Published : 02/02/2022 21:33 IST

అక్రమ సంబంధాలు పెట్టుకున్న నా భర్తను మార్చేదెలా?

మేడమ్.. నా వయసు 35 సంవత్సరాలు. నాకు పెళ్త్లె 12 ఏళ్లవుతోంది. 10 సంవత్సరాల పాప కూడా ఉంది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పాపని చదివించుకుంటున్నాను. నా భర్త ఇంట్లో కనీస అవసరాలు తప్ప మిగతా ఖర్చులు పట్టించుకోడు. మా పాపకి ఏడాది వయసున్నప్పుడే అతనికి వేరే అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు నేను అతనితో శారీరకంగా దూరంగా ఉన్నా. 'నాతో ప్రేమగా ఉంటే నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోయి నీతో ఉండడానికి ప్రయత్నిస్తా' అని చెప్పాను. కానీ నా భర్త.. తాను తప్పు చేశానన్న బాధ ఏమాత్రం లేకుండా పైగా మరిన్ని ఎక్కువ ఎఫైర్స్ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. బంధువులందరితో 'నా భార్య నన్ను దూరం పెట్టింది.. అందుకే వేరే ఆడవాళ్లతో ఉండాల్సి వస్తోంది..' అని ఓపెన్‌గా చెప్పుకుంటున్నాడు. నేను ఆయనకు కరక్ట్ కాదని, అందుకే ఇన్ని సంవత్సరాలు దూరంగా పెట్టానని చెప్పుకుంటున్నాడు. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త తరఫు వాళ్లు కూడా నాదే తప్పంటున్నారు.

మా మొదటి మూడు సంవత్సరాల కాపురంలో నా భర్త ఏనాడూ నాతో సరిగ్గా ఉండలేదు. అలాంటిది నా భర్త బయటి ఆడవాళ్లతో ఎంజాయ్ చేస్తుంటే అతనితో సాధారణ జీవితాన్ని ఎలా గడపాలో అర్థం కావడం లేదు. ఒకసారి నా భర్త వేరే మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో నేను విన్నాను. నేను జాబ్‌కు వెళ్తుండడంతో పాప ఒక్కర్తే ఉండాల్సి వస్తోంది. దాంతో ఒంటరిగా ఫీలవుతోంది. నేను ఇంకో బేబీని ప్లాన్ చేసుకోవాలా? ఇప్పటికే 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మళ్లీ పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది? నన్ను నేను ఎలా మార్చుకోవాలి? కనీసం నా భర్తను చూస్తే నాకు దగ్గరకు తీసుకోవాలనే ఫీలింగ్ కూడా కలగడం లేదు. నా ఆలోచనలు, తప్పు వల్ల నా పాప బాధపడకూడదు. ఈ సమస్యలతో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను. నాకు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. దయచేసి సలహా ఇవ్వగలరు.

జ: మీ భర్త చేసిన తప్పుల వల్ల మీకు వైరాగ్య భావం కలిగిందని స్పష్టమవుతోంది. అతను తప్పు చేసి అది మీరు చేస్తున్నట్టుగా చిత్రీకరించి.. తిరిగి అదే తప్పును తను చేస్తున్నాడు. అది చెల్లుబాటు చేసుకునే ప్రయత్నం కూడా చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తాను చేస్తోన్న పనులు అతనికి ఆరోగ్య పరంగానూ మంచివి కాదు. అలాగే అతను తనను తాను మోసం చేసుకుంటూ మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడని స్పష్టమవుతోంది. నిజంగా మీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా మీ బంధం దృఢపరచుకోవడానికి ఇద్దరూ కలిసి కౌన్సెలింగ్‌కి వెళ్లాల్సి ఉంటుంది.

మీ భర్త విషయంలో మీకు నమ్మకం లేనప్పుడు.. అతను మిమ్మల్ని తప్పు పడుతూ తన అవసరాలను పెడదారిలో తీర్చుకుంటున్నప్పుడు.. అతనితో మీకు సంబంధం పెట్టుకోవడానికి మీ మనసు అంగీకరించనప్పుడు.. భవిష్యత్తులో మరో బిడ్డ కావాలనుకునే నిర్ణయం సహేతుకమా? కాదా? అనేది ఆలోచించుకోండి. ఒకవేళ మరో బిడ్డను కన్న తర్వాత అతను మళ్లీ అదే మార్గంలో వెళ్తే మీరు ఆ బాధను మర్చిపోయి ఇద్దరు పిల్లలని చూసుకోగలిగే పరిస్థితి ఉందా? అనేది కూడా ఆలోచించుకోండి. అతను ఇంట్లో కనీస అవసరాలు తప్పితే ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదని మీరే చెబుతున్నారు. అలాంటప్పుడు కుటుంబానికి తోడ్పాటు, ఆసరాను అందించకపోవడంతో పాటు, తనపై మీకు తిరిగి నమ్మకం కలిగించడానికి అతను ఎలాంటి ప్రయత్నం చేయనప్పుడు మరో బిడ్డను కనడం గురించి ఆలోచించడం ఎంత వరకు సహేతుకం? అనేది ఓసారి పరిశీలించుకోండి.

పాపకు పదేళ్ల వయసొచ్చింది కాబట్టి ఆటలు, ఇతర వ్యాపకాల దిశగా ఆమెను ప్రోత్సహించి.. ఎక్కువ సమయం తన తోటి స్నేహితులతో, బంధువుల పిల్లలతో గడిపేటట్టుగా చేయండి. మీకు, మీ భర్తకు మధ్య అనుబంధం పునర్నిర్మించుకోవాలనుంటే మాత్రం ఇద్దరూ కలిసి మానసిక నిపుణుల దగ్గరకి వెళ్లడం.. అతని ఆరోగ్యం విషయంలో తగిన పరీక్షలు చేయించి ఎలాంటి అనారోగ్యాలు లేవని నిర్ధరించుకోవడం.. ఒకవేళ అనారోగ్యాలుంటే వాటికి తగిన చికిత్స తీసుకోవడం.. ఇవన్నీ ముఖ్యమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని