Published : 25/08/2022 17:52 IST

బరువు తగ్గాలా? అయితే పీనట్‌ బటర్‌ను ఇలా తీసుకోండి!

బరువు తగ్గినా, పెరిగినా.. అది ఆరోగ్యకరంగా జరిగినప్పుడే ఎలాంటి సమస్యలు తలెత్తవు. అయితే బరువు పెరిగేందుకు చాలామంది పీనట్‌ బటర్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఇది బరువు తగ్గించడంలోనూ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దీన్ని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. మరి, కొవ్వులు, క్యాలరీలు ఎక్కువగా ఉండే పీనట్‌ బటర్‌ను ఎలా తీసుకుంటే బరువు తగ్గుతాం? రండి.. తెలుసుకుందాం..!

నాజూగ్గా ఇలా!

అధిక బరువును తగ్గించుకునే క్రమంలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉండే పదార్థాల్ని మాత్రమే ఆహారంలో చేర్చుకుంటాం. అలాంటిది ఈ రెండూ ఎక్కువ మొత్తంలో ఉండే పీనట్‌ బటర్‌ బరువు తగ్గడంలోనూ సహకరిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడమే కారణం. అలాగే ఇందులో ఉండే ప్రొటీన్లు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేసి.. చిరుతిండ్లపైకి మనసు మళ్లకుండా చేస్తాయి. అలాగే తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ విలువ కలిగిన ఈ పదార్థం జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవన్నీ అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రేరేపిస్తాయి.

ఎలా తీసుకోవాలంటే..?!

అయితే పీనట్‌ బటర్‌ను తీసుకునే క్రమంలో కొన్ని చిట్కాలు పాటిస్తేనే ఈ ఫలితం పొందచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

బరువు తగ్గాలనుకునే వారు ఉప్పు కలపకుండా తయారుచేసినది ఎంచుకోవాలి. లేకపోతే శరీరంలో సోడియం స్థాయులు క్రమంగా పెరిగిపోయి.. శరీరం నీటిని నిలుపుకోవడం మొదలుపెడుతుంది. తద్వారా కడుపుబ్బరంతో పాటు బరువూ పెరుగుతాం. కాబట్టి పీనట్‌ బటర్‌ను కొనే ముందు లేబుల్‌ను ఓసారి పరిశీలించి ఉప్పు కలపనిది ఎంచుకోవాలి.

రుచి బాగుంది కదా అని పీనట్‌ బటర్‌ ఒక్కటే ఎక్కువ మొత్తంలో లాగించేస్తే బరువు తగ్గడానికి బదులు పెరిగే ప్రమాదమే ఎక్కువ. కాబట్టి దాన్ని ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడం మేలంటున్నారు నిపుణులు. అలాగని తక్కువ కొవ్వులున్న పీనట్‌ బటర్‌ పేరుతో కూడా ఇది మార్కెట్లో దొరుకుతుంది. అది కూడా మంచిది కాదంటున్నారు.

పల్లి, నువ్వులు, డ్రైఫ్రూట్స్‌తో తయారుచేసిన చిక్కీలంటే ఎవరికిష్టముండదు చెప్పండి.. అయితే వీటిని ప్లెయిన్‌గా కాకుండా.. కాస్త పీనట్‌ బటర్‌తో కలిపి తీసుకోండి.. అటు రుచికి రుచి.. ఇటు బరువూ తగ్గుతారు.

బ్రెడ్‌ టోస్ట్‌పై టీస్పూన్‌ పీనట్‌ బటర్‌ రాసుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే దీనిపై నుంచి కొన్ని వేయించిన పల్లీల్ని చల్లుకున్నా మరింత రుచిగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారు చాలామంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్‌మీల్‌ తీసుకుంటుంటారు. అయితే ఇందులో టీస్పూన్‌ పీనట్‌ బటర్‌ కలుపుకొని తీసుకుంటే రుచిగానూ ఉంటుంది.. బరువు తగ్గే ప్రక్రియ మరింత వేగవంతమూ అవుతుంది.

పండ్లతో సలాడ్‌ చేసుకున్నప్పుడు.. నిమ్మరసం, సాస్‌.. వంటి వాటితో గార్నిష్‌ చేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. అయితే ఈసారి నుంచి వాటితో పాటు కాస్త పీనట్‌ బటర్‌నూ ఉపయోగించి చూడండి. పండ్ల ముక్కలపైనా పీనట్‌ బటర్‌ రాసుకొని తీసుకోవచ్చు.

స్మూతీస్‌, పండ్ల రసాలు చేసుకునేటప్పుడు కాస్త పీనట్‌ బటర్‌ను దానికి జతచేస్తే ఆ రుచే వేరు!

పీనట్‌ బటర్‌ను ఐస్‌క్రీమ్స్‌, చాక్లెట్స్‌.. వంటి వాటితో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతాం. ఎందుకంటే ఈ రెండింటిలో చక్కెర, క్యాలరీలు ఎక్కువ.. కాబట్టి వీటితో కలిపి తీసుకోకూడదు.

ఇంట్లోనే ఈజీగా!

మార్కెట్లో ప్రిజర్వేటివ్స్‌ కలిపే పీనట్‌ బటర్‌ను కొనడం కంటే ఇంట్లోనే సులభంగా దీన్ని తయారుచేసుకోవచ్చు. ఈ క్రమంలో ముందుగా.. కావాల్సినన్ని పల్లీల్ని తక్కువ మంటపై వేయించుకొని చల్లారనివ్వాలి. ఆపై పొట్టు తొలగించి.. మిక్సీలో వేసి మధ్యమధ్యలో కలుపుతూ బాగా గ్రైండ్‌ చేయాలి.. ముద్దలా వచ్చాక రుచి కోసం అవసరమైతే టీస్పూన్‌ తేనె కూడా జతచేసుకోవచ్చు. ఇలా ఇంకాసేపు మిక్సీ పడితే జారుడుగా తయారవుతుంది. ఇలా తయారైన బటర్‌ను టోస్ట్‌, చపాతీపై రాసుకొని తినచ్చు.. లేదంటే పైన చెప్పిన కాంబినేషన్స్‌ ప్రయత్నించచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్