలామంది మా సేవల్ని వినియోగించుకున్నారు. మొదట అపార్ట్‌మెంట్‌ సముదాయం.. వాళ్ల నుంచి స్నేహితులకు... ఇలా వినియోగదారులు పెరుగుతూ వచ్చారు. నేను చేసిందల్లా వివరాలతో ఓ ఫ్లయర్‌ను రూపొందించడమే. ఇతర నగరాలతోపాటు విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. ఏడాదికి రూ.80 లక్షల వరకూ వ్యాపారం చేస్తున్నాం. ఇటీవలే 35 నాట్‌ వెంచర్స్‌ సంస్థ, మరో ఇద్దరు మిలియన్‌ డాలర్ల (రూ.7.5కోట్లు) పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. మొదట్నుంచీ మధ్యతరగతి వాళ్లని దృష్టిలో పెట్టుకొనే చేశా. ధరలూ యాప్‌లో కనిపిస్తాయి. ఎవరైనా ఆప్‌లో లాగిన్‌ అయ్యి, అవసరమైన వివరాలు చేరిస్తే చాలు. వాయిస్‌ ఫైల్‌నూ పంపొచ్చు. ఒకసారి సబ్‌మిట్‌ చేశాక.. అది ఒక ఫ్యాషన్‌ డిజైనర్‌కి అసైన్‌ అవుతుంది. వాళ్లు నేరుగా వినియోగదారులకి ఫోన్‌ చేసి అన్ని అంశాలూ చర్చిస్తారు. అవసరమైతే సూచనలిస్తారు. అంతా సరే అన్నాక కుట్టించి పంపిస్తాం. మొదట్నుంచీ వినియోగదారుల సంతృప్తి, సకాలంలో అందించడంపైనే దృష్టి పెట్టా. ఎప్పటికప్పుడు కస్టమర్లతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్‌ తీసుకునేదాన్ని. దాని ఆధారంగా సేవల్ని మెరుగుపరచుకుంటూ వస్తున్నా. ఇప్పుడు చాలామంది సూచనల స్థానంలో ‘నీకు ఏది బాగుంటుందనిపిస్తే అది చెయ్‌’ అంటున్నారు. వినియోగదారులు ఇబ్బంది పడేది సమయానికి అందించే విషయంలోనే! అందుకే దీనిపైనా దృష్టిపెట్టా. ఇవే నా విజయానికి కారణమనుకుంటున్నా. దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాం. ఏప్రిల్‌ చివరకల్లా దిల్లీ, చెన్నై సహా ఎనిమిది చోట్ల ప్రారంభించనున్నాం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని