Updated : 06/08/2021 17:10 IST

తన ప్రవర్తన ఇబ్బందిపెడుతోంది...

మా పాపకు పదమూడేళ్లు. బాగా చదివేది. లాక్‌డౌన్‌లో ఫోన్‌లో గేమ్స్‌ ఆడటానికి అలవాటుపడింది. నేను పక్కన కూర్చుని ఏమైనా చెప్పబోతే గదిలోకెళ్లిపోతోంది. ఒక్కగానొక్క కూతుర్ని చక్కగా పెంచాలని ప్రభుత్వోద్యోగం కూడా వదిలేశా. ఈ పరిస్థితుల్లో కుంగుబాటుకు గురై మందులు వాడుతున్నాను. పాపనెలా మార్చుకోవాలో తెలియడం లేదు.

- ఓ సోదరి, తాడేపల్లిగూడెం

టీనేజ్‌లో కొత్తవి తెలుసుకోవాలని, గొప్పలు చెప్పుకోవాలని ఉంటుంది. బయటకు వెళ్లక పోవడం, స్నేహితులను కలవకపోవడం, ఆన్‌లైన్‌ క్లాసులు కొద్దిసేపే ఉండటం, గారాబంతో పని చెప్పకపోవడం - లాంటి కారణాలతో పాపకు సమయం మిగులుతోంది. వ్యాపకాలతో తన ఎనర్జీ ఉపయోగించే వీల్లేదు. సరదాలూ లేక, వేరే బాధ్యతలూ లేక ఉన్న సమయాన్ని గాడ్జెట్స్‌కి కేటాయిస్తోంది. దీన్ని బిహేవియరల్‌ ఎడిక్షన్‌ అంటారు. అంటే ఏదైనా రిపీటెడ్‌గా చేస్తే వాటికి బానిసలవుతారు. కాదన్నప్పుడు గదిలోకెళ్లిపోతోందంటే మానిప్యులేటెడ్‌ బిహేవియర్‌. ఒక్కపిల్ల అని జాలితోనో భయంతోనో లొంగిపోతారు కనుక మంకుతనం చూపుతోంది. ఈ అడిక్షన్ని తగ్గించాలంటే బొమ్మలేయడం, పాటలు పాడటం, కుట్లు అల్ల్లికలు లాంటి వేమైనా చేసేలా ప్రేరేపించాలి. బలవంతపెడుతున్నట్లు కాకుండా ఆమె తెలివితేటలకి ఇలాంటి వాటి మీద ధ్యాసపెడితే ఎంత మంచిదో చెప్పాలి. ఉదయాన్నే వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. ఇంటి పనులు నేర్చుకుంటే విదేశాలకు వెళ్లినా ఉపయోగమంటూ చేయించాలి. ఆ పనులు చేస్తూ చదువుకుంటుంది. ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడమనండి. ఆఖర్లో ఆమెకి ఇష్టమైన గేమ్స్‌, వీడియోలు ఇన్సెంటివ్‌ అన్నమాట. పనులు చేస్తూ అందులో నైపుణ్యం పొందడాన్ని ప్రశంసించండి. దీనివల్ల స్ఫూర్తి కలుగుతుంది. పనుల్లో ఆసక్తి, నైపుణ్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతాయి. ఒకవేళ మొరాయిస్తే చైల్డ్‌ సైకియాట్రిస్టును సంప్రదించండి. వాళ్లు అమ్మాయి తత్వం, ఆశలూ ఆశయాలూ స్టడీచేసి మార్పు తెచ్చే టెక్నిక్స్‌ చెప్తారు. ఇదంతా టీనేజ్‌ ప్రభావం. ఈ దశ దాటుకుని ముందుకెళ్తారు.

మీకు సంబంధించిన ప్రశ్నను అడగడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్