Updated : 14/12/2021 06:00 IST

విశ్వసుందరి మన హర్నాజ్‌

‘అమ్మా.. నువ్వు గర్వపడేలా చేస్తా!’.. విశ్వసుందరి పోటీలకు వెళ్లేముందు హర్నాజ్‌ సంధు తన తల్లికి ఇచ్చిన మాట ఇది. 79 దేశాల సుందరీమణులను వెనక్కి నెట్టి మరీ ఆ మాటను నిలబెట్టుకొంది. ఇప్పుడు దేశమంతా ఆమె మాటను తనకే అప్పజెబుతోంది.. ‘హర్నాజ్‌ మమ్మల్ని గర్వపడేలా చేశా’వని! ఒకటా రెండా.. ఈ కిరీటాన్ని తిరిగి మన దేశానికి తేవడానికి 21 ఏళ్లు పట్టింది మరి! ఆ నిరీక్షణకు తెరదించి దేశకీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఆమె ప్రయాణం ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం!

ర్నాజ్‌ది పంజాబ్‌లోని గుర్‌దాస్‌పుర్‌. అమ్మ డాక్టర్‌ రవీందర్‌ కౌర్‌ గైనకాలజిస్ట్‌, నాన్న ప్రీతమ్‌ సింగ్‌ సంధు. విద్యాభ్యాసమంతా చండీగఢ్‌లో సాగింది. బీఏ (ఐటీ) చేసి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ చదువుతోంది. తనకి చిన్నప్పటి నుంచే అందాల పోటీలపై ఆసక్తి. అయితే సన్నగా, బక్కపల్చగా ఉండే తనని అందరూ ఎగతాళి చేసేవారు. అయినా కలల కెరియర్‌లోకి అడుగు పెట్టడానికి తను వెనుకాడలేదు. చదువు కొనసాగిస్తూనే స్థానిక అందాల పోటీలకు హాజరయ్యేది. తన 17వ ఏట ‘మిస్‌ చండీగఢ్‌’ పోటీల్లో టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌, 2018లో మిస్‌ మాక్స్‌ ఎమర్జింగ్‌ స్టార్‌, 2019లో మిస్‌ ఇండియా పంజాబ్‌ కిరీటాలను గెల్చుకుంది. ఇంకేముంది... ఆ ఉత్సాహంతో మోడలింగ్‌, సినీ రంగాల్లోనూ కాలుమోపింది. ‘యారా దియా పు బారన్‌’, ‘బాజ్‌ జీ కుట్టంగే’ చిత్రాల ద్వారా మెప్పించింది.

ఛక్‌ దే ఫట్టే..  విశ్వసుందరి కిరీటాన్ని గెలిచాక హర్నాజ్‌ నేటి తరాన్ని ఉద్దేశిస్తూ పిడికిలి బిగించి ‘ఛక్‌ దే ఫట్టే, ఇండియా’ అంటూ నినదించింది. మొగలాయిలపై పంజాబీల పోరాటంలో పుట్టిన నినాదమిది. మనం సాధించగలం అనర్థం. ఇదే స్ఫూర్తితో దేశాన్ని విజయ పథంలో నడుపుదామనే సందేశాన్నిచ్చింది. తుది పోటీల్లో ఇచ్చిన జవాబుల్లోనూ ఇదే ఆత్మవిశ్వాసాన్ని చాటింది.

‘నేటి యువత ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఎలా జయించాలి’ అన్న న్యాయనిర్ణేతల ప్రశ్నకు హర్నాజ్‌..

‘తమని తాము నమ్మకపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గడమే తీవ్ర ఒత్తిడికి కారణం. నీకు నువ్వే ప్రత్యేకం. అదే నిన్ను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. ఎదుటివారితో పోల్చుకోవడం మానెయ్‌. సమాజంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడు. అప్పుడే నీకేం కావాలో తెలుస్తుంది. నీకు నువ్వే వాయిస్‌గా మారాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే లీడర్‌వి. నన్ను నేను నమ్ముతా. అందుకే ఈరోజు ఈ వేదికపై నిలబడ్డా’ అని సమాధానమిచ్చింది. ఇదే న్యాయనిర్ణేతలను మెప్పించడంలో కీలక పాత్ర పోషించింది.

మొదటిసారి... ఈసారి మిస్‌ యూనివర్స్‌-2021 పోటీలను ఇజ్రాయెల్‌ తొలిసారిగా నిర్వహించింది. ఆ దేశ పర్యాటక శాఖతో కలిపి నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు రూ.16కోట్లు ఖర్చు చేశారు. 79 దేశాల పోటీదారులు పాల్గొనగా.. పెరుగ్వేకు చెందిన నైడా ఫెరీరా, హర్నాజ్‌ ఫైనల్స్‌కు చేరారు. ఎనిమిది మందితో కూడిన సెలక్షన్‌ కమిటీలో మాజీ మిస్‌ యూనివర్స్‌ ఇండియా (2015) ఊర్వశి రౌతెలా కూడా ఒకరు. గతంలో భారత్‌ నుంచి సుస్మితాసేన్‌ (1994), లారాదత్తా (2000) మాత్రమే విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. 21 ఏళ్ల తర్వాత హర్నాజ్‌ వారి సరసన స్థానాన్ని సంపాదించింది.

ప్రశంసల జల్లులు..  హర్నాజ్‌ విజయం ఖాయమవ్వగానే స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. నాన్న ప్రీతమ్‌, అమ్మ కౌర్‌ ఉద్వేగంగా, గర్వంగా ఉందన్నారు. తను రాగానే తనకిష్టమైన ‘మక్కీ ది రోటీ’ చేసిపెడతానంటోంది వాళ్లమ్మ. గతంలో అంతర్జాతీయ అందాల కిరీటాలు గెల్చుకున్న సుస్మితాసేన్‌, లారా దత్తా, దియా మిర్జా, ప్రియాంక చోప్రాతోపాటు నటీమణులు కరీనా కపూర్‌, శిల్పాశెట్టి, రవీనా టాండన్‌, వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సహా ఎందరో ప్రముఖులు ‘21 ఏళ్ల తర్వాత ఈ కిరీటాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచావంటూ..’ అభినందనలు కురిపించారు.


ఆమే స్ఫూర్తి...

‘చిన్నప్పటి నుంచి నా కల, ఆశయం మోడలింగ్‌, అందాల పోటీలే. అమ్మ నా ఆలోచనలకు మెరుగులు దిద్దుతూ నా కలలకు రూపకర్తగా నిలిచింది. నా ప్రతి లక్ష్యాన్నీ ఛేదించడానికి తను నిచ్చెనలా నిలవడం వల్లే నేనీ రోజు విజేతగా మీ ముందు నిలిచా. నా ఆత్మవిశ్వాసానికి కారణం, స్ఫూర్తి అమ్మే. ఇతరులకు సాయం చేయాలనే గుణాన్నీ తన నుంచే నేర్చుకున్నా. ‘స్మైల్‌ ట్రైన్‌’ ద్వారా అంతర్జాతీయంగా చిన్నారుల్లో గ్రహణ మొర్రికి ఉచిత శస్త్రచికిత్సలు చేయించడానికి సాయం అందించడంతోపాటు అవగాహననూ కలిగిస్తున్నా. పేద చిన్నారుల సంక్షేమానికి విరాళాలు సేకరించే ఎన్జీఓలతో కలిసి పనిచేస్తున్నా. వంట చేయడమంటే చాలా ఇష్టం. నచ్చిందల్లా తింటా, తగ్గట్లుగా వర్కవుట్లు చేస్తా. గుర్రపు స్వారీ కూడా చేస్తా’.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని