Published : 29/09/2022 00:27 IST

ఆ సమస్యలు వారితోపాటు పెరిగి..

పిల్లలు సాయంత్రం రాగానే స్కూల్‌ విశేషాలు చెప్పడానికి ఉత్సాహ పడతారు. వారి మాటలు ఇంట్లో ఎవరూ వినకపోతే ఆ నిర్లక్ష్యం వాళ్లను ఒంటరిగానే ఎదిగేలా చేస్తుంది. పిల్లల మనసును అర్థం చేసుకోకుండా పెద్దవాళ్లు చేసే పొరపాట్లు వారి భవిష్యత్తుకు ఆటంకాలుగా మారతాయంటున్నారు నిపుణులు.

పిల్లలు తమ అనుభవాలు, ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకోవాలనుకుంటారు. స్కూల్‌ నుంచి వచ్చిన వెంటనే.. స్నేహితులతో ఆడుకున్నప్పుడు జరిగినవి, తమకు నచ్చినవీ, నచ్చనివీ ఉత్సాహంగా చెప్పడానికి వస్తారు. పని ఒత్తిడి, సమయా భావంతో తర్వాత మాట్లాడతా, వెళ్లి చదువుకో అని చిన్నారులను సున్నితంగా పక్కకు పంపినా.. అది వారి మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ క్షణాలు వారి మనసులో పాతుకుపోతాయి. పెద్దైనా వారిని వెంటాడతాయి. తమ మనసులో మాటలను పంచుకోవడానికి ఎవరూ లేరనే న్యూనతా భావం పెరుగుతుంది. అది పెద్దైనా కూడా మానసికంగా ఒంటరి వాళ్లగానే ఉంచుతుంది. అందుకే ఎంత పనిలో ఉన్నా.. పిల్లలను అశ్రద్ధ చేయకుండా వారితో సమయాన్ని గడపాలి.

ఆహారంలో స్ఫూర్తి...
ఇంట్లో వండే సమయం లేకనో, లేదంటే వారు పేచీ పెడుతున్నారని పిజ్జా, బర్గర్‌ వంటివి కొనివ్వకూడదు. ఇలా చేస్తే చేతులారా మనమే పిల్లల ఆహారపుటలవాట్లను పెడదోవ పట్టిస్తున్నట్లే. వాళ్లకు మనం స్ఫూర్తిగా ఉండాలి. ఇంటి ఆహారం లేదా వారు కోరిన దాన్ని వండి అందించడం వంటివి చిన్నారులకు మంచి అలవాట్లను నేర్పుతాయి. తనకిష్టమైనది అందిస్తూనే, వాటిలోని పోషక విలువలపై అవగాహన కలిగిస్తే, తర్వాత కూడా వారు అవే అలవాట్లను పాటిస్తారు.  

తెలియనిది..
చిన్నారులకెన్నో సందేహాలుంటాయి. వారి ప్రశ్నలకు పెద్దవాళ్ల వద్ద సమాధానం లేకపోవచ్చు. అంతమాత్రాన నోటికొచ్చింది చెప్పడం లేదా అక్కడితో ఆ చర్చను ఆపేయడం చేయకూడదు. తెలియకపోతే తెలుసుకొని చెప్పాలి. పిల్లల కోసం ప్రాపంచిక జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం అమ్మానాన్నలకుంది. దీంతో వారిలో సందేహాలను తీర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. సృజనాత్మకత వంటి పలు నైపుణ్యాలు పెరుగుతాయి.

వారెదుట వాదన..
ఇంట్లో సమస్య వచ్చినప్పుడు అమ్మానాన్న ప్రశాంతంగా మాట్లాడుకోకుండా వాదించుకోవడం పిల్లల మనసును గాయపరుస్తుంది. వారిలో అభద్రతాభావం పెరుగుతుంది. పైకి చెప్పలేని ఆందోళన ఆవరిస్తుంది. తనపై తల్లిదండ్రులు ఆ కోపాన్ని ప్రదర్శిస్తారేమో అనే ఒత్తిడి వారిని మానసికంగా ఆరోగ్యంగా ఎదగనివ్వదు. వారిలో వారే కుమిలిపోతారు. పిల్లలెదుట సమస్యలను చర్చించుకోకుంటే మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని